Drugs: తెలంగాణలో డ్రగ్స్ దందా - కొడుకును సరఫరాదారునిగా మార్చిన తండ్రి, తండ్రీకొడుకుల అరెస్ట్
Hyderabad News: నగరంలో డ్రగ్స్ దందా సాగిస్తోన్న తండ్రీ కొడుకులను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి 100 గ్రాముల హెరాయిన్, రూ.13 వేల నగదు, సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు.
Rachakonda Police Arrested Father And Son In Drugs Case: నగరంలో అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠా గుట్టును రాచకొండ పోలీసులు (Rachakonda Police) రట్టు చేశారు. డ్రగ్స్ సరఫరా చేస్తోన్న తండ్రీకొడుకులను శనివారం అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాచకొండ కమిషనరేట్ బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన హనీఫ్ షా, సిద్ధిక్ షా తండ్రి కొడుకులు. వీరిద్దరూ హెరాయిన్ నగరానికి తెచ్చి సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. పక్కా సమాచారం మేరకు బాలాపూర్ పోలీసులతో కలిసి మహేశ్వరం ఎస్.ఓ.టి పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి నిషేధిత హెరాయిన్ 100 గ్రాములు, రూ.13 వేల నగదు, 3 సెల్ ఫోన్లు స్వాదీనం చేసుకున్నారు.
కొడుకుతో కలిసి తండ్రి వ్యాపారం
పట్టుకున్న డ్రగ్స్ విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.12 లక్షల వరకు ఉంటుందని రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు తెలిపారు. ఈ కుటుంబం మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచి నగరానికి వచ్చి ఇక్కడ స్క్రాప్ దుకాణం నడిపిస్తున్నారని చెప్పారు. కుటుంబ పోషణ కష్టమై కొడుకుతో కలిసి తండ్రి డ్రగ్స్ దందా సాగిస్తున్నట్లు వివరించారు. 'తండ్రి హనీఫ్ గతంలో డ్రగ్స్ కేసులో ముంబైలో అరెస్టయ్యాడు. హనీఫ్ కొడుకు సిద్దిక్ సైతం తండ్రితో కలిసి డ్రగ్స్ రవాణా చేస్తున్నాడు. సినిమా తరహాలోనే తండ్రే కొడుకును డ్రగ్స్ రవాణాదారుడిగా మార్చాడు. మధ్యప్రదేశ్, ముంబై మీదుగా హైదరాబాద్‌కు మత్తు పదార్థాలు రవాణా చేస్తున్నారు. ప్రైవేట్ బస్సుల ద్వారా నగరానికి చేరుకొని స్థానిక కాంటాక్ట్స్ ద్వారా డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. నిందితుల వద్ద 100 గ్రాముల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నాం. ప్రధాన సరఫరాదారు పరారీలో ఉన్నాడు.' అని సీపీ వివరాలు వెల్లడించారు.
Also Read: Hyderabad: సైరన్ మోగించి ప్రయాణికుల రవాణా- అంబులెన్స్ డ్రైవర్ల అడ్డదారి