పిల్లలతో ప్రిన్సిపాల్ అసభ్య ప్రవర్తన- చితక్కొట్టిన ప్రజలు
పిల్లలకు విద్యా బుద్ధులు నేర్పించే ఓ గురువే దారి తప్పాడు. విద్యార్థినిలతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులంతా కలిసి ప్రిన్సిపాల్ ను చితక్కొట్టారు.
మాతృదేవోభవ, పితృదేవో భవ, ఆచార్య దేవోభవ అని రోజూ పిల్లల చేత చదివిస్తూ ఉంటాం. తల్లిదండ్రుల తర్వాత పిల్లలకు గురువే అన్నీ అని చెప్పేందుకు ఈ మంత్రాన్ని చెప్తుంటారు. అయితే పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఓ గురువే దారి తప్పాడు. కంటికి రెప్పలా కాచుకుంటూ.. బడిలో ఎలాంటి సమస్యలు లేకుండా చూసుకునే ఆ ప్రధానోపాధ్యాయుడును చూసి చిన్న పిల్లలు కూడా ఛీ అంటారు. ఎందుకంటే అతను విద్యార్థినుల పట్ల ఆసభ్యంగా ప్రవర్తించాడు. చిన్న పిల్లలని కూడా చూడకుడా చెడు దృష్టితో చూడడం, మాట్లాడడం, తాకడం వంటివి చేసేవాడు. దీంతో ఇబ్బంది పడిన పిల్లలు విషయాన్ని తమ తల్లిదండ్రులకు చెప్పడంతో.. తీవ్ర ఆగ్రహానికి గురైన వారంతా.. ప్రిన్సిపాల్ చితక్కొట్టారు. అయితే ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది.
ప్రధానోపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని..!
ఖమ్మం జిల్లాలోని వైరా మండలం కేజీ సిరిపురంలోని ప్రధానోపాధ్యాయుడు విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేశారు. గ్రామంలోని సర్కారు బడిలో విధులు నిర్వహిస్తున్న ప్రధానోపాద్యాయుడు రామారావు తమతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని పలువురు విద్యార్థినులు తమ కుటుంబ సబ్యులకు చెప్పారు. మాటలు, చేష్టలన్నీ వంకరగానే ఉన్నాయంటూ అమ్మా, నాన్నల వద్ద వాపోయారు. ఇకపై ప్రిన్సిపాల్ సార్ ఉంటే బడికి వెళ్లమంటూ భయపడ్డారు.
పిల్లల ఆవేదనను అర్థం చేసుకున్న తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. వెంటనే గ్రామ ప్రజలంతా కలిసి పాఠాశాల వద్దకు చేరుకున్నారు. అక్కడే ఉన్న ప్రధానోపాధ్యాయుడు రామారావుపై దాడికి పాల్పడ్డారు. అయితే విషయం తెలుసుకున్న పలువురు గ్రామస్థులు ప్రన్సిపాల్‌ను ఓ ప్రజాప్రతినిధి ఇంటికి తీసుకెళ్లారు.
ఉద్రిక్తత పెరగడంతో పోలీసుల రంగప్రవేశం..!
గ్రామస్థులు, విద్యార్థినుల తల్లిదండ్రులు ప్రజాప్రతినిధి ఇంటి ముందే ధర్నాకి దిగారు. ఎంతకీ పరిస్థితి సద్దమణగక పోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు అక్కడకు చేరుకొని ఆందోళనను అడ్డుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా ఉండటంతో పోలీసులు రామారావుని స్టేషన్‌కు తరలించారు. ప్రధానోపాధ్యాయుడు రామారావుపై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. తల్లిదండ్రుల ఆరోపణలపై పోలీసులు విచారణ చేస్తున్నారు.