పుట్టిన రోజునాడు ప్రాణం తీసిన ఈత సరదా, ముగ్గురు విద్యార్థులు మృతి
పుట్టిన రోజు నాడు సరదాగా నీటిలో దిగిన విద్యార్థులు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన మేడ్చల్ జిల్లా చిర్యాల్ లో జరిగింది.
ప్రాణం తీసిన ఈత సరదా, ఈత సరదా ప్రాణం తీసింది, విద్యార్థులను మింగిన చెరువు, చెరువులో వ్యక్తుల గల్లంతు, సరదా కోసం దిగారు ప్రాణాలు వదిలారు.. ఇలాంటి వార్తలు చాలా చాలా చూసే ఉంటారు. ఎప్పుడూ ఏదో ఒక చోట ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఈత రాకపోయినా.. స్నేహితులతో సరదాగా కాలక్షేపం చేద్దామని నీటిలోకి దిగి ప్రాణాలు కోల్పోతున్నారు. మొదట ఒడ్డునే, మెట్లపైనే ఉండి సరదా పడతామని అనుకుంటారు. మిగతా ఫ్రెండ్స్ నీటిలో ఈత కొడుతూ వారి కేరింతలు చూసి ఒడ్డున ఉన్న వాళ్లు కూడా నీటిలోకి దిగుతారు. లోతు గుర్తించలేకపోవడం, నీటి ప్రవాహ వేగాన్ని అంచనా వేయలేకపోవడం లాంటి కారణాల వల్ల నీటిలో పట్టు తప్పిపోతున్నారు.
ఈత రానిదే నీటిలోకి దిగకూడదని ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయమే. అయినా.. నీటిని చూడగానే, ముఖ్యంగా ఫ్రెండ్స్ తో ఉన్నప్పుడు ఆ ఉత్సాహంలో నీటిలోకి దిగి ఈత రాక గల్లంతు అవుతున్నారు. ప్రాణాలు కాపాడుకునే నైపుణ్యం లేక తుది శ్వాస విడుస్తున్నారు. మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఈత సరదానే.. ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు తీసింది.
సరదాగా నీటిలో దిగారు..
మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని చిర్యాల్ గ్రామంలో విషాదం నెలకొంది. సరదాగా ఈతకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు చిర్యాల్ నాట్కం చెరువులో మునిగి చనిపోయారు. బుధవారం రోజు హరహరన్, ఉబేద్ అనే ఇద్దరు విద్యార్థుల పుట్టిన రోజు. బర్త్ డే సందర్భంగా.. తొమ్మిది మంది విద్యార్థులు కలిసి చిర్యాల్ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వెళ్లారు. తిరిగి వెళ్లే సమయంలో సరదాగా ఈత కొట్టేందుకు చిర్యాల నాట్కం చెరువుకు వెళ్లారు. ఈత కొడుతుండగానే ముగ్గురు విద్యార్థులు నాట్కం చెరువులో గల్లంతు అయ్యారు. మిగతా విద్యార్థులు చూస్తుండగానే ముగ్గురూ నీటిలో మునిగి పోయారు.
ముగ్గురు మృతి..
తొమ్మిది మంది విద్యార్థులు తీగల కృష్ణారెడ్డి కళాశాలకు చెందిన వారు. వీరంతా డిప్లొమో 3 వ సంవత్సరం చదువుతున్నారు. విషయం తెలియగానే కీసర పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాలాజీ అనే విద్యార్థి మృత దేహాన్ని చెరువు నుంచి బయటకు వెలికి తీశారు. మిగతా ఇద్దరు విద్యార్థుల మృతదేహాల కోసం స్థానికుల సహయంతో అగ్నిమాపక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. చనిపోయిన వారిలో హరిహరన్, ఉబేద్, బాలాజీ ఉన్నారు. మిగతా ఆరుగురు విద్యార్థులు కీసర పోలీసుల అదుపులో ఉన్నారు. కుమారుల మృతితో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. ముగ్గురు విద్యార్థులు చనిపోవడంతో చిర్యాల్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
నీటిలో దిగవద్దు..
ఈత రాని నీటిలో దిగవద్దని అధికారులు, పోలీసులు సూచిస్తున్నారు. ముఖ్యంగా లోతు ఎక్కువగా ఉండే చెరువుల్లో, అలాగే ప్రవాహం అంచనా వేయలేని కాలువలు, నదుల్లో దిగకూడదని సూచిస్తున్నారు. ముఖ్యంగా ఫ్రెండ్స్ తో వెళ్లిన సమయంలో సరదా కోసం నీటిలో దిగవద్దని, ఒక్కోసారి ఈత వచ్చినా.. ప్రవాహ వేగానికి కొట్టుకుపోయే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.