Kolkata: నేను వెళ్లే సరికే రక్తపు మడుగులో ఉంది, భయంతో బయటకు వచ్చాను - నిందితుడి సంచలన వ్యాఖ్యలు
Kolkata Case: కోల్‌కతా హత్యాచార నిందితుడు సంచలన విషయాలు చెప్పాడు. తాను వెళ్లే సరికే సెమినార్ హాల్‌లో డాక్టర్ రక్తపు మడుగులో కనిపించిందని అన్నాడు. అది చూసి భయపడి వచ్చానని చెప్పాడు.
Kolkata Doctor Death Case: కోల్‌హతా హత్యాచార నిందితుడు సంజయ్ రాయ్ మరోసారి తాను అమాయకుడినని అధికారులకు తేల్చి చెప్పాడు. కావాలనే తనను ఈ కేసులో ఇరికించారని, ఏ నేరమూ చేయలేదని చెబుతున్నాడు. అంతే కాదు. తన లాయర్‌కి కూడా పదేపదే ఇదే చెబుతున్నాడని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. సంజయ్ రాయ్ లాయర్ చెబుతున్న వివరాల ప్రకారం సంజయ్ రాయ్ ఎలాంటి నేరం చేయలేదు. లై డిటెక్టర్ టెస్ట్‌లోనూ ఎక్కడా తడబడకుండా ఇదే విషయం చెప్పాడు. సీబీఐ అధికారులు సంజయ్‌ని మొత్తం 10 ప్రశ్నలు అడిగినట్టు చెప్పారు లాయర్ కబితా సర్కార్. డాక్టర్‌ని హత్య చేసిన తరవాత ఏం చేశావని ప్రశ్నించారు. అయితే..ఆ సమయంలో నిందితుడు అసహనానికి గురయ్యాడని, అసలు తాను హత్యే చేయనప్పుడు ఈ ప్రశ్న ఎలా అడుగుతారని ఎదురు ప్రశ్న వేసినట్టు లాయర్ వివరించారు. అసలు తాను డాక్టర్‌ని హత్య చేయలేదని స్పష్టం చేశాడు.
మరో కీలకమైన విషయం ఏంటంటే...పాలిగ్రఫీ టెస్ట్‌లో సంజయ్ రాయ్ చెప్పిన సమాధానాలు కొన్ని షాకింగ్‌గా అనిపించాయి. తాను సెమినార్ హాల్‌లోకి వెళ్లి చూసే సరికే డాక్టర్ రక్తపు మడుగులో పడి ఉందని చెప్పాడు. ఆమె అప్పటికే స్పృహలో లేదని, అది చూసి భయంతో వెంటనే బయటకు వచ్చినట్టు వివరించాడు. అసలు ఆ డాక్టర్ ఎవరో కూడా తనకు తెలియదని, అనవసరంగా తనను టార్గెట్ చేస్తున్నారని అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది.
ఈ పాలిగ్రఫీ టెస్ట్ చేసినప్పుడే అధికారులు మరో ప్రశ్న కూడా అడిగారని సమాచారం. "నువ్వు అమాయకుడివే అయితే, ఏమీ చేయకపోతే అక్కడ డెడ్‌బాడీని చూసిన వెంటనే పోలీసులకు ఎందుకు చెప్పలేదు" అని ప్రశ్నించారు. అయితే...ఈ ప్రశ్నకు సంజయ్ రాయ్ "చాలా భయం వేసింది. ఎవరికైనా చెప్పినా నమ్మరేమో అనుకున్నా" అని బదులిచ్చాడు. అటు నిందితుడి లాయర్ కూడా తన క్లైంట్ ఎలాంటి తప్పు చేయలేదని, ఇంకెవరో ఈ దారుణానికి పాల్పడి ఉంటారని వాదిస్తున్నారు.
"సంజయ్ రాయ్ అంత సులువుగా సెమినార్ హాల్‌లోకి వెళ్లాడంటే కచ్చితంగా హాస్పిటల్‌లో సరైన భద్రత లేదనేగా అర్థం. దీన్ని అదనుగా చూసుకునే ఇంకెవరో ఈ పని చేసుంటారు"
- కబితా సర్కార్, సంజయ్ రాయ్ లాయర్
ఆగస్టు 9వ తేదీన ఆర్‌జీ కర్ హాస్పిటల్‌లో ట్రైనీ డాక్టర్ హత్యాచారానికి గురైంది. సెమినార్ హాల్‌లోకి వెళ్లిన ఓ డాక్టర్ ఆమె మృతదేహాన్ని గుర్తించాడు. ఆ తరవాత హాస్పిటల్ యాజమాన్యానికి సమాచారం అందించారు. పోలీసులు వచ్చి FIR నమోదు చేశారు. అయితే...ఈ విషయంలో పోలీసులు నిర్లక్ష్యంగా ఉన్నారన్న వాదనలు వినిపించాయి. సుప్రీంకోర్టు కూడా దీనిపై తీవ్రంగా మందలించింది. ఇప్పటి వరకూ ఈ కేసులో సంజయ్ రాయ్‌ని మాత్రమే అరెస్ట్ చేశారు. సీబీఐ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ కేసులో ఎలాంటి పురోగతి లేదన్న ఆరోపణలూ గట్టిగానే వినిపిస్తున్నాయి. అటు ప్రభుత్వం నియమించిన సిట్ ఇప్పటికే ఓ రిపోర్ట్ తయారు చేసి ప్రభుత్వానికి అందించింది.
Also Read: Crime News: పాలిస్తూనే కన్నబిడ్డ గొంతు పిసికి చంపిన తల్లి, కూతురు పుట్టిందన్న అసహనంతో హత్య