Telangana Gadwal News: భార్యపై అనుమానం.. కొండ అంచున సెల్ఫీ డ్రామా.. భర్త మాస్టర్ ప్లాన్, చివరికి ఏమైందంటే!
కట్టుకున్న భార్యపై అనుమానం పెంచుకున్న ఓ భర్త అమానుషానికి ఒడిగట్టాడు. అంతకుముందే అతనికి ఓ ప్రియురాలు ఉండగా.. తనకు ఉన్న అలవాట్లు భార్యకు కూడా ఉన్నాయని అతిగా ఆలోచించి ఆమెపై అనుమానపు చూపులు చూశాడు.
పెళ్లి జరిగి రెండు నెలలు కూడా గడవకముందే ఓ భర్త తన భార్యను వదిలించుకునే ప్రయత్నం చేశాడు. ఏకంగా కొండ పైనుంచి కిందకి తోసేసి భార్యను అంతమొందించాడు. అంతేకాదు, ఆ నేరం నుంచి తప్పించుకొనేందుకు సినిమా స్థాయిలో కథ అల్లాడు. కానీ, పోలీసులు తమదైన శైలిలో విచారణ జరపడంతో అసలు విషయం బయటికి వచ్చింది. అతను అల్లిన కథ విని పోలీసులే షాక్ అయ్యారు.
కట్టుకున్న భార్యపై అనుమానం పెంచుకున్న ఓ భర్త అమానుషానికి ఒడిగట్టాడు. అంతకుముందే అతనికి ఓ ప్రియురాలు ఉండగా.. తనకు ఉన్న అలవాట్లు భార్యకు కూడా ఉన్నాయని అతిగా ఆలోచించి ఆమెపై అనుమానపు చూపులు చూశాడు. ప్రియురాలిని పెళ్లి చేసుకోవడం కోసం భార్యను కడతేర్చిన ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో చోటు చేసుకుంది. గద్వాల జిల్లాలోని గట్టు మండలం చిన్నోని పల్లె గ్రామానికి చెందిన జయరాములు గౌడ్‌కు ఆలంపూర్ మండలం జిల్లెల గ్రామానికి చెందిన మద్దిలేటి శరణ్యకు గత రెండు నెలల క్రితం పెళ్లి జరిగింది. అయితే జయరాములు గౌడ్‌కు అప్పటికే వేరే అమ్మాయితో సంబంధం ఉందని పోలీసులు తెలిపారు. తాను ప్రేమించిన అమ్మాయి కోసం భార్యను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం మాస్టర్ ప్లాన్ వేశాడు.
ఈ నెల 11న తన ప్రణాళికను అమలు చేశాడు. ఆధార్ కార్డులో అడ్రస్ మారుస్తామని, భార్యను అయిజ మండల కేంద్రానికి తీసుకువెళ్లాడు. అక్కడ నుంచి ముందస్తు ప్రణాళిక ప్రకారం తిరుమలయ్య గుట్టకు గుడి పేరుతో తీసుకువెళ్లాడు. గుట్ట చివరి అంచున సెల్ఫీ దిగుదామని నమ్మించి కొనకు తీసుకెళ్లి.. ఫోటో దిగే క్రమంలో అక్కడి నుంచి తోసేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
తప్పించుకొనేందుకు మరో ప్లాన్
వెంటనే తన అత్తమామలకు ఫోన్ చేసి శరణ్య కనిపించడం లేదంటూ బుకాయించాడు. తాను ఆధార్ కార్డు అడ్రస్ మార్పు కోసం అయిజ మండల కేంద్రానికి వెళ్లామని.. అక్కడ నెట్‌వర్క్ రాకపోవడంతో మరో చోటికి వెళ్లామని నమ్మబలికాడు. వెంటనే ఆమెకు కడుపు నొప్పి రావడంతో ఆసుపత్రికి తీసుకువెళుతున్న సమయంలో మధ్యలో బస్టాండ్ వద్ద బైకు ఆగిపోయిందని చెప్పాడు. తాను రిపేర్ చేయించుకొని వచ్చేలోపు అక్కడే ఉంటున్న తన అక్క ఇంటికి వెళ్లమని చెప్పానని.. ఆమె వెళ్లలేదని చెప్పాడు.
అల్లుడిపై అనుమానం వచ్చిన శరణ్య తండ్రి వెంటనే అయిజ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు తమశైలిలో భర్తను విచారణ జరపగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. శరణ్యను తాను కొండపై నుండి తోసేసినట్లు అతను ఒప్పుకున్నాడు. దీంతో శవాన్ని గుర్తించిన పోలీసులు పోస్టు మార్టానికి తరలించారు. భర్త జయరాములు గౌడ్‌పై హత్య కేసు నమోదు చేశారు.