Narayankhed: నారాయణఖేడ్ లో భారీ అగ్ని ప్రమాదం - మూడు కార్లు దగ్ధం
Fire Accident: సంగారెడ్డి జిల్లాలో కారు షెడ్డులో జరిగిన అగ్ని ప్రమాదంలో మూడు కార్లు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది మంటలు అదుపులోకి తెచ్చారు.
Fire Accident in Narayankhed: సంగారెడ్డి (Sangareddy) జిల్లా నారాయణఖేడ్ (Narayankhed) లో బుధవారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ కారు మెకానిక్ షెడ్డులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో మూడు కార్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఘటనా స్థలంలో దట్టమైన పొగలు అలుముకోగా ప్రజలు ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపులోకి తెచ్చారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. భారీగా ఆస్తి నష్టం సంభవించిందని.. ఇంకా ఎంత నష్టం జరిగిందనేది అంచనాకు రాలేదని షెడ్డు యజమాని తెలిపారు. పోలీసులు ఈ ఘటనపై విచారణ చేస్తున్నారు.
అటు, హైదరాబాద్ లోని సైఫాబాద్ రోడ్డు వద్ద బుధవారం మధ్యాహ్నం నడుస్తున్న కారులో మంటలు చెలరేగాయి. కారు లక్డీకాపూల్ నుంచి ఖైరతాబాద్ వైపు వెళ్తుండగా అందులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే కారును రోడ్డు పక్కన ఆపేశాడు. కారులోని వారంతా కిందకు దిగి ప్రాణాలు కాపాడుకున్నారు. అనంతరం నిమిషాల వ్యవధిలోనే కారు దగ్ధమైంది. దట్టమైన పొగలతో అగ్ని కీలలు ఎగిసిపడగా.. స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనతో సమీపంలోని హెచ్ పీ పెట్రోల్ పంపును మూసేశారు. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలు అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు చెలరేగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.