Raging: ర్యాగింగ్ వికృత క్రీడ - జూనియర్లపై సీనియర్ల పైశాచికత్వం, పల్నాడు జిల్లాలో ఘటన
Andhrapradesh News: పల్నాడు జిల్లా నరసరావుపేటలోని ఎస్ఎస్ఎన్ కాలేజీ వసతి గృహంలో ర్యాగింగ్ కలకలం రేపింది. ఎన్‌సీసీ సీనియర్ విద్యార్థులు జూనియర్లను చితకబాదిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
Raging In Narasaraopeta SSN College: జూనియర్లకు అండగా నిలవాల్సిన విద్యార్థులే వారిని చిత్రహింసలకు గురి చేశారు. కర్రలతో వీపులపై కొడుతూ పైశాచికానందాన్ని పొందారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. పల్నాడు (Palanadu) జిల్లా నరసరావుపేటలోని (Narasaraopeta) ఎస్ఎస్ఎన్ (శ్రీ సుబ్బరాయ నారాయణ) కళాశాల వసతిగృహంలో ర్యాగింగ్ వికృత క్రీడకు సంబంధించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోపై నరసరావుపేట పట్టణ, గ్రామీణ సీఐలు విచారణ చేపట్టారు. ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఈ ఘటన ఫిబ్రవరిలో జరిగినట్లు పోలీసులు గుర్తించారు. మరోవైపు, ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. జూనియర్లపై ర్యాగింగ్‌కు నిరసనగా కాలేజీ వద్ద ఆందోళన చేపట్టాయి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి.
అలా బయటకు..
నరసరావుపేట ఎస్ఎస్ఎన్ కళాశాలలో (SSN College) ఎన్‌సీసీ ఉండడంతో తల్లిదండ్రులు తమ పిల్లల్ని చేర్పించేందుకు ఆసక్తి చూపుతారు. ఈ క్రమంలో ఇటీవల దాచేపల్లికి చెందిన ఓ పేరెంట్ ఈ కళాశాలలో తన కుమారున్ని చేర్పించాలని భావిస్తుండగా.. అక్కడ ర్యాగింగ్ ఎక్కువగా ఉందని సదరు కుమారుడు ఈ వీడియోను తండ్రికి చూపించాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్ కాగా వసతి గృహంలో ర్యాగింగ్ విషయం వెలుగుచూసింది.
భయంతో మిన్నకుండిపోయారు..
ఎన్‌సీసీ అంటేనే క్రమశిక్షణకు మారుపేరు. వారు వివిధ సామాజిక సేవల్లోనూ పాల్గొంటారు. అయితే, అలాంటి ఎన్‌సీసీ బ్యాచ్ సీనియర్ విద్యార్థులే ఇలా ర్యాగింగ్ పేరుతో జూనియర్లను హింసించడం ఆందోళన కలిగిస్తోంది. రాత్రి పూట జూనియర్లను బయట నిల్చోబెట్టిన సీనియర్ విద్యార్థులు ఒక్కొక్కరిని గది లోపలికి పిలిచారు. అనంతరం వారి రెండు మోచేతులు నేలపై పెట్టించి.. కర్రలతో వెనుక భాగంలో విపరీతంగా కొట్టారు. ఆ దెబ్బలకు తాళలేక జూనియర్లు ఏడుస్తుంటే సీనియర్లు నవ్వుతూ ఉండడం వీడియోలో కనిపించింది. అయితే, ఇక్కడ ఏటా సీనియర్ విద్యార్థులు జూనియర్లపై వికృత చేష్టలకు పాల్పడడం సర్వ సాధారణం అనే విమర్శలు వస్తున్నాయి. ఏటా బీ సర్టిఫికెట్ కోసం వెళ్లే విద్యార్థులను సీనియర్లు ఇలా వెదురు కర్రలతో కొట్టడం పరిపాటిగా మారిందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఈ రాక్షస క్రీడకు వార్డెన్ సహకరిస్తుంటారని, ప్రిన్సిపాల్‌కు తెలిసినా అడ్డుకోవడం లేదని వాపోయతున్నారు. ఒకవేళ, ఈ విషయం బయట చెబితే వారిని హాస్టల్ నుంచి వెళ్లగొడతారనే భయంతోనే బాధిత విద్యార్థులు మిన్నకుండిపోతున్నారని తెలుస్తోంది.
Also Read: Tirupati Crime News: తిరుపతిలో ఘోరం- వదిన సహా ముగ్గురు దారుణహత్య, ఆపై నిందితుడు సూసైడ్