TRS vs BJP: బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ - రెండు వర్గాలుగా చీలిపోయి కొట్టుకున్న కార్యకర్తలు
TRS vs BJP: బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తలు రెండు వర్గాలుగా చీలిపోయిన ఒకరినొకరు కొట్టుకున్నారు. ఈ ఘటనలో పలువురు బీజేపీ నాయకులు గాయపడగా.. వారిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
TRS vs BJP: సిద్దిపేట జిల్లా కేంద్రంలో బీజేపీ, టీఆర్ఎస్ నాయకులు మధ్య ఫైట్ జరిగింది. రెండు వర్గాలుగా చీలిపోయిన ఇరు పార్టీల కార్యకర్తలు కర్రలతో దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో పలువురు బీజేపీ నాయకులు గాయపడగా.. వారిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పట్టణంలోని 23, 24 వార్డులకు సంబంధించి టీఆర్ఎస్, బీజేపీ నాయకులు... దేవీ నవరాత్రుల్లో భాగంగా అమ్మవారి మండపం వద్ద ఉన్న వారిని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. బూతులు తిడ్తూ మెసేజ్ లు, ఫోన్ కాల్స్ చేయడంతో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య గొడవలు ప్రారంభం అయ్యాయి. ముందుగా మాటలతో ప్రారంభం అయిన ఈ వార్ ఒకరిపై ఒకరు కర్రలతో దాడి చేసుకునే వరకు వెళ్లింది. ఈ క్రమంలోనే పలువురు బీజేపీ కార్యకర్తల తీవ్ర గాయాలు అయ్యాయి.
గాయపడిన వారిని స్థానిక ప్రజలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెడికల్ టెస్టులు చేసి, రిపోర్ట్ ఇవ్వాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. రిపోర్ట్ ఇచ్చే వైద్యులు ఆస్పత్రిలో లేరని సిబ్బంది చెప్పడంతో బీజేపీ నేతలు మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు, టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీజేపీ కార్యకర్తలపై కావాలనే టీఆర్ఎస్ నాయకులు దాడి చేసినట్లు వివరించారు.
అయితే అంతకు ముందు కేసీఆర్ స్థాపించిన బీఆర్ఏస్ పార్టీపై బీరు, రమ్ము, సారా అంటూ ట్రోల్స్ చేయడమే ఘర్ణణకు కారణంగా తెలుస్తోంది.
దాదాపు మూడు నెలల క్రితం బీజేపీ ఎంపీపై టీఆర్ఎస్ నాయకుల దాడి..
నిజామాబాద్ ఎంపీ అర్వింద్ పై దాదాపు మూడు నెలల క్రితం టీఆర్ఎస్ నాయకులు దాడి చేశారు. ఆ దాడి ఘటన అధికార-విపక్షాల మధ్య మరోసారి చిచ్చు రేపింది. ఇందుకు కారణం మీరంటే మీరని ఇరు పార్టీలు ఆరోపణలు చేసుకున్నాయి. అసలు ఎంపీపై దాడి చేసింది ఎవరు. ఎందుకు చేశారన్న ప్రశ్నలపై రాజకీయ విశ్లేషకులు రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి.
ఎంపీ అర్వింద్ పై దాడి..
ప్రజా సమస్యలపై స్పందించాల్సిన రాజకీయ నాయకులు ఆ విషయాలను అడ్డు పెట్టుకొని తిట్టుకోవడమే సరిపోతోంది కానీ ఎన్నుకున్న ప్రజలను పట్టించుకున్న దాఖలాలు లేకుండా పోతుందని రాజకీయ విశ్లేషకులు ఉంటున్నారు. అందుకే నేతల మాటల్లోని ఫైర్ ని ఫాలో అవుతున్న బాధితులు అదే రూట్లో వారికి చేతల్లో చూపిస్తున్నారంటూ ధర్మపురి ఎంపీ అర్వింద్ పై దాడిని ప్రస్తావించారు. వాన, వరదలతో ఇబ్బంది పడుతున్న జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్ధండి గ్రామానికి వెళ్లారు ఎంపీ అర్వింద్. ఆయనపై దాడికి దిగారు కొందరు. చెప్పుల దండని వేయడానికి ప్రయత్నించారు. కాన్వాయ్ ని అడ్డుకొని అద్దాలు పగలకొట్టారు. క్షణంలో అంతా జరిగిపోయింది. పోలీసుల అడ్డుకోవడంతో ఎంపీ అక్కడి నుంచి క్షేమంగా బయటపడ్డారు. అసలు గ్రామస్తులకు ఎందుకంత కోపం వచ్చింది అన్నదానిపై రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి.
మల్లన్నగట్టు భూ పరిష్కారంపై..
మల్లన్నగట్టు భూపరిష్కారం విషయంపై గతంలో గ్రామస్తులు కొందరు ఎంపీని కలిశారట. అప్పుడు పట్టించుకోలేదట. అందుకే ఇప్పుడు ఇలా దాడికి పాల్పడ్డారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా ఎంపీపై దాడి జరగడం ఇది మొదటిసారి కాదు గతంలో కూడా జరిగాయి. పసుపు బోర్డు విషయంలో ఎంపీ కనిపించడం లేదని, ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర వైఖరిని తప్పుబడుతూ ఇంటి ఎదుటే నిరసనలు తెలిపారు. అయితే ఎంపీపై జరిగిన దాడి వెనక టీఆర్‌ఎస్ కుట్ర ఉందని బీజేపీ ఆరోపిస్తోంది. అధికారపార్టీ చేతకాని తనాన్ని కప్పిపుచ్చుకోవడానికి దాడులకు దిగుతోందని ఆపార్టీ నేతలు విమర్శిస్తున్నారు.