Medchal Crime News: దుండిగల్ ఫైనాన్స్ వ్యాపారి హత్య కేసులో ఐదుగురు నిందితులు అరెస్టు
Medchal Crime News: మేడ్చల్ జిల్లా దుండిగల్ లో జరిగిన ఫైనాన్స్ వ్యాపారి హత్య కేసులో పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. మద్యం మత్తులో చిన్నపాటి ఘర్షణలో హత్య చేసినట్లు ఒప్పుకున్నారు.
Medchal Crime News: మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలోని దుండిగల్ లో జరిగిన ఫైనాన్స్ వ్యాపారి హత్య కేసును పోలీసులు చేధించారు. వెంకటేష్ గౌడ్ ను హత్య చేసిన ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. మద్యం మత్తులో చిన్నపాటి ఘర్షణలో హత్య జరిగిందని పోలీసులు వివరించారు. ప్రధాన నిందితుడు ఎండీ మజీద్ ఖాన్, అతని చిన్ననాటి స్నేహితుడు ముదస్సేర్ అహ్మద్.. వారికి సహకరించిన బాబాఖాన్, అసద్దుల్లా ఖాన్, రిజ్వాన్ అలీలను అదుపులోకి తీసుకున్నారు. ఐదుగురు నిందితుల నుండి హత్యకు ఉపయోగించిన 2 కత్తులతో పాటు, ఓ బైక్, 5 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులని దుండిగల్ పోలీసులు రిమాండ్ కి తరలించారు.
ఆధారాలు చెరిపేసేందుకు తీవ్ర యత్నం
మజీద్ ఖాన్ చిన్నప్పటి నుండి పనీపాట లేకుండా తిరుగుతాడని ఇప్పటికే దొంగతనం కేసులో బాచుపల్లి పరిధిలో నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మజీద్ ఖాన్, అహ్మద్ లే ఫైనాన్స్ వ్యాపారి వెంకటేష్ గౌడ్ ను హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. వీరిద్దరిని ఈ కేసు నుండి తప్పించడానికి మజీద్ ఖాన్ తండ్రి బాబా ఖాన్ తీవ్రంగా శ్రమించినట్లు పోలీసులు గుర్తించారు. హత్య జరిగిన చోట ఆధారాలు దొరకకుండా అసదుల్లా ఖాన్, రిజ్వాన్ అలీలను పురమాయించారని, వారు సాక్ష్యాధారాలను కాల్చివేసినట్లు పోలీసులు తెలిపారు.
తప్పతాగి విచక్షణారహితంగా కత్తులతో దాడి
మజీద్ ఖాన్, మదస్సేర్ అహ్మద్ ఇద్దరు స్నేహితులు. ఈ నెల 7వ తేదీన సాయంత్రం మద్యం కొనుగోలు చేసి దొమ్మరపోచం పల్లి చెరువు సమీపంలో తాగుతున్నారు. ఇదే క్రమంలో హత్యకు గురైన వెంకటేష్ గౌడ్ ఆ ప్రాంతంలో మద్యం తాగొద్దని వారిని వారించాడు. దీంతో కోపోద్రిక్తులైన మజీద్ ఖాన్, మదస్సేర్ అహ్మద్ ఇద్దరు కలిసి రెండు కత్తులతో వెంకటేశ్ గౌడ్ పై విచక్షణ రహితంగా దాడి చేసి పరారయ్యారు. ఈ దాడిలో వెంకటేష్ గౌడ్ అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటన స్థలంలో దొరికిన బీర్లు, చెప్పులు ఓ కత్తి, అలాగే దగ్గరలోని సీసీటీవీ ఫుటేజ్, నిందితులు వాడిన బైక్ నంబర్ ఆధారాలతో కేసును చేధించినట్లు మేడ్చల్ ఏసీపీ వెంకట్ రెడ్డి తెలిపారు.
ప్రేయసి మరొకరిని ప్రేమిస్తుందని హత్య
విశాఖపట్నం బీచ్ లో దారుణం జరిగింది. తాను ప్రేమిస్తున్న అమ్మాయి మరో యువకుడితో చనువుగా ఉంటోందని ఆమెను చంపానుకున్నాడు. బీచ్ కు రమ్మని చెప్పి.. అర్ధరాత్రి పూట గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం పోలీసులు ఎదుటకు వెళ్లి లొంగిపోయాడు. విశాఖపట్నానికి చెందిన శ్రావణి, గోపాల్ అనే ఇద్దరు గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే ఇద్దరూ చెట్టాపెట్టాలేసుకొని తిరిగేవారు. ఈ క్రమంలోనే శ్రావణి మరో అబ్బాయితో మాట్లాడుతోంది. అతనితో శ్రావణి చనువుగా ఉండడాన్ని గోపాల్ జీర్ణించుకోలేక పోయాడు. తనను ప్రేమిస్తున్నట్లు చెప్పి మరో యువకుడితో తిరుగుతూ తనను మోసం చేస్తోందని భావించాడు. అలాంటి అమ్మాయిని ఎలాగైనా సరే మట్టుపెట్టాలనుకున్నాడు. ఈక్రమంలోనే ఆమె హత్యకు ప్లాన్ వేశాడు. శుక్రవారం రోజు అర్థరాత్రి గోకుల్ పార్క్ బీచ్ వద్దకు రమ్మని చెప్పాడు. కాసేపు ఆమెతో మాట్లాడిన అతడు... ఒక్కసారిగా ఆమె గొంతు నులిమి చంపేశాడు. ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత గోపాల్ నేరుగా గాజువాక పోలీస్ స్టేషన్ కు వెళ్లి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.