OU JAC: 'అవి ఆగకుంటే వేలాది మందితో బన్నీ ఇల్లు ముట్టడిస్తాం' - అల్లు అర్జున్ ఫ్యాన్స్ బెదిరిస్తున్నారని ఓయూ జేఏసీ నేతల ఫిర్యాదు
Hyderabad News: తమను చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఓయూ జేఏసీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేసినందుకు ఆయనకు క్షమాపణ చెప్పాలని తమను బెదిరిస్తున్నారని అన్నారు.
OU JAC Leaders Complaint To Police On Threatening Calls: అల్లు అర్జున్ (Allu Arjun) అభిమానుల నుంచి తమకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటూ ఓయూ జేఏసీ (OU JAC) నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బన్నీ ఇంటిపై దాడి చేసినందుకు క్షమాపణ చెప్పాలంటూ అల్లు ఆర్మీ, అల్లు అర్జున్ ఫ్యాన్స్ పేరిట ప్రతి రోజూ వందల కాల్స్ వస్తున్నాయని తమను చంపేస్తామని బెదిరిస్తున్నారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. 'అల్లు అర్జున్ అభిమానుల నుంచి మాకు ప్రాణహాని ఉంది. మా ఫోన్ నెంబర్లు సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేస్తున్నారు. మాకు ఫోన్ కాల్స్ రాకుండా చేయాల్సిన బాధ్యత అల్లు అర్జున్‌దే. ఫోన్ కాల్స్ ఆగకపోతే వేలాది మందితో బన్నీ ఇంటిని ముట్టడిస్తాం. ఫోన్ చేసి బెదిరిస్తున్న వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి.' అని పేర్కొన్నారు.
కాగా, సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి రేవతి మరణానికి అల్లు అర్జున్ కారణమంటూ ఇటీవల ఓయూ విద్యార్థి జేఏసీ నేతలు బన్నీ ఇంటి వద్ద ఆందోళనకు దిగారు. బాధిత కుటుంబానికి రూ.కోటి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఇంటిపై రాళ్లు రువ్వారు. ఆయన ఇంట్లోకి దూసుకెళ్లేందుకు యత్నించారు. ఈ క్రమంలో ఉద్రిక్తత నెలకొంది. రాళ్లు తగిలి బన్నీ ఇంట్లో పూల కుండీలు ధ్వంసమయ్యాయి. పోలీసులు అక్కడికి చేరుకుని దాడికి పాల్పడ్డ ఆరుగురిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. వీరికి మరుసటి రోజే న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది.