Palnadu Crime : టీడీపీ నేత జల్లయ్య హత్య కేసులో 9 మంది అరెస్టు, పాత గొడవలే హత్యకు కారణం- ఎస్పీ శివ శంకర్ రెడ్డి
Palnadu Crime : పల్నాడు జిల్లా సంచలమైన జల్లయ్య హత్య కేసులో 9 మందిని అరెస్టు చేసినట్లు ఎస్పీ శివ శంకర్ రెడ్డి తెలిపారు. పాత కక్షలతోనే కాపుకాసి హత్య చేసినట్లు పేర్కొన్నారు.
Palnadu Crime : పల్నాడు జిల్లా దుర్గి మండలం జంగమహేశ్వరపాడు గ్రామంలో ఈ నెల 3వ తేదీన జరిగిన హత్య కేసులో తొమ్మిది మంది నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్పీ వై.శివ శంకర్ రెడ్డి తెలిపారు. పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎస్పీ శివశంకర్ రెడ్డి మాట్లాడారు. జంగమహేశ్వరపాడు గ్రామంలో కంచర్ల జల్లయ్య ఒక వర్గానికి నాయకత్వం వహిస్తూ ఉండేవాడని తెలిపారు. అదే గ్రామానికి చెందిన ఊరిబండి మన్నేయ్య మరొక వర్గానికి నాయకత్వం వహిస్తూ ఉండేవాడని తెలిపారు. ఈ రెండు వర్గాలకు గ్రామంలో చాలా కాలం నుండి తగాదాలు ఉన్నాయని, మృతి చెందిన కంచర్ల జల్లయ్య మీద దుర్గి పోలీస్ స్టేషన్లో ఏడు కేసులు నమోదు అయి ఉన్నాయని తెలిపారు. గత కొద్ది కాలం నుంచి జల్లయ్య వేరే గ్రామంలో ఉంటూ జంగమహేశ్వరపాడు గ్రామంలో ఉన్న తన వర్గాన్ని రెచ్చగొడుతూ మన్నయ్య వర్గం మీద గొడవలు ప్రోత్సహిస్తున్నారన్నారు. మన్నయ్య వర్గంలో ఎవరినైనా ఒకరిని చంపే అవకాశం కోసం ఎదురు చూస్తున్నారని మన్నయ్య వర్గం వారికి తెలిసిందన్నారు. ఈ నెల 3వ తేదీన కంచర్ల జలయ్య దుర్గి బ్యాంకు పని మీద వచ్చి వెళుతున్నాడని తెలుసుకున్న మన్నయ్య వర్గం దాడికి పాల్పడిందన్నారు.
కాపుకాసి దాడి
దుర్గి నుంచి రావులాపురం వెళ్తుండగా మించాలపాడు బస్టాండ్ వద్దకు కాపుకాసి ఊరిబండి మన్నయ్య అతని వర్గీయులు పది మందితో కలిసి రాడ్లు, గొడ్డళ్లతో దాడి చేశారని ఎస్పీ తెలిపారు. వారు ముగ్గురిని గాయపరచి అక్కడి నుంచి పారిపోయినట్లు తెలిపారు. దాడిలో తీవ్రంగా గాయపడిన కంచర్ల జల్లయ్య నరసరావుపేట జీబీఆర్ హాస్పిటల్ లో మృతి చెందినట్లు పేర్కొన్నారు. కంచర్ల బక్కయ్య ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా దుర్గి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి పారిపోయిన ముద్దాయిలలో ఊరిబండి మన్నయ్య, అంజయ్యతో పాటు మరో ఎనిమిది మందిని గురజాల డీఎస్పీ ఆధ్వర్యంలో మాచర్ల మండలం ద్వారకాపురి అడ్డరోడ్డు వద్ద అరెస్టు చేసినట్లు తెలిపారు. హత్య జరిగిన 24 గంటల్లోనే ముద్దాయిలను అరెస్ట్ చేసిన పోలీసులను ఎస్పీ అభినందించారు.
రోజంతా హైడ్రామా!
పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో శనివారం రోజంతా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ కార్యకర్తల ఆందోళనలతో ఉత్కంఠ రేగింది. ప్రత్యర్థుల చేతిలో శుక్రవారం హత్యకు గురైన దుర్గి మండలం జంగమహేశ్వరపాడుకు చెందిన టీడీపీ కార్యకర్త కంచర్ల జల్లయ్య (38) మృతదేహం తరలింపులో పోలీసుల తీరు విమర్శలకు దారితీసింది. జల్లయ్య మృతదేహానికి తమ అనుమతి లేకుండానే శవపరీక్ష నిమిత్తం పోలీసులు తరలించారని బంధువులు ఆరోపించారు. గోప్యంగా శవపరీక్ష పూర్తిచేశారన్నారు. జల్లయ్యకు నివాళులు అర్పించడంతో పాటు ప్రత్యర్థుల దాడిలో గాయపడిన వారిని పరామర్శించేందుకు టీడీపీ త్రిసభ్య కమిటీ ఆసుపత్రికి వస్తుందన్న ప్రకటనలతో పట్టణమంతా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. పోస్టుమార్టం తర్వాత శవాగారం వద్ద జల్లయ్య బంధువులు రోదిస్తుండగానే, పోలీసులు మృతదేహాన్ని బొల్లాపల్లి మండలం రావులాపురానికి తరలించారు.