Peddapalli: చెల్లి శవంతో నాలుగు రోజులుగా ఇంట్లోనే అక్క.. అది కుళ్లడంతో చివరికి..
గతంలో నానమ్మ, అమ్మమ్మ చనిపోయినప్పుడు కూడా ఈ అక్కాచెల్లెళ్లు రెండు, మూడు రోజులు ఎవరికీ చెప్పలేదని స్థానికులు చెబుతున్నారు.
చెల్లెలు చనిపోతే ఆ మృత దేహాన్ని నాలుగు రోజులుగా ఇంట్లోనే ఉంచుకున్న సోదరి వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది. అమ్మా నాన్న గతంలోనే చనిపోవడంతో ఇద్దరే ఇంట్లో ఉంటున్నారు. ఈ క్రమంలో చెల్లెలు అనారోగ్యం వల్ల చనిపోతే.. ఆ విషయం ఎవరికి చెప్పాలో తెలియక అక్క నాలుగు రోజులుగా ఆ శవంతో ఇంట్లోనే ఉంది. స్థానికుల సమాచారంతో ఈ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
స్థానికులు, పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఎంబీఏ, ఎంటెక్ చదువుకున్న అక్కా చెల్లెళ్లు మారోజు శ్వేత (24), స్వాతి పెద్దపల్లి పట్టణంలోని ప్రగతి నగర్‌లో నివాసం ఉంటున్నారు. వారిది సొంత ఇల్లే. కొంత కాలం క్రితమే తల్లి తండ్రి చనిపోయారు. ఆ తర్వాత నానమ్మ, అమ్మమ్మ కూడా చనిపోయారు. దీంతో వారిద్దరే సొంత ఇంట్లో ఉంటున్నారు. శ్వేత ఎంబీఏ పూర్తిచేయగా, స్వాతి ఎంటెక్ చదివి పెద్దపల్లి పట్టణంలోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో ఉద్యోగం చేస్తోంది. అయితే నాలుగు రోజుల క్రితం శ్వేత మృతి చెందింది.
కుటుంబ సభ్యులు, బంధువులు ఎవరూ లేకపోవడంతో స్వాతి ఆ విషయం ఎవరికి చెప్పాలో తెలియని స్థితిలో మృతదేహం పక్కనే ఉండిపోయింది. ఇంట్లో నుంచి తీవ్రమైన దుర్వాసన వస్తుండడంతో అనుమానం వచ్చిన ఇరుగు పొరుగు వారు సోమవారం రాత్రి పోలీసులకు సమాచారం అందించారు. పెద్దపల్లి పట్టణ పోలీసులు ఆ ఇంటికి చేరుకొని స్వాతిని ప్రశ్నించారు. తన చెల్లెలు అనారోగ్యంతో మృతి చెందిందని తెలిపింది. అయితే, నాలుగు రోజులుగా ఆ శవం అక్కడే ఉండడంతో అది కుళ్లిపోయింది. వెంటనే ప్రభుత్వ వైద్యులు కూడా మృతదేహానికి అక్కడే పోస్టు మార్టం నిర్వహించారు.
చుట్టుపక్కల వారు చెబుతున్న వివరాల ప్రకారం.. గతంలో నానమ్మ, అమ్మమ్మ చనిపోయినప్పుడు కూడా ఈ అక్కాచెల్లెళ్లు రెండు, మూడు రోజులు ఎవరికీ చెప్పలేదని స్థానికులు చెబుతున్నారు. అయితే, వారి మానసిక స్థితిపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు ఆ యువతి ఎలా చనిపోయిందన్నదానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Also Read: వ్వాట్ ..యాన్ ఐడియా సర్‌జీ.. క్యూలో నిలబడితే రోజుకు రూ. 16 వేలు !
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి