Crime News: బంగారం చోరీ కేసు, దళిత మహిళపై పోలీసులు థర్డ్ డిగ్రీ - విచారణకు ఉన్నతాధికారుల ఆదేశం
Police Brutality Against SC Woman : సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో బంగారం దొంగతనం చేసిందంటూ దళిత మహిళను పోలీసులు తీవ్రంగా కొట్టి గాయపరిచారు. దీనిపై పోలీసు ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.
Custodial Torture On Sc Women: కొందరు పోలీసులు ఒక్కోసారి తాము మనుషులం అన్న విషయాన్ని మర్చిపోయి ప్రవర్తిస్తుంటారు. చేతిలో లాఠీ ఉంది కదా అని ఇష్టానుసారంగా వ్యవహరిస్తుంటారు. కొందరు పోలీసుల అత్యుత్సాహంతో కొన్నిసార్లు అమాయకులు కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంటుంది. తాజాగా అటువంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. బంగారం దొంగతనం చేసిందన్న ఆరోపణలతో పోలీసులు ఎస్సీ మహిళను దారుణంగా కొట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి రాగా, దీనిపై పోలీసు ఉన్నతాధికారులు విచారణకు కూడా ఆదేశించారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పోలీస్ స్టేషన్‌లో చోటు చేసుకుంది. పోలీస్ స్టేషన్‌లో పెట్టి ఎస్సీ మహిళను హింసించిన ఈ ఘటన వ్యవహారం ఉన్నతాధికారులు దృష్టికి వెళ్లడంతో విచారణకు ఆదేశించారు. విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామని శంషాబాద్ డీసీపీ వెల్లడించారు.
భర్త, కుమారుడి ముందే కొట్టిన పోలీసులు
ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పరిశీలిస్తే.. గత నెల 24వ తేదీన షాద్ నగర్ పట్టణంలోని అంబేద్కర్ నగర్ కాలనీకి చెందిన సునీత, భీమయ్య దంపతులు దొంగతనానికి పాల్పడ్డారంటూ నాగేందర్ అనే వ్యక్తి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సునీత, భీమయ్యతోపాటు 13 ఏళ్ల కుమారుడిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. విచారణలో భాగంగా ఆమె భర్తను వదిలేసిన డిటెక్టివ్ సీఐ రామిరెడ్డి, అతని సిబ్బంది సునీతను తీవ్రంగా కొట్టారు. భర్త, కుమారుడి ముందే విచక్షణా రహితంగా కట్టడంతో సునీత తీవ్రంగా గాయపడింది. దొంగతనం చేసినట్టు ఒప్పుకోవాలంటూ సీఐ తీవ్రంగా వేధించడంతో స్పృహ సునీత స్పృహ కోల్పోయింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆమెను ఇంటికి పంపించేశారు. ఈ మేరకు సునీత పోలీస్ స్టేషన్‌లో జరిగిన విషయాన్ని బయటకు వెళ్లడించింది. దీన్ని కొందరు ఉన్నతాధికారులు దృష్టికి తీసుకెళ్లడంతో విచారణకు ఆదేశించారు. విచారణ అనంతరం బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు స్పష్టం చేవారు.
తులం బంగారం, నాలుగు వేల నగదు రికవరీ
ఈ దొంగతనం కేసులో 24 తులాల బంగారం, రెండు లక్షల నగదు పోయినట్టు ఫిర్యాదు చేశారు. విచారణ ప్రారంభించిన పోలీసులు తులం బంగారం, నాలుగు వేల నగదును రికవరీ చేసినట్టు చెబుతున్నారు. మహిళపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు పది రోజులు గడుస్తునప్పటికీ రిమాండ్ విధించకుండా ఇంటికి పంపించడంపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. దీనికి కారణం పోలీసులు వ్యవహరించిన తీరుగానే చెబుతున్నారు. మహిళను తీవ్రంగా కొట్టడంతో ఆమెకు పెద్ద గాయాలు అయినట్టు చెబుతున్నారు. మళ్లీ స్టేషన్‌కు తీసుకువస్తే ఏదైనా ఇబ్బంది జరుగుతుందన్న ఉద్ధేశంతోనే పోలీసులు రిమాండ్ విధించడం లేదని చెబుతున్నారు. పోలీసులు దళిత మహిళపై వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అన్ని వైపుల నుంచి ఈ ఘటనకు సంబంధించి విమర్శలు రావడంతోనే విచారణకు సిద్ధపడినట్టు తెలుస్తోంది. మరి ఈ కేసు విచారణలో ఎటువంటి వాస్తవాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.