Hyderabad: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సీబీఐ దూకుడు, హైదరాబాద్‌లో మరో అరెస్టు
ఢిల్లీ లిక్కర్ వ్యవహారంలో పెద్ద ఎత్తున రాబిన్ డిస్టలరీస్ టెండర్లు దక్కించుకుందని ఆరోపణలు ఉన్నాయి. అభిషేక్ ఓ పత్రికలో కూడా పెట్టుబడులు పెట్టారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం అలజడి హైదరాబాద్‌లో అధికంగా ఉంది. తాజాగా కేసులో మరో కీలక అరెస్టు జరిగింది. ఆదివారం రాత్రి బోయినపల్లి అభిషేక్ రావు అనే వ్యక్తిని సీబీఐ అరెస్టు చేసింది. ఈ అభిషేక్ రావు అనే వ్యక్తి రాబిన్ డిస్టలరీస్ కంపెనీలో భాగస్వామిగా ఉన్నారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న రామచంద్రన్ పిళ్లైతో కలిసి ఆ కంపెనీ నిర్వహిస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ వ్యవహారంలో పెద్ద ఎత్తున రాబిన్ డిస్టలరీస్ టెండర్లు దక్కించుకుందని ఆరోపణలు ఉన్నాయి.
అభిషేక్ ఓ పత్రికలో కూడా పెట్టుబడులు పెట్టారు. దీంతో ఆ పత్రిక ఛైర్మన్ తో పాటుగా సంబంధిత కార్యాలయాల్లోనూ సోదాలు చేశారు. మరోవైపు, ఢిల్లీ, పంజాబ్ తో పాటు దేశ వ్యాప్తంగా 35 ప్రాంతాల్లో ఈడీ దాడులు జరిగాయి. ఏ14గా ఉన్న రామచంద్ర పిళ్లైతోనూ అభిషేక్ కు వ్యాపార సంబంధాలు ఉన్నట్లుగా ఈడీ విచారణలో తేలింది.
లిక్కర్ స్కాంలో కీలక పాత్ర పోషించిన సమీర్ మహేంద్రు, విజయ్ నాయర్ లు గతంలోనే అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. సమీర్ మహేంద్రు అనే వ్యక్తి ఇండో స్పిరిట్స్ డైరెక్టర్ గా ఉన్నారు. ఢిల్లీ డిఫ్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు సన్నిహితుడైన దినేశ్ అరోరా బ్యాంక్ ఖాతాలోకి యూకో బ్యాంకు ద్వారా సమీర్ మహేంద్రు రూ.కోటి ట్రాన్స్ ఫర్ చేసినట్లుగా ఈడీ విచారణలో తేలింది. ఆ నగదు ఆ తర్వాత సిసోడియాకు చేరిందని ఎఫ్‌ఐఆర్‌లో సీబీఐ ఆరోపించింది. కోట్ల రూపాయల వరకు నగదు బదిలీ చేసిన అర్జున్ పాండే, విజయ్ నాయర్, రామచంద్ర పిళ్లై మీద కూడా ఈడీ కేసులు నమోదు చేసింది.
సీబీఐ కార్యాలయం వెల్లడి
ప్రముఖ వ్యాపారవేత్త అభిషేక్ బోయినపల్లిని సీబీఐ అధికారులు అరెస్టు చేసి, ఆదివారం రాత్రి డిల్లీకి తరలించినట్లుగా సీబీఐ కేంద్ర కార్యాలయం వెల్లడించింది. ప్రస్తుతం ఢిల్లీ సీబీఐ కార్యాలయంలో ఆయనను విచారణ చేస్తున్నారు. అభిషేక్ రావు స్టేట్‌మెంట్‌తో మరికొంత మంది పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉంది. దాంతో సీబీఐ మరికొంత మందిపై చర్యలు తీసుకోనుంది.
అభిషేక్ బోయినపల్లికి ప్రస్తుతం 9 కంపెనీలతో సంబంధం ఉన్నట్లుగా చెబుతున్నారు. అనూస్ ఒబేసిటీ అండ్ ఎలక్ట్రోలిసీస్, రాబిన్ డిస్టిలరీస్, అగస్టీ వెంచర్స్, ఎస్ఎస్ మైన్స్ అండ్ మినరల్స్, నియోవర్స్ రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్, వాల్యూ కేర్ ప్రైవేట్ లిమిటెడ్, జీనస్ నెట్ వర్కింగ్ ప్రైవేట్ లిమిటెడ్, అనూస్ హెల్త్ అండ్ వెల్నేస్ వంటి కంపెనీలలో అభిషేక్ కీలక పాత్ర పోషిస్తున్నట్లుగా తెలుస్తోంది.