Nizamabad Crime : నెలకు వెయ్యి కడితే కారు మీ సొంతం, నిజామాబాద్ లో లక్కీ డ్రా పేరుతో భారీ మోసం!
Nizamabad Crime : లక్కీ లాటరీల పేరుతో నిజామాబాద్ లో ఘరానా మోసానికి పాల్పడ్డారు కేటుగాళ్లు. లక్కీ డ్రా అంటే ఎగబడ్డ ప్రజలు రూ.40 కోట్లకు పైగా చెల్లించుకున్నారు.
Nizamabad Crime : లక్కీ డ్రా పేరిట కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేశారు కేటుగాళ్లు. లక్కీ డ్రాలో ప్రతి ఒక్కరికీ ప్రైజ్ గ్యారంటీ అని చెప్పడంతో ప్రజలు ఎగబడ్డారు. నెలకు రూ.1000 చొప్పున కట్టేశారు. ప్రజల్లో నమ్మకం కలిగించడానికి కొద్ది నెలలు లక్కీ డ్రా తీసి బహుమతులు అందించారు. ప్రజల్లో నమ్మకం కుదిరాక అనుకున్న అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేసి బోర్డు తిప్పేశారు నిర్వాహకులు. 16 నెలలు క్రమం తప్పకుండా డబ్బులు కడితే తప్పకుండా ప్రైజ్ ఇస్తామని నిండా ముంచేశారు. కారు, బైక్, సోపాలు అంటూ ఆశచూపి కోట్లలో వసూలు చేసి బోర్డు తిప్పేశారు అనీయా గ్రీన్ ఎంటర్ ప్రైజెస్.
అసలేం జరిగింది?
నిజామాబాద్ జిల్లాలో అనీయా గ్రీన్ ఎంటర్ ప్రైజెస్ లక్కీ డ్రా పేరుతో వేల మందికి కుచ్చుటోపీ పెట్టింది. లక్కీ డ్రా స్కీమ్ ప్రారంభించిన సంస్థ వేల మందిని సభ్యులుగా చేర్చుకుంది. ఏజెంట్ల సాయంతో నెలకు రూ.1000 చొప్పున వసూలు చేసింది. నెలవారీ లక్కీ డ్రాలో కార్లు, బైకులు, ఫ్రిజ్‌లు ఇస్తామని నమ్మబలికింది. ఈ వ్యవహారం కొద్దినెలలు సాఫీగానే సాగిపోయింది. ఆ తర్వాత లక్కీ డ్రా నిలిచిపోయింది. అయినా నెలవారీ డబ్బులు వసూలు చేశారు ఎంటర్ప్రైజెస్ నిర్వాహకులు. సుమారు 16 నెలలు గడిచిపోయాయి. తీరా తమ డబ్బు తమకు తిరిగి ఇవ్వమని స్కీమ్‌లో సభ్యులు అడగడంతో సంస్థ నిర్వాహకులు ఫోన్లు తీయడం మానేశారు. కొద్దిరోజులకి ఆ ఫోన్లు పనిచేయకపోవడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. సుమారు 3 వేల మంది నుంచి 9 కోట్ల 60 లక్షల రూపాయలు వసూలు చేశారని బాధితులు ఆరోపించారు.
రూ.40 కోట్లకు పైగా వసూలు
రెండు స్కీముల్లో 6 వేల మంది సభ్యులుగా ఉన్నారని బాధితులు అంటున్నారు. అనీయా ఎంటర్ప్రైజెస్ పేరుతో రెండు సార్లు లక్కీ డ్రా నిర్వహించగా, మొత్తం సుమారు రూ.40 కోట్లతో నిర్వాహకులు బోర్డు తిప్పేశారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని నెలల క్రితం ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ వద్ద బాధితులు బోరుమన్నారు. నిజామాబాద్ జిల్లాలో సుమారు ఆరువేలకు మంది పైగా మోసపోయారు. 150 మంది బాధితులు కలెక్టరేట్‌కి వచ్చి ఫిర్యాదు చేశారు. నిందితులు విదేశాలకు పారిపపోయే అవకాశం ఉందని, వారి పాస్‌పోర్టులు సీజ్ చేసి వెంటనే వారిని అరెస్టు చేయాలని బాధితులు డిమాండ్ చేశారు. సివిల్ మ్యాటర్ అంటూ పోలీసులు పట్టించుకోవట్లేదని, నమ్మించి మోసం చేసిన నిందితులపై కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని బాధితులు కోరుతున్నారు.
హైదరాబాద్ కు మకాం
నిజామాబాద్ కు చెందిన ఇద్దరు ఇద్దరు వ్యక్తులు ఈ ఎంటర్ప్రైజెస్ నడిపించారు. సదరు వ్యక్తిని బాధితులు నిలదీయడంతో హైదరాబాద్ కు మకాం మార్చాడు. దీంతో డ్రా కోసం డబ్బులు కట్టిన వారు అయోమయంలో పడ్డారు. అయితే డ్రాలో దక్కిన వస్తువులు సైతం నాసిరకంగా ఉన్నాయని డ్రాలో వస్తువులు గెలుచుకున్న కొందరు సభ్యులు చెబుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ప్రత్యేక చర్యలు తీసుకొని, ఇలాంటి లక్కీ డ్రా స్కిమ్ మోసాలపై ఉక్కుపాతం మోపాలని, బాధితులు వేడుకుంటున్నారు. అలాగే మోసపోయిన వారికి డబ్బులు ఇప్పించాలని కోరుతున్నారు.
Also Read : Hyderabad: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సీబీఐ దూకుడు, హైదరాబాద్‌లో మరో అరెస్టు
Also Read : Khammam: భర్త కాళ్లు చేతులు కట్టేసి కాల్వలో పడేసిన భార్య, శవం కూడా దొరక్కుండా ప్లాన్! చివరికి