Crime News: ఏంటమ్మా.. ఇది పద్ధతేనా.. కత్తితో కూరగాయలు కోయమంటే.. అత్తను కోసేశావ్
అత్తాకోడళ్లు అంటే.. చాలామంది ఇళ్లలో టామ్ అండ్ జెర్రీలాగే. వారిద్దరి మధ్య అస్సలు పొసగదు. ఓ కోడలు కూడా.. కూరగాయలను కోయమన్నందుకు అత్తను కత్తితో కోసేసింది.
భర్తతో బాగానే ఉంటుంది భార్య.. కొడుకుతో ప్రేమగా ఉంటారు తల్లి. కానీ వారిద్దరూ ఎదురుపడ్డప్పుడు మాత్రం చాలా మంది ఇళ్లలో ఎడమోహం.. పెడమోహంగానే ఉంటారు. అతడు బయటకి వెళ్తే.. చాలు.. ఇక ఒకరిమీదకు ఒకరు మాటల యుద్ధం చేసుకుంటారు. ఇటీవల అత్తాకోడళ్ల మధ్య వివాదంతో చనిపోతున్న వార్తలు చాలా వచ్చాయి. తాజాగా మళ్లీ.. అత్తాకోడళ్ల వివాదం ఒకటి బయటకొచ్చింది. ఈ ఘటనలో అత్తాను కోడలు కత్తితో పొడిచింది. అది కూడా కూరగాయల కోయమనే విషయంలో. ఇంతకీ ఏం జరిగిందంటే..
రాజస్థాన్‌లోని జైపూర్ భంక్రోటాకు చెందిన అత్తాకోడళ్లు మోహినీ దేవి (62).. తన కుమారుడికి పద్నాలుగేళ్ల కిందట మమతాదేవీ (35)తో వివాహం చేసింది. అయితే కొన్ని ఏళ్లుగా అత్తాకోడళ్ల నడుమ అస్సలు పడట్లేదు. ఎప్పుడూ వారిద్దరి మధ్య గొడవలే. ఎప్పుడు ఏదో ఒక విషయంలో తరచూ ఒకరి మీద ఒకరు మాటల దాడి చేసుకునే వారు. మంగళవారం వంట కోసం కోడలు కూరగాయలు తరుగుతోంది. అయితే కూరగాయలు సరిగా కోయడం లేదని అత్త మోహిని కోడలు మమతాదేవీని తిట్టింది. ఈ సమయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. పెరిగి పెరిగి గొడవకు దారితీసింది. ఇక కోడలు క్షణికావేశంలో కూరగాయలు కోస్తున్న కత్తితోనే అత్తపై దాడి చేసింది. ఏకంగా 26 చోట్ల పొడవడంతో మోహినీకి తీవ్ర గాయాలయ్యాయి. దాడి చేసిన అనంతరం కోడలు తట్టాబుట్టా సర్దేసుకుని పరారైంది.
ఈ విషయం తెలిసి.. ఇంటికి వచ్చిన కుమారుడు రక్తంలో పడి ఉన్న తల్లిని ఎస్‌ఎంఎస్ ఆస్పత్రికి తరలించాడు. ఆమె చికిత్స పొందుతూ రాత్రి కన్నుమూసింది. తన తల్లిని హతమార్చిన భార్యపై భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మమతను పోలీసులు అరెస్ట్ చేశారు. మమతకు ఇద్దరు అబ్బాయిలు, ఓ కుమార్తె ఉంది.
సెల్ ఫోన్ విషయంలో మరో ఘటన
మధ్యప్రదేశ్ ఛత్తర్‌పూర్‌లోని పర్వా గ్రామంలో ఓ మహిళ పశువులు మేపేందుకు వెళ్లింది. ఆ సమయంలో తన ఇద్దరు పిల్లల్ని బావిలోకి విసిరేసింది. ఆ తర్వాత... తానూ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొంది. ఈ ఘటనలో 10 ఏళ్ల బాలిక ప్రాణాలు కోల్పోగా.. నాలుగేళ్ల చిన్నారి బావి ఇటుకల మధ్య చిక్కుకొని ప్రాణాలతో బయటపడిందని పోలీసులు తెలిపారు. సెల్‌ఫోన్ విషయంలో తన అత్తతో జరిగిన గొడవే ఈ దారుణానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్టు వెల్లడించారు. మరోవైపు.. మహిళ నుంచి సెల్‌ఫోన్‌ను అత్త తీసుకోవడమే ఈ వివాదానికి కారణమని గ్రామస్థులు చెప్పారు.
Also Read: AP Crime News: ఆస్తి రాసిస్తావా.. సిలిండర్ పేల్చి చంపేయాలా? అత్తను బెదిరించిన అల్లుడు