Nirmal News : క్రికెట్ బంతి కోసం వెళ్లి తిరిగిరాని లోకాలకు, కరెంట్ షాక్ తో బాలుడు మృతి!
Nirmal News : నిర్మల్ జిల్లా ఖానాపూర్ లో విషాదం చోటుచేసుకుంది. క్రికెట్ ఆడుకుంటూ బంతి పక్కింటిలో పడిందని వెళ్లిన బాలుడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు.
Nirmal News : నిర్మల్ జిల్లాలో విషాద ఘటన జరిగింది. కరెంట్ షాక్ తో బాలుడు మృతి చెందాడు. ఇంటి పెరటిలో కూరగాయల మొక్కల చుట్టూ ఉన్న ఫెన్సింగ్ కు కరెంట్ పెట్టారు. క్రికెట్ బంతి ఆ పెరటిలోకి వెళ్లడంతో అక్కడ పెట్టిన కరెంట్ తీగలు తగిలి బాలుడు మృతి చెందాడు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణానికి చెందిన ముదం ఈశ్వర్(11) ఇంటి పెరటిలో పెట్టిన కరెంట్ తీగలు తగిలి మృతి చెందాడు. ఇంటి యజమాని విఠల్ పరారీల ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు.
"నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం సుభాష్ నగర్ లో ఈ రోజు ఈశ్వర్ అనే బాలుడు క్రికెట్ ఆడుతున్న సమయంలో కరెంట్ షాక్ తగిలి మృతి చెందాడు. క్రికెట్ ఆడుతున్నప్పుడు బంతి పక్కింటి పెరటిలో పడింది. బంతి కోసం వెళ్లిన ఈశ్వర్ కూరగాయల మొక్కల చుట్టూ పెట్టిన ఫెన్సింగ్ కరెంట్ పెట్టారు. వీటిని ముట్టుకోవడంతో ఈశ్వర్ చనిపోయాడు. బాలుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టాం." - ఖానాపూర్ సీఐ వినోద్
కరెంట్ షాక్ కొట్టినప్పుడు ఇలా చేయండి
కరెంట్ షాక్ తగిలినప్పుడు ఏం చెయ్యాలనే విషయం గురించి చాలా మందికి అవగాహన ఉండదు. ఎవరో ఒకరు హాస్పిటల్‌కు తీసుకెళ్ళే వరకు చికిత్స ఏమి ఉండదు. కానీ ఈలోపే ప్రమాదానికి గురైన బాధితుడు పరిస్థితి దిగజారవచ్చు. అందుకే కరెంట్ షాక్ తగిలినప్పుడు ఎలా ప్రాథమిక చికిత్స చెయ్యాలని అనేది తెలుసుకోవాలి.
కరెంట్ షాక్ తగిలినప్పుడు ఎలా స్పందించాలి?
మన శరీరాలు విద్యుత్ వాహకాలు. కరెంట్ పోల్ లేదా వైర్ పట్టుకున్నప్పుడు షాక్ కొడితే వాటి నుంచి బాధిత వ్యక్తిని విడిపించకుండా పట్టుకోకూడదు. అలా వ్యక్తిని పట్టుకుంటే అతని ద్వారా మరొకరిలోకి విద్యుత్ ప్రవహిస్తుంది. ఎలక్ట్రిక్ షాక్ వల్ల తీవ్రమైన కాలిన గాయాలు ఏర్పడతాయి. ఒక్కోసారి ప్రమాదం తీవ్రంగా ఉంటే ప్రాణాపాయం లేదా కార్డియాక్ అరెస్ట్ జరిగే అవకాశం ఉంది.
ఎప్పుడు అత్యవసర చికిత్స చేయాలి?
- ⦿ కరెంట్ షాక్ వల్ల కాలిన గాయాలైనప్పుడు
- ⦿ ఊపిరి ఆడకపోవడం
- ⦿ హార్ట్ బీట్ లో తేడా
- ⦿ కార్డియాక్ అరెస్ట్ లేదా గుండె పోటు
- ⦿ మూర్చలు రావడం
- ⦿ స్పృహ కోల్పోవడం
షాక్ కొట్టినపుడు చేయాల్సిన ప్రాథమిక చికిత్స
☀ తడి చేతులు, కాళ్లతో ఎప్పుడు విద్యుత్ మూలాన్ని తాకకూడదు. అలా చేస్తే మీరు కూడా విద్యుదాఘాతానికి గురవుతారు.
☀ విద్యుత్ సరఫరా నిలిపివేయాలి. అది సాధ్యం కాకపోతే చెక్క లేదా ఇన్సులేటింగ్ మెటీరియల్ తో బాధిత వ్యక్తిని విద్యుత్ ప్రసరించే వస్తువు నుంచి దూరంగా వచ్చేలా కొట్టాలి.
☀ బాధిత వ్యక్తి శ్వాస తీసుకుంటున్నారా, వారి పల్స్ ఎలా ఉందనేది చెక్ చెయ్యాలి. షాక్ కు గురైన వ్యక్తిని ఎప్పుడు కదిలించకూడదు.
☀ షాక్ కొట్టిన వ్యక్తిని పడుకోబెట్టి వాళ్ళ కాళ్ళని పైకి లేపి తలని కొద్దిగా కిందకి ఉంచాలి.
☀ కండరాల నొప్పి లేదా తిమ్మిరి, గుండె కొట్టుకునే విధానంలో మార్పు గమనిస్తే వెంటనే వైద్య అత్యవసర సేవలకి ఫోన్ చెయ్యాలి.
☀ బాధితుడు శ్వాస తీసుకోవడం, దగ్గు లేదా కదలిక లేకుండా ఉంటే వెంటనే సీపీఆర్ చెయ్యాలి.
☀ కాలిన ప్రదేశాల మీద శుభ్రమైన గుడ్డతో కప్పి ఉంచాలి. దుప్పటి లేదా టవల్ ఉపయోగించొద్దు. అవి వాటి దారాలు కాలిన గాయాలకి అంటుకుని ఇన్ఫెక్షన్ అయ్యే ప్రమాదం ఉంది.