Sircilla Kidnap: కిడ్నాప్ కేసులో ఊహించని ట్విస్ట్! మాస్క్ ధరించడంతో లవర్‌ను గుర్తుపట్టలేదంట - యువతి వీడియో
Sircilla District Crime News: రాజన్న సిరిసిల్లా జిల్లాలో మంగళవారం ఉదయం పలువురు దుండగులు ఓ యువతిని కిడ్నాప్ చేశారు. ఇంతలో బాధితురాలే ఓ వీడియో విడుదల చేసి ఊహించని ట్విస్ట్ ఇచ్చింది.
Sircilla District Woman Kidnap News: సిరిసిల్ల జిల్లాలోని మూడపల్లిలో నేడు (డిసెంబరు 20) తెల్లవారుజామున ఓ యువతి కిడ్నాప్ కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ వ్యవహారంలో బాధితురాలే స్వయంగా ఓ వీడియో విడుదల చేసింది. అందులో ఆమె పెళ్లి దుస్తులతో ఉంది. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని, ఇష్టపూర్వకంగానే తన ప్రియుడితో వెళ్లానని చెప్పింది. తాను, ప్రియుడు నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నామని చెప్పింది. అతను మాస్క్ పెట్టుకోవడంతో కిడ్నాప్ సమయంలో తనను నిజంగానే కిడ్నాపర్ అని భ్రమపడ్డానని చెప్పింది. కిడ్నాప్ కేసులో పోలీసులు సీరియస్ గా విచారణ చేస్తున్న వేళ బాధితురాలు ఈ వీడియో విడుదల చేయడం సంచలనంగా మారింది.
అసలేం జరిగిందంటే..
రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మూడపల్లిలో యువతి కొందరు యువకులు కిడ్నాప్ చేశారు. మంగళవారం ఉదయం 5 గంటల ప్రాంతంలో.. తండ్రితో కలిసి ఓ యువతి ఆంజనేయ స్వామి గుడికి వచ్చింది. లోపలికి వెళ్లి ప్రత్యేక పూజ చేసుకొని బయటకు వచ్చింది. ఆమె బయటకు రాగానే.. అప్పటికే కారులో కాపు కాస్తున్న యువకులు యువతిని కొడ్తూ కారులోకి లాక్కెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే ఆమె అరుపులు విన్న తండ్రి పరిగెట్టుకొచ్చాడు. వారిని ఆపే ప్రయత్నం చేశాడు. దీంతో యువకులు ఆమె తండ్రిపై కూడా దాడి చేశారు. యువతిని కారులో ఎక్కించుకొని పారిపోయారు. వెంటనే సదరు యువతి తండ్రి పోలీసుల వద్దకు వెళ్లి విషయం తెలిపాడు. తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు హుటాహుటిన రంగంలోకి దిగారు. సంఘటనా స్థలానికి చేరుకొని దగ్గర్లో ఉన్న సీసీటీవీ ఫుటేజీని సేకరించారు.
యువతిని పలువురు యువకులు కిడ్నాప్ చేయడం ఆ సీసీటీవీలో రికార్డు అయ్యాయి. అమ్మాయిని బలవంతంగా లాక్కెళ్లి కారులో తోసేసినట్లుగా పోలీసులు గుర్తించారు. కిడ్నాప్ కు గురైన సదరు యువతికి ఈ మధ్యనే పెళ్లి నిశ్చయం అయిందని గ్రామస్థులు తెలిపారు. అయితే అమ్మాయి మైనర్ గా ఉన్న సమయంలో గ్రామానికి చెందిన ఓ యువకుడు ప్రేమ పేరుతో విపరీతంగా వేధించేవాడని ఊహాగానాలు వచ్చాయి. ఈ క్రమంలోనే సదరు యువతి, ఆమె తల్లిదండ్రులు.. అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు సదరు యువతిని ఈ అబ్బాయే కిడ్నాప్ చేసి ఉండవచ్చని అనుమానించారు.
మొన్నటికి మొన్న ఆదిభట్లలో యువతి కిడ్నాప్..
హైదరాబాద్ శివారులోని ఆదిభట్లలో యువతి కిడ్నాప్ కేసు సంచలనం అయిన సంగతి తెలిసిందే. ప్రేమించిన యువతి మరొకరితో పెళ్లికి సిద్ధమవ్వడంతో ఆమెను కిడ్నాప్ చేశాడు యువకుడు. అయితే ఆ కిడ్నాప్ కూడా సినీఫక్కీలో చేశారు. 40 మంది అనుచరులతో యువతి ఇంటిపై దాడి చేసి తండ్రిని కొట్టి యువతిని కిడ్నాప్ చేశాడు. రంగారెడ్డి జిల్లా మన్నెగూడలో ఈ నెల 9న ఈ ఘటన జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పటికే ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డితో పాటు దాడికి పాల్పడిన నిందితులను అరెస్టు చేశారు. బొంగులూరులోని స్పోర్ట్స్ అకాడమీలో చదువుతున్న యువతికి నవీన్ రెడ్డితో పరిచయం ఏర్పడింది. నవీన్ రెడ్డి యువతి ఫోన్ నంబర్ తీసుకొని తరచూ ఫోన్ చేసేవాడు. ఆమెతో కలిసి ఫొటోలు తీసుకునేవాడు. ఆ తర్వాత పెళ్లి ప్రస్తావన తెచ్చాడు నవీన్. తన తల్లిదండ్రులు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటానని యువతి చెప్పింది. అయితే యువతి తల్లిదండ్రులను ఒప్పించేందుకు నవీన్ రెడ్డి ప్రయత్నించాడు. యువతి తల్లిదండ్రులు పెళ్లికి అంగీకరించకపోవడంతో వారిపై నవీన్ రెడ్డి కక్ష పెంచుకున్నాడు. యువతి పేరుతో ఓ నకిలీ ఇన్‌స్టా గ్రామ్ అకౌంట్ క్రియేట్ చేశాడు. యువతితో కలిసి దిగిన ఫొటోలు పోస్టు చేస్తూ వైరల్ చేసేవాడు. ఆరు నెలల క్రితం యువతి ఇంటి ముందు స్థలాన్ని లీజుకు తీసుకున్నాడు నవీన్ రెడ్డి. ఇన్ స్టాలో నకిలీ ఖాతా గమనించిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆదిభట్ల పోలీసులు ఐటీ చట్టం కింద నవీన్‌పై కేసు నమోదు చేశారు.