Hyderabad: హాల్‌లో ఉరేసుకుంటే బెడ్ రూంలో తల్లి శవం! ఇంట్లోనే అనుమానితుడు! కూతురు ఫిర్యాదు
Hyderabad Crime News: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో భార్యాభర్తల గొడవ ఒకరి మృతి చెందారు. ఇందులో అనుమానితుడు తన తండ్రే అని వారి కుమార్తె ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Telugu News Latest: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్‌లో ఓ కుమార్తె తన తండ్రిపైనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. తల్లి అనుమానాస్పద రీతిలో చనిపోవడంతో అందుకు కారణం తండ్రే అని భావించి పోలీసులను ఆశ్రయించింది. ఇంట్లో అనురాధ అనే మహిళ ఉరివేసుకుని మరణించింది. తన తల్లి చనిపోయిన తీరు అత్యంత అనుమానాస్పదంగా ఉండడం గుర్తించిన హతురాలి కుమార్తె తన తండ్రినే అనుమానించినట్లుగా పోలీసులు తెలిపారు.
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో సోమవారం ఈ ఘటన జరిగింది. షాద్ నగర్ లో అనురాధ - శివరామయ్య అనే దంపతులు నివాసం ఉంటున్నారు. వీరి కుమార్తె నందిని. షాద్ నగర్ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్ కథనం ప్రకారం.. సోమవారం ఉదయం వారి ఇంట్లో అనురాధ అనుమానాస్పద స్థితిలో చనిపోయి ఉంది. ఆమె శవం పడక గదిలో ఉండగా ఉరి మాత్రం హాల్ లో బిగించి ఉంది.
సోమవారం ఉదయం కూతురు నందినికి ఆమె తండ్రి శివరామయ్య ఫోన్ చేసి తల్లి అనురాధ ఇంట్లో ఉరి వేసుకుని మరణించిందని చెప్పాడు. దాంతో బంధువులతో పాటు వచ్చి కుమార్తె నందిని తన తల్లి వద్దకు వచ్చింది. హాల్ లో ఫ్యాన్ కు చీర కట్టి ఉండగా.. తల్లి మృతదేహం బెడ్ రూమ్ లో ఉంది. మెడకు తాడు బిగించి ఉరి వేసిన ఆనవాళ్ళు కూడా ఉన్నాయి. అలాగే ఆమె తండ్రి శివరామయ్య కూడా పరారీలో ఉన్నాడు.
పైగా తండ్రి శివరామయ్య మరొక మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. అదే విషయంలో తరచూ భార్య భర్తలకు గొడవలు జరుగుతూ ఉండేవి. దీంతో తన తల్లిని తండ్రే చంపాడని కుమార్తె బలంగా నమ్ముతోంది. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసిందని షాద్ నగర్ ఇన్స్పెక్టర్ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.