Peddapalli Crime : రౌడీషీటర్ సుమన్ హత్య కేసును ఛేదించిన పోలీసులు, పాతకక్షలతో మర్డర్!
Peddapalli Crime : గోదావరిఖనిలో జరిగిన రౌడీషీటర్ సుమన్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు.
Peddapalli Crime : పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణ చౌరస్తాలో జనవరి 29న రాత్రి అతి దారుణంగా హత్యకు గురైన రౌడీషీటర్ మంథని సుమన్ కేసులో ఏడుగురు నిందితులను అరెస్టు చేసినట్లు డీసీపీ వైభవ్ గైక్వాడ్ తెలిపారు. నిందితుల నుంచి హత్యకు ఉపయోగించిన కత్తులు, ఆటో, సెల్ ఫోన్లు, సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హత్యకు సంబంధించిన వివరాలను పెద్దపల్లి డీసీపీ వైభవ్ గైక్వాడ్ వెల్లడించారు.
అసలేం జరిగింది?
గోదావరిఖని అంబేడ్కర్ నగర్ కు చెందిన రౌడీ షీటర్ మంథని సుమన్ నాలుగేళ్ల క్రితం హనుమాన్ నగర్ కు చెందిన శివకుమార్ ను హత్య చేసిన కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఈ ఘటనను దృష్టిలో పెట్టుకున్న మృతుని సోదరుడు చంద్రశేఖర్ తో పాటు మరికొందరు పథకం పన్నారు. పలుమార్లు సుమన్ ను హత్య చేసేందుకు ప్రయత్నం చేసి విఫలమయ్యారు. చివరకు జనవరి 29 రాత్రి 8:30 గంటల ప్రాంతంలో గోదావరిఖని చౌరస్తా లో జన సంచారం మధ్య అతిదారుణంగా సుమన్ పై కత్తులతో దాడి చేసి చంపారు. ఈ సంఘటనలో రౌడీ షీటర్ చంద్రశేఖర్ తో పాటు అతని కుటుంబ సభ్యులు కొందరు పాత నేరస్థులు కలసి హత్యకు పన్నాగం వేశారు. ప్లాన్ ప్రకారం మంథని సుమన్ ను హతమార్చారు. హత్యకు పాల్పడిన నిందితులను అరెస్టు చేసి, రిమాండ్ తరలించినట్లు డీసీపీ తెలిపారు. ఈ సంఘటనపై విభిన్న కోణాలలో విచారణ చేస్తున్నామన్నారు.
ఏడుగురు అరెస్టు
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలోని గాంధీ చౌరస్తాలో ఆదివారం రాత్రి రౌడీషీటర్ మంథని సుమన్‌ను హత్య జరిగింది. ఈ కేసులో ఏడుగురిని పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. నిందితులు డి.చంద్రశేఖర్ (37), వి.నవీన్ (23), ఎం. శ్రీను (32), ఎం. స్వరూప (30), జి. అజయ్ కుమార్ (23), జి. శశి (23), బి. ఆనంద్ (45) లను పోలీసులు అరెస్టు చేశారు. గోదావరిఖనిలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో మీడియాతో మాట్లాడిన డీసీపీ వైభవ్ గైక్వాడ్ స్పెషల్ టీం కేసు దర్యాప్తు చేసిందన్నారు. రౌడీషీటర్ మథని సుమన్ హత్య చేసిన ఏడుగురిని అరెస్టు చేసినట్లు తెలిపారు. ప్రధాన నిందితుడు చంద్రశేఖర్ 5 ఇంక్లైన్ కాలనీలోని ఓ ఇంట్లో తలదాచుకున్నాడు. పోలీసులు దాడి చేసి అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. చంద్రశేఖర్ హత్యకు సంబంధించిన వివరాలను తెలిపాడు. నిందితుడి ఇచ్చిన వివరాలు ఆధారంగా 8 ఇంక్లైన్ కాలనీలో నవీన్, శ్రీను, స్వరూప అనే ముగ్గురు వ్యక్తులతో పాటు రామగుండంలోని ఆనంద్ ఇంట్లో అజయ్, శశి, ఆనంద్‌లను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి మూడు కత్తులు, ఒక ఆటో, రక్తపు మరకలున్న చొక్కా, ప్రధాన నిందితుడు చంద్రశేఖర్‌కు చెందిన వస్తువులతో పాటు ఐదు మొబైల్ ఫోన్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పాతకక్షలతోనే హత్య చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారని పోలీసులు తెలిపారు. నాలుగేళ్ల క్రితం జరిగిన ఓ మర్డర్ కేసులో సుమన్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడని పోలీసులు చెప్పారు.