Nellore: వెనుదిరిగిన ఎన్డీఆర్ఎఫ్.. ఆలస్యమవుతున్న గాలింపు..
నెల్లూరు జిల్లా సంగం వద్ద బీరాపేరు వాగులో ఆటో బోల్తా పడిన ఘటన జరిగి వారం కావస్తోంది. ఆటో బోల్తాపడిన రోజు నుంచీ గల్లంతైన వారి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.
నెల్లూరు జిల్లా సంగం వద్ద బీరాపేరు వాగులో ఆటో బోల్తాపడిన ఘటన జరిగి వారం కావస్తోంది. ఆటో బోల్తాపడిన రోజు నుంచీ గల్లంతైనవారికోసం తీవ్రంగా గాలిస్తున్నారు. మొదటగా స్థానిక పోలీసులు, ఫైర్ సిబ్బంది, గజ ఈతగాళ్ల సాయంతో వెదుకులాడినా ఫలితం లేదు. ఆ తర్వాత ఎస్డీఆర్ఎఫ్ టీమ్ రంగంలోకి దిగింది. అయినా ఫలితం లేదు. రెండ్రోజుల తర్వాత ఎన్డీఆర్ఎఫ్ బృందం వెదుకులాట మొదలు పెట్టడంతో మొత్తం ముగ్గురి మృతదేహాలు దొరికాయి. మరో ఇద్దరి జాడ తెలియాల్సి ఉంది. 45 ఏళ్ల సంపూర్ణ, 60ఏళ్ల వృద్ధురాలు ఆదెమ్మ ఆచూకీ ఇంకా తెలియరాలేదు. వారిద్దరూ బతికి ఉంటారన్న ఆశ కుటుంబ సభ్యుల్లో కూడా లేదు. అయితే కనీసం మృతదేహాలు కూడా దొరక్కపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనలో ఉన్నారు.
వారం గడుస్తున్నా కొనసాగుతున్న గాలింపు..
ఆటో ప్రమాదం జరిగినప్పుడు అందులో డ్రైవర్ సహా మొత్తం ప్రయాణికులు 12మంది ఉన్నారు. ప్రమాదం జరిగినప్పుడు ఆటో బోల్తా పడటంతో ఒక పిల్లవాడు మినహా మిగతా 11మంది ఆటోతో సహా బీరాపేరు వాగులో పడ్డారు. అయితే ఆటోని అంటి పెట్టుకుని ఆరుగురు ఉండిపోయారు. వారందర్నీ స్థానికులు బయటకు తీశారు. వారిలో నాగవల్లి అనే బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. మిగతా ఆరుగురు క్షేమంగా ఉన్నారు. అయితే చిన్న చిన్న గాయాలు కావడంతో వారికి చికిత్స కొనసాగించారు.
నిద్రాహారాలు మాని గాలింపు..
ఆటో బోల్తాపడిన వెంటనే గల్లంతైనవారు బతికుండే అవకాశం ఉండటంతో అధికారులు ఉరుకులు పరుగులు పెట్టారు. జిల్లా ఎస్పీ, జాయింట్ కలెక్టర్ సహా ఇతర అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యల్ని పర్యవేక్షించారు. ఎప్పటికప్పుడు ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందికి సూచనలిస్తూ గాలింపు కొనసాగించారు. అయితే ప్రమాదం జరిగి రెండురోజులైన తర్వాత కూడా ఎవరి ఆచూకీ దొరకలేదు.
ప్రమాద ఘటన తర్వాత ఎన్డీఆర్ఎఫ్ ని రంగంలోకి దించారు. అప్పటికే మృతదేహాలు పైకి తేలాయి. ఒకరి తర్వాత ఒకరు మొత్తం ముగ్గురి మృతేదేహాల్ని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు బయటకు తీశాయి. మృతదేహాలను పోస్ట్ మార్టం చేసి బాధిత కుటుంబాలకు అప్పగించారు. అయితే ఆ తర్వాత మళ్లీ గాలింపు చర్యల వల్ల ఫలితం లేకుండా పోయింది. ఇంకా ఇద్దరి ఆచూకీ దొరకలేదు. దీంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెనుదిరిగాయి. స్థానిక పోలీసులు, ఫైర్ సిబ్బంది సాయంతో ప్రస్తుతం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
పెద్దమనసు చాటుకున్న ఆర్డీవో..
ఆత్మకూరు ఆర్డీవో చైత్ర వర్షిణి సంగం బీరాపేరు వాగు వంతెన వద్ద ఆటో ప్రమాదం లో గల్లంతైన కుటుంబాలకు తన సొంత నిధులు 20 వేల రూపాయిలు ఆర్థిక సాయంగా అందించారు. ఆత్మకూరు కు చెందిన అంబేద్కర్ ఇండియా మిషన్ నాయకులు గల్లంతైన కుటుంబాల పోషణ, స్థితి గతుల గురించి ఆర్డీవో కి వివరించడంతో ఆమె వెంటనే స్పందించి 20వేలరూపాయలు అందించారు. మరోవైపు ప్రభుత్వం తరపున బాధిత కుటుంబాలను వెంటనే ఆదుకుంటామని ఆమె హామీ ఇచ్చారు.