(Source: ECI/ABP News/ABP Majha)
Shamshabad News : మద్యం మత్తులో కానిస్టేబుల్ వీరంగం, రోడ్డుకు అడ్డంగా కారునిలిపి హంగామా!
Shamshabad News : శంషాబాద్ లో మద్యం మత్తులో కానిస్టేబుల్ హల్ చల్ చేశాడు. రోడ్డుకు అడ్డంగా కారు నిలిపి ఆ మార్గంలో వచ్చిన వాహనదారులను బూతులు తిడుతూ వీరంగం సృష్టించాడు.
Shamshabad News : డ్యూటీలో ఉన్న పోలీస్ కానిస్టేబుల్ మద్యం మత్తులో నడిరోడ్డుపై లారీలను ఆపి వీరంగం సృష్టించాడు. కానిస్టేబుల్ తన కారును రోడ్డుకు అడ్డంగా పెట్టడంతో వాహనాలకు అంతరాయం ఏర్పడింది. ఎక్కడి వాహనాలు అక్కడ నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మద్యం మత్తులో ఉన్న కానిస్టేబుల్ ను ప్రశ్నించిన వారిని నోటికి వచ్చిన బూతులతో తిడుతూ నానా హంగామా సృష్టించాడు. ఈ సంఘటన శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని కోత్వాల్ గూడ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న జి.రాజా మల్లయ్య గత అర్ధరాత్రి మద్యం సేవించి తన కారును రోడ్డు మధ్యలో ఆపి మట్టి లోడుతో వెళ్తున్న టిప్పర్లను ఆపి డబ్బులు వసూలు చేస్తున్నారని స్థానికులు ఆరోపించారు. గచ్చిబౌలి నుండి కారులో వస్తున్న అశ్వీన్ రెడ్డి దంపతులను సైతం ఆపి నోటికి వచ్చిన బూతు పురాణాలతో తిడుతూ వాహనదారులపై దాడి చేశాడని స్థానికలు ఆరోపిస్తున్నారు. దీంతో స్థానికులు డయల్ 100 నెంబర్ కు కాల్ చేయగా... సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మద్యం మత్తులో ఉన్న కానిస్టేబుల్ ను స్టేషన్ కు తరలించారు. అయితే కానిస్టేబుల్ రాజమల్లయ్యపై కేసు నమోదు చేశారు పోలీసులు. మద్యం మత్తులో కానిస్టేబుల్ వీరంగం సృష్టించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మద్యం మత్తులో యువకుడు హల్ చల్
హైదరాబాద్ బంంజారాహిల్స్‌లో ఓ యువకుడు మద్యం మత్తులో వీరంగం సృష్టించాడు. మద్యం తాగి పోలీసులతో గొడవకు దిగాడు. పోలీసులపై దాడికి ప్రయత్నించాడు. ఫిబ్రవరి 27న బంజారాహిల్స్‌లో ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. ఓ యువతితో పాటు కారులో వచ్చిన యువకుడు పోలీసులు వాగ్వాదానికి దిగాడు. అతడు మద్యం సేవించినట్లు గుర్తించి బ్రీత్ అనలైజ్ ఊదాలని అడిగారు. అందుకు యువకుడు నిరాకరించి తాను తాగలేదని, బ్రీత్ అనలైజ్ చేసేందుకు పోలీసులపై బూతులతో రెచ్చిపోయాడు. తాను హైకోర్టు లాయర్‌ను అంటూ హల్ చల్ చేశాడు. దీంతో పోలీసులు బలవంతంగా అతడితో బ్రీత్ అనలైజ్ చేయించారు. అతడు పీకలదాక మద్యం సేవించినట్లు గుర్తించి డ్రంక్ డ్రైవ్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
గస్తీ పోలీసుల మందు సిట్టింగ్
ఇటీవల గస్తీ విధులు గాలికి వదిలేసిన పోలీసులు మద్యం సేవిస్తూ చిక్కారు. మద్యం సేవిస్తూ అడ్డంగా దొరికి పోయారు హైదరాబాద్ పంజాగుట్ట గస్తీ పోలీసులు. ఎర్రమంజిల్ గలేరియా మాల్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. విధుల్లో ఉండి మద్యం సేవిస్తూ అడ్డంగా బుక్కైపోయిన ఖాకీలపై ఉన్నతాధికారులు చర్యలకు చేపట్టారు.
గస్తీ గాలికి వదిలేని మద్యంతో చిల్
పంజాగుట్ట పోలీసులు గస్తీ గాలికి వదిలేసి చక్కగా చుక్క వేసుకుంటున్నారు. అర్ధరాత్రి కదా ఎవరూ రారనే ధైర్యంతో రోడ్డు పక్కనే సిట్టింగ్ పెట్టారు. రోడ్డు పక్కనే పెట్రోలింగ్ పోలీసు వాహనాన్ని అడ్డుగాపెట్టి మద్యం సేవిస్తున్నారు ఇద్దరు పోలీసులు. అటుగా వెళ్తున్న కొందరు పోలీసుల బాగోతాన్ని వీడియో తీశారు. దీంతో గస్తీ పోలీసులు అడ్డంగా బుక్కయ్యారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పంజాగుట్ట ప్రాంతంలో రాత్రి పూట పెట్రోలింగ్ చేయాల్సిన పోలీసులు విధులను గాలికి వదిలేసి రోడ్డు పక్కన కూర్చొని మందేస్తూ ముచ్చట పెట్టారు. మంచింగ్ కోసం తెచ్చుకున్న చికెన్ ను ప్లేట్ పెట్టుకుని అది గాలికి ఎగరకుండా వాకీటాకీని బరువుకు పెట్టారు. మద్యం బాటిల్ ఎవరికీ కనిపించకుండా దాచిపెట్టారు. అయితే సేవిస్తున్న గ్లాసుల్లోని మద్యాన్ని దాచలేకపోయారు. వీడియోలో పోలీసులు మద్యం సేవిస్తున్న రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు.