SI Rs 2 Crore Bribe: రూ.3000 కోట్ల ఆర్థిక నేరగాడ్ని వదిలేసేందుకు ఎస్ఐ రూ.2 కోట్ల డీల్, తర్వాత ఏమైందంటే!
నిందితుడిని వదిలేసేందుకు రూ.2 కోట్లు డీల్ కుదుర్చుకున్న హైదరాబాద్ ఎస్ఐ అని ప్రచారం జరుగుతోంది. డిపార్ట్‌మెంట్ ఎంక్వైరీలో తేలినట్లు వైరల్ అవుతోంది.

Hyderabad Police Bribe Case | హైదరాబాద్: క్రైమ్ చేసే వాళ్లను అరెస్ట్ చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడానికి పోలీస్ శాఖ ఉంది. ఖాకీలంటే ప్రజల్లో భయం ఉన్నప్పటికీ, న్యాయం కావాలంటే పోలీసులనే ఆశ్రయిస్తారు. కేసుల్లో బాధితులకు బదులుగా నిందితులకు సాయం చేసి విమర్శల పాలవుతున్నారు కొందరు పోలీసులు. పెద్ద మొత్తంలో నగదు తీసుకుని నిందితులు పారిపోయేందుకు సాయం చేస్తున్నారని కొన్ని కేసుల్లో ఆరోపణలు వస్తుంటాయి. తాజాగా అలాంటి ఘటనే హైదరాబాద్ సిటీలో ఒకటి జరిగింది. ఏకంగా రూ.2 కోట్లు తీసుకొని, రూ.3 వేల కోట్ల ఆర్థిక నేరం చేసిన నిందితుడిని హైదరాబాద్‌కు చెందిన ఎస్ఐ వదిలేశాడని వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
రూ.3 వేల కోట్లు కొల్లగొట్టి ముంబయికి పారిపోయిన నిందితుడు
దాదాపు రూ.3000 కోట్లు విలువైన ఆర్థిక నేరానికి పాల్పడ్డ వ్యక్తిపై పోలీసు శాఖ నిఘా పెట్టింది. పెట్టుబడి పెడితే భారీగా లాభాలని ఆశపెట్టి, వేల కోట్లు కొల్లగొట్టాక జెండా ఎత్తేశాడు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. అతడ్ని అరెస్ట్ చేసి ఆట కట్టించాలని ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేశారు.
నిందితుడితో 2 కోట్ల డీల్..
నిందితుడు మహారాష్ట్రలోని ముంబయిలో తలదాచుకున్నట్లు టాస్క్ ఫోర్స్ టీం గుర్తించింది. ఉన్నతాధికారుల ఆదేశాలతో ఎస్ఐ టీమ్ ముంబయికి వెళ్లింది. ఎలాగోలా శ్రమించి నిందితుడ్ని ముంబయిలో అరెస్టు చేసి హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. తాను మాత్రం నిందితుడితో వాహనంలో వస్తూ, మిగతా పోలీసులను వేరే వాహనంలో పంపించాడు ఆ ఎస్సై. రెండు పోలీస్ వాహనాల మధ్య గ్యాప్ పెరిగేలా ప్లాన్ చేశాడు. నిందితుడ్ని హైదరాబాద్ తీసుకొస్తున్న సమయంలో రూ.2 కోట్ల డీల్ కుదుర్చుకున్నాడు ఎస్ఐ.
తనకు నగదు ఇస్తే వదిలేస్తానని చెప్పడంతో నిందితుడు టీం ఓ హాటల్ వద్దకు వచ్చింది. రూ.2 కోట్లు తీసుకుని డీల్ ప్రకారం నిందితుడ్ని ఎస్ఐ వదిలేశాడు. సినిమా సీన్ తరహాలో ఈ డీల్ జరిగిందంటే మాటలు కాదు. మార్గం మధ్యలో వాహనం ఆపిన సమయంలో నిందితుడు తప్పించుున్నాడని ఉన్నతాధికారులకు ఎస్ఐ కట్టు కథ చెప్పాడని సమాచారం.
అంతమంది పోలీసులు వెంట వెళ్లగా నిందితుడు ఎలా తప్పించుకున్నాడా అని పోలీస్ శాఖ విచారణ చేపట్టింది. నిందితుడ్ని పట్టుకునేందుకు కొన్ని టీంలకు రంగంలోకి దించింది. ఎస్ఐ భారీగా నగదు తీసుకుని నిందితుడ్ని వదిలేశాడని డిపార్ట్‌మెంట్ ఎంక్వైరీలో తేలినట్లు ప్రచారం జరుగుతోంది. ఆ ఎస్ఐ 2020 బ్యాచ్‌కు చెందిన వాడని, గత కొన్నేళ్లుగా తనపై ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయని దర్యాప్తు బృందాలు గుర్తించాయి. ఆ ఎస్ఐ మామూలోడు కాదంటూ ప్రచారం జరుగుతోంది. దీనిపై పోలీస్ శాఖ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. నిందితుడు ఎవరు, సాయం చేసిన ఎస్ఐ ఎవరు అనే విషయాలపై త్వరలో క్లారిటీ రానుంది.






















