Nirmal Supari Murder Case: సవతి తల్లితో వివాహేతర బంధం - చివరికి మర్డర్ - చేయించింది కూడా సవతి తల్లే !
Nirmal District Police: అక్రమ సంబంధాన్ని నిరాకరించిన సవితి కుమారుడిని సుపారీ హంతకులతో దారుణంగా హత్య చేయించిన అన్వరీ బేగం. నిర్మల్ జిల్లా పోలీసుల వేగవంతమైన దర్యాప్తులో అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్.

Maharashtra Supari Gang Arrest: వివాహేతర బంధం కోసం సవితి కుమారుడినే కిరాయి హంతకులతో దారుణంగా హత్య చేయించిన కేసును నిర్మల్ జిల్లా పోలీసులు అత్యంత చాకచక్యంగా ఛేదించారు. మహారాష్ట్రకు చెందిన అంతర్రాష్ట్ర సుపారీ గ్యాంగ్‌ను రంగంలోకి దించి ఈ ఘాతకానికి ఒడిగట్టిన ప్రధాన కుట్రదారు అన్వరీ బేగంతో పాటు ముఠా సభ్యులను నిర్మల్ పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీ డాక్టర్ జి. జానకి షర్మిలా ఐపీఎస్ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి స్కార్పియో కారు, మోటార్ సైకిల్, రెండు కత్తులు , ఐదు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
సవతి తల్లితో అస్లాం ఖాన్ వివాహేతర బంధం
మృతుడు అస్లాం ఖాన్ తన సవితి తల్లి అన్వరీ బేగంతో కొంతకాలంగా వివాహేతర సంబంధం కలిగి ఉన్నాడు. అయితే ఇటీవల అస్లాం ఖాన్ తాను కూడా సమాజంలో అందరిలాగే పెళ్లి చేసుకుని, కుటుంబ జీవితం గడపాలని నిర్ణయించుకున్నట్లు అన్వరీ బేగానికి తెరిపాడు. దీనికి తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసిన ఆమె, వివాహం చేసుకోవద్దని.. తమ సంబంధం ఇలాగే కొనసాగాలని, ఆర్థికంగా ఎంత సహాయమైనా చేస్తానని ఒత్తిడి తెచ్చింది. ఒకవేళ పెళ్లి చేసుకుంటే ప్రాణాలు తీయిస్తానని హెచ్చరించినా అస్లాం వినకపోవడంతో పాటు, ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో వివాదం కాస్త బట్టబయలైంది.
చెప్పినట్లు హత్య చేయించిన సవతి తల్లి
తన అక్రమ సంబంధం సమాజంలో బయటపడి పరువు పోయిందనే ఆగ్రహం, అస్లాం ఖాన్ తనను విడిచి మరో యువతిని వివాహం చేసుకుంటాడనే కక్షతో అన్వరీ బేగం అతడిని మట్టుబెట్టేందుకు పక్కా ప్లాన్ వేసింది. ఇందులో భాగంగా మహారాష్ట్రకు చెందిన ముఖీద్ అనే వ్యక్తితో రూ. 6 లక్షలకు సుపారీ ఒప్పందం కుదుర్చుకుని, రూ. 50 వేల అడ్వాన్స్ చెల్లించింది. అస్లాం ఫొటోలు, కదలికలు నిందితులకు అందిస్తూ, తన సొంత తమ్ముడు షేక్ మహమ్మద్‌ను కూడా ఈ కుట్రలో భాగస్వామిని చేసింది. జులై 1న ఆసుపత్రి వద్ద చేసిన మొదటి హత్యాయత్నం విఫలమవ్వడంతో, జులై 15న రెండోసారి పక్కా రెక్కీ నిర్వహించి దారుణానికి ఒడిగట్టారు.
మహారాష్ట్ర ముఠా సుపారీ మర్డర్
జులై 15న ఉదయాన్నే మహారాష్ట్ర నుంచి స్కార్పియో వాహనంలో వచ్చిన సుపారీ ముఠా, పోలీసులకు చిక్కకుండా వాహనం నంబర్ ప్లేట్ చివరి అంకె "6"ను తొలగించారు. ఆ తర్వాత వైఎస్సార్ కాలనీలోని ఈడెన్ గార్డెన్ సమీపంలో మాటు వేశారు. అన్వరీ బేగం నిరంతరం ఫోన్లో సమాచారం ఇస్తూ అస్లాం ఆటోకు నల్ల జెండాలు ఉన్నాయని, అతడు నల్ల చొక్కా ధరించాడని క్లూస్ ఇచ్చింది. అస్లాం ఖాన్ ఆటోలో వస్తుండగా సుపారీ హంతకులు అడ్డుపడి, నడిరోడ్డుపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. తీవ్ర గాయాలపాలైన అస్లాం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
అన్వరీ బేగం అరెస్ట్
ఘటన జరిగిన వెంటనే నిర్మల్ ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల పర్యవేక్షణలో 4 దర్యాప్తు బృందాలు రంగంలోకి దిగాయి. భైంసా ఏఎస్పీ సాయి కిరణ్, నిర్మల్ ఎస్‌డీపీఓ పి. శ్రీనివాస్ నేతృత్వంలో సీఐ ఎం. కృష్ణ, ఎస్సైలు లింబాద్రి, శ్రీకాంత్, గోపీ, గణేష్, సాయికృష్ణ తదితర పోలీసు అధికారులు చాకచక్యంగా వ్యవహరించి నాందేడ్ మార్గంలో నిందితుల ఆచూకీ కనిపెట్టి అరెస్ట్ చేశారు. ప్రధాన కుట్రదారు అన్వరీ బేగాన్ని ఇప్పటికే రిమాండ్‌కు తరలించగా, సుపారీ ముఠా సభ్యులను కూడా న్యాయస్థానంలో హాజరుపరిచారు.
ట్రెండింగ్ వార్తలు






















