మాజీ సీఐ నాగేశ్వరరావుకు బెయిల్ మంజూరు
వివాహితపై అత్యాచారం కేసులో నాగేశ్వరరావుకు కోర్టు బెయిల్ ఇచ్చింది. లక్ష పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది.
మారేడ్ పల్లి మాజీ ఇన్ స్పెక్టర్ నాగేశ్వర రావుకు తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ. లక్ష పూచీకత్తుపై బెయిల్ ఇచ్చింది. వివాహిత కిడ్నాప్, అత్యాచారం కేసులో మాజీ సీఐ నాగేశ్వర రావు జైలుకు వెళ్లారు. ఈ కేసులో బెయిల్ కావాలంటూ ఇప్పటికే రెండు సార్లు నాగేశ్వర రావు కోర్టుకు వెళ్లగా.. న్యాయస్థానం నిరాకరించింది. తాజాగా లక్ష రూపాయలతో పూచీకత్తుతోపాటు, పలు షరతుల మేరకు బెయిల్ ఇచ్చింది. రెండు నెలల పాటు ప్రతీ రోజూ ఉదయం 10 గంటలకు విచారణ అధికారి ముందు హాజరు కావాలని నాగేశ్వర రావుకు హైకోర్టు షరతు విధించింది.
వివాహితకు గన్ గురిపెట్టి రేప్..
హైదరాబాద్ లో ఓ వివాహితకు గన్ గురి పెట్టి బెదిరించి ఆమెను అత్యాచారం చేశాడు మారేడుపల్లి సీఐ నాగేశ్వరరావు. వివాహిత ఫిర్యాదుతో సీఐ దుశ్చర్య బయటకు వచ్చింది. ఈ కేసు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపడంతో ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. అత్యాచారం, కిడ్నాప్, హత్యాయత్నం, ఆయుధ నిరోధక చట్టం కింద నాగేశ్వర రావుపై కేసులు నమోదు చేశారు. బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించి ఆమె నుంచి వాంగ్మూలం రికార్డు చేశారు.
విచారణలో సీఐ నాగేశ్వరరావు గురించి సంచలన విషయాలు బయటకు వచ్చాయి. అంతకు ముందు సంచనం సృష్టించిన బంజారాహిల్స్ భూకబ్జా కేసులోనూ నాగేశ్వరరావు అక్రమాలకు పాల్పడినట్లు వెల్లడైంది. ప్రభుత్వ స్థలాన్ని అతి తక్కువ ధరకే కొట్టేయాలని భావిస్తున్న ఓ ప్రైవేటు సంస్థకు సీఐ నాగేశ్వరరావు అండగా నిలిచి కేసుని తారుమారు చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. బంజారాహిల్స్ భూ కబ్జా కేసులో అవతలి పక్షం నుంచి డబ్బులు తీసుకుని అసలు హక్కుదారుల్నే కబ్జాదారులుగా సీఐ నాగేశ్వరరావు మార్చేశారని బాధితులు చెబుతున్నారు. 60 నుంచి 70 మందిని ఒకేసారి పోలీసులు అరెస్టు చేయడంతో అప్పట్లో ఈ కేసు సంచలం సృష్టించింది.
నాగేశ్వరరావు అక్రమాలు అన్నీ ఇన్నా కావు..
నాగేశ్వరరావు దుర్మార్గాలు వెలుగులోకి రావడంతో తమకు జరిగిన అన్యాయంపై బాధితులు గళం విప్పారు. ప్రభుత్వంలోని పెద్దల అండదండలు ఉన్నాయంటూ తమని వేధించిన సీఐ నాగేశ్వరరావుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఉన్నతాధికారులకు, నాయకులకు కోట్ల రూపాయలు ఇచ్చి పోస్టింగ్ తెచ్చుకున్నాను, కాబట్టి నాకు కూడా అంతే డబ్బులు రావాలి అంటూ ప్రచారం చేసుకున్నాడనే ఆరోపణలు వినిపించాయి. సీఐను విధుల నుంచి తొలిగించి కేసు నమోదు చేశారు.
జులై 6 నాగేశ్వరరావు ఏం చేశారంటే..
జులై 6న తుపాకీతో వివాహితను బెదిరించి ఆమెపై అత్యాచారం చేశారు. ఆ తర్వాత బాధితురాలితోపాటు ఆమె భర్తను బలవంతంగా కారులో తీసుకెళ్తుండగా ఆ కారు ప్రమాదానికి గురైంది. ఇదే సమయంలో బాధితులు నాగేశ్వరరావు నుంచి తప్పించుకున్నారు. తర్వాత వనస్థలిపురం పీఎస్ లో కంప్లైంట్ ఇచ్చారు. మొదట పరారైన నాగేశ్వరరావు.. తర్వాత బాధితులతో రాజీ కుదుర్చుకునేందుకు ప్రయత్నించారు. కానీ ఉన్నతాధికారులు ఈ కేసుపై సీరియస్ గా ఉండటంతో నాగేశ్వరరావును అరెస్టు చేసి, తన అక్రమాలు అన్నీ బయట పెట్టారు.