Fraud Busted: ఆన్‌లైన్ షాపింగ్, అధిక వడ్డీ, లాభాల్లో వాటా పేరిట ఎర - ఏపీలో వెలుగు చూసిన రూ. 2 వేల కోట్ల మోసం
Fraud Busted: ఆంధ్రప్రదేశ్ లో ఓ భారీ మోసం వెలుగు చూసింది. ఏకంగా రూ.2 వేల కోట్లు మోసం చేసినట్లు తెలుస్తోంది.
Fraud Busted: ఆంధ్రప్రదేశ్ లో ఓ భారీ మోసం బయట పడింది. ఈ మోసం విలువ దాదాపు రూ. 2వేల కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు మండలానికి చెందిన దంపతులు.. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన రాజుతో కలిసి మూడేళ్ల క్రితం ఓ కంపెనీని స్థాపించారు. భర్తగా ఎండీగా ఉంటే, ఆయన భార్య డైరెక్టర్ గా ఉంటూ కంపెనీని నమోదు చేయించారు. ఆన్ లైన్ లో వినియోగ వస్తువులను హోల్ సేల్ ధరలకే డెలివరీ చేసేందుకు దీనిని ఏర్పాటు చేశారు. వినియోగ వస్తువులను ఉంచడానికి ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల, హైదరాబాద్ లో గోదాములను అద్దెకు తీసుకున్నారు. తమ ఆన్ లైన్ వ్యాపారం పేరుతో ఎక్కడ పడితే అక్కడ అప్పులు చేయడం మొదలు పెట్టారు. తనకు అప్పు ఇచ్చిన వారికి 10 రూపాయల వడ్డీ ఇస్తామని మాటిచ్చారు. అలాగే వారి వ్యాపారంలో వచ్చే లాభాల్లో వాటా ఇస్తానని నమ్మించారు.
వీరి మాటలు నమ్మిన ఎంతో మంది వారికి లక్షల్లో, కోట్లలో డబ్బు అప్పుగా ఇచ్చారు. ఎన్టీఆర్ జిల్లా దుగ్గిరాలపాడు సమీపంలోని గూడెం మాధవరానికి చెందిన ఓ వ్యక్తి అయితే ఏకంగా రూ. 10 కోట్లు ఇచ్చాడు. కంచికచర్ల మండలం పరిటాలకు చెందిన మరో వ్యక్తి రూ. 45 కోట్ల వరకు వారి వ్యాపారంలో పెట్టుబడి పెట్టినట్లు తెలుస్తోంది. ఇలా ఎంతో మంది రూ. 50 లక్షల నుంచి రూ. 80 కోట్ల వరకు ఇచ్చినట్లు సమాచారం. కంచికచర్ల మండలం పరిటాలలో ఓ మహిళ తన పేరుపై ఉన్న 4 ఎకరాల భూమిని ఆ దంపతులకే విక్రయించి.. అలా వచ్చిన రూ. 2 కోట్ల రూపాయలను వారి వ్యాపారంలోనే పెట్టుబడి పెట్టారు.
విజయవాడ సమీపంలోని గొల్లపూడిలో రూ. 100 కోట్లు, కవులూరులో రూ. 80 లక్షలు, కంచికచర్లలోని ఓ అపార్ట్ మెంట్ వాసులు రూ. 10 కోట్లు ఇచ్చినట్లు తెలుస్తోంది. విజయవాడ, హైదరాబాద్, ఇబ్రహీంపట్నం, మైలవరం తదితర ప్రాంతాలకు చెందిన చాలా మంది భారీ మొత్తంలో అప్పుగా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇలా పెట్టుబడి పెట్టిన చాలా మందికి నెల నెలా వడ్డీ ఇవ్వడంతో.. వారు మళ్లీ ఆ వడ్డీనే పెట్టుబడి పెట్టేసినట్లు సమాచారం.
ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన రాజకీయ నేతలు కూడా ఈ కంపెనీలో భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టినట్లు తెలుస్తోంది. కోట్లలో పెట్టుబడి పెట్టారని సమాచారం. మోసం గురించి బయటకు రాగానే.. తమ డబ్బులు రాబట్టుకునేందుకు వారిపై తీవ్రమైన ఒత్తిడి చేస్తున్నారని తెలుస్తోంది. కొందరు వాళ్ల ఇంటికి వెళ్లినట్టు కూడా స్థానికంగా చెప్పుకుంటున్నారు.
భారీ మొత్తంలో పెట్టుబడి వచ్చిన తర్వాత ఇక మోసం చేయాలని నిర్ణయించుకున్న తర్వాత పక్కా ప్రణాళిక ప్రకారం నడుచుకున్నారు. క్రమంగా వారి వ్యాపారాన్ని తగ్గించడం ప్రారంభించారు. గోదాముల్లో సరకును తగ్గించారు. గోదాములో స్టాకు లేకపోయినా వ్యాపారం చేస్తున్నట్లు అందరినీ నమ్మించాడు. ఇంకా భారీ మొత్తంలో అప్పులు చేయడం ప్రారంభించారు. ఆ డబ్బులతో హైదరాబాద్ లో విల్లాలు, విలువైన స్థలాలు కొన్నారు. 4 రోజుల క్రితం కంచికచర్ల మండలం పరిటాలలోని ఓ వ్యక్తి ఇంటికి దాదాపు 20 మంది వరకు వచ్చి డబ్బుల విషయమై గట్టిగా నిలదీసి కొట్టినట్లు తెలుస్తోంది. తర్వాత అతడు అక్కడి నుంచి హైదరాబాద్ కు మకాం మార్చినట్లు సమాచారం. బాధితులు అతడిపై హైదరాబాద్ లోని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది.