Crime News: చిత్తూరు జిల్లాలో దారుణం - ఆడుకుంటున్న బాలికను తీసుకెళ్లి లైంగిక దాడి, పోలీసుల అదుపులో నిందితుడు
Andhrapradesh News: చిత్తూరు జిల్లాలో పదేళ్ల బాలికపై ఓ మృగాడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితునిపై పోక్సో కేసు నమోదు చేశారు.
Man Abused Girl In Chittor: ఏపీలో చిన్నారులపై దారుణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. నంద్యాల, విజయనగరం, తిరుపతి జిల్లాల్లో ఘటనలు మరువక ముందే చిత్తూరు (Chittor) జిల్లాలో పదేళ్ల బాలికపై ఓ మృగాడి లైంగిక దాడి ఘటన కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పులిచెర్ల (Pulicherla) మండలం ముప్పిరెడ్డిగారిపల్లెలో ఈ దారుణం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన దంపతులకు ఓ కుమారుడు, పదేళ్ల కుమార్తె ఉన్నారు. రోజూలానే తల్లిదండ్రులు శనివారం కూలీ పనులకు వెళ్లగా.. బాలిక సచివాలయం వద్ద ఆడుకోవడానికి వెళ్లింది. అదే సమయంలో అక్కడకు వచ్చిన రెడ్డి హుస్సేన్ (26) అనే వ్యక్తి అక్కడకు వచ్చి బాలికకు మాయమాటలు చెప్పి సమీపంలోని మామిడి తోటలోకి తీసుకెళ్లాడు. అనంతరం బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.
తల్లి ఫిర్యాదుతో
నిందితుడు లైంగిక దాడికి పాల్పడుతుండగా బాలిక కేకలు వేయడంతో తల్లి పరుగున వెళ్లింది. తల్లిని చూసిన నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. దీనిపై బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. నిందితునిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అనంతరం నిందితున్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
కాగా, ఇటీవలే తిరుపతి జిల్లాలో ఎనిమిదేళ్ల చిన్నారికి ఓ యువకుడు బిస్కెట్లు ఆశ చూపి అత్యాచారం చేసి చంపేశాడు. ఈ ఘటన దొరవారిసత్రం మండలం నెలబల్లి గ్రామంలో జరిగింది. బీహార్ నుంచి వలస వచ్చిన కొన్ని కుటుంబాలు గ్రామంలోని ఓ రైస్ మిల్లులో పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అందులో పని చేస్తోన్న భార్యాభర్తల రెండో కుమార్తె (8)ను అదే మిల్లులో పని చేస్తోన్న బీహార్‌కు చెందిన ఓ యువకుడు (20) బిస్కెట్లు ఇప్పిస్తానని ఆశ చూపి ఈ దారుణానికి ఒడిగట్టాడు. అటవీ ప్రాంతంలో బాలిక మృతదేహాన్ని గుర్తించి స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలిక ఒంటిపై గాయాలను గుర్తించారు. గంజాయి మత్తులోనే నిందితుడు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
వీడని ముచ్చుమర్రి బాలిక మిస్టరీ
అటు, నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ముచ్చుమర్రిలో 8 ఏళ్ల చిన్నారిపై ముగ్గురు మైనర్లు అత్యాచారం చేసి చంపేసిన ఘటనలో బాలిక మృతదేహం ఇంకా లభ్యం కాలేదు. బాలికను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి చంపేసిన నిందితులు పూటకో మాట మారుస్తూ పోలీసులకు చుక్కలు చూపిస్తున్నారు. తాజాగా, ఇదే కేసుకు సంబంధించి శనివారం అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో పోలీసుల అదుపులో ఉన్న నందికొట్కూరుకు చెందిన హుస్సేన్ అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. బాలిక మృతదేహాన్ని మాయం చేసేందుకు ముగ్గురు మైనర్లకు సహకరించిన నలుగురు కుటుంబ సభ్యులను పోలీసులు 3 రోజుల క్రితం అదుపులోకి తీసుకోగా... అందులో ఒకరైన హుస్సేన్ శనివారం తెల్లవారుజామున పోలీస్ స్టేషన్‌లో మృతి చెందాడు. మృతదేహంపై గాయాలున్నాయని.. లాకప్ డెత్ అయ్యాడని బంధువులు అనుమానిస్తున్నారు. పోలీసులు దీనిపై విచారిస్తున్నారు.
Also Read: Secunderabad News: భార్య, 10 నెలల బిడ్డను చంపేసిన భర్త! పోలీసులకు ఫోన్ - అనంతరం మరో ఘోరం!