(Source: ECI/ABP News/ABP Majha)
Nellore Double Murder : నెల్లూరు జంట హత్యల వెనక కుట్రకోణం!
Nellore Double Murder : నెల్లూరులో జంట హత్యలు సంచలనంగా మారాయి. పోలీసులకు కత్తి, కర్ర మినహా ఇంకేం క్లూ లభించలేదు. డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు నిర్వహించినా ఫలితం లేదని అర్థమవుతోంది.
Nellore Double Murder : నెల్లూరులో జరిగిన జంట హత్యలు సంచలనంగా మారాయి. పోలీసులకు కత్తి, కర్ర మినహా ఇంకే క్లూ లభించలేదు. డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు నిర్వహించినా ఫలితం లేదని అర్థమవుతోంది. పక్కా ప్రణాళికతో దంపతుల్ని దుండగులు హత్య చేసినట్టు తెలుస్తోంది. హోటల్ మూసేసి భర్త రాత్రి 12గంటలకు వస్తాడనగా, భార్య తలుపులు వేసుకోకుండా నిద్రకు ఉపక్రమించడంతో హంతకులు సులభంగా లోపలికి రావడానికి అవకాశం దొరికింది. అయితే లాకర్లు ఓపెన్ కాకపోవడంతో చేతికందిన డబ్బు తీసుకుని పారిపోయే క్రమంలో అడ్డొచ్చిన భర్తను కూడా వారు నరికేసి చంపినట్టు అర్థమవుతోంది.
టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్
మృతురాలు సునీత టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ అనే విషయం బయటకు రావడంతో టీడీపీ నాయకులు కూడా బాధిత కుటుంబాన్ని పరామర్శించి, హంతకుల్ని వెంటనే అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేశారు. నెల్లూరులో జంటహత్యల వెనక కుట్రకోణం ఉందని అనుమానం వ్యక్తం చేశారు టీడీపీ నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన ఆయన పోలీసుల తీరుని తప్పుబట్టారు. ఇటీవల అధికార పార్టీ నేత ఒకరు నేరుగా పోలీస్ స్టేషన్ కి వచ్చి తమ మనుషుల్ని విడిపించుకు వెళ్లారని, అలాంటి పరిస్థితులు నెల్లూరులో ఉన్నాయని, పోలీసులకు ఖాకీ యూనిఫామ్ ఎందుకని ప్రశ్నించారు. హత్యకు గురైనవారు వృద్ధులు కాదని, మంచంపట్టి ఉన్న రోగులు కూడా కాదని, వారు పెనుగులాడతారని తెలిసి కూడా ఈ దారుణానికి ఒడిగట్టారంటే, దీని వెనక కుట్రకోణం ఉందని వారు అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలన్నారు. మరణించిన దంపతుల్లో సునీత.. తెలుగుదేశం పార్టీ సానుభూతి పరురాలని, గతంలో స్థానిక సమస్యలను ఆమె తనకు ఫోన్ ద్వారా తెలియజేశారని అన్నారు అబ్దుల్ అజీజ్.
మరోవైపు నెల్లూరు పోలీసులు కూడా ఈ విషయంలో హడావిడి పడుతున్నారు. ఇటీవల కాలంలో నెల్లూరులో పట్టపగలే హత్యలు జరిగిన ఉదాహరణలున్నాయి. ఇప్పుడీ హత్యతో ఒక్కసారిగా నగరం ఉలిక్కిపడింది. పడారుపల్లిలోని అశోక్ నగర్ మరీ అంత రద్దీ ప్రాంతం కాకపోవడంతో హంతకుల జాడ ఎవరూ పసిగట్టలేకపోయారని అంటున్నారు. అయితే దొంగలు మరీ హత్యకు చేయడానికి వెనకాడలేదంటే అదో పెద్ద దొంగల ముఠా అయి ఉంటుందని కూడా అనుమానిస్తున్నారు. ఇలాంటి ముఠాలు నగరంలో సంచరిస్తుంటే, కనీసం పోలీసులకు ఎందుకు అనుమానం రాలేదు, ప్రతిరోజూ సీసీ కెమెరాలు చెక్ చేసుకునే ఇంటెలిజెన్స్ డిపార్ట్ మెంట్ అనుమానితుల్ని ఎందుకు గుర్తించలేకపోయిందనేదే ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది.
నెల్లూరు డబుల్ మర్డర్ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం అవ్వడంతో జిల్లా పోలీసులపై ఒత్తిడి పెరిగింది. నేరుగా జిల్లా ఎస్పీ విజయరావు కూడా సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. డాగ్ స్క్వాడ్ సహాయంతో విచారణ ముమ్మరం చేయాలన్నారు. అనుమానితుల్ని అదుపులోకి తీసుకోవాలని చెప్పారు. చుట్టుపక్కల వారు భయభ్రాంతులకు గురికాకుండా కొన్నిరోజులపాటు పెట్రోలింగ్ నిర్వహించాలన్నారు. మొత్తమ్మీద ఈ జంట హత్యల వ్యవహారం ఇప్పుడు నెల్లూరు పోలీసులకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది.
Also Read : Visakha Crime : విశాఖలో వరుస హత్యలు, కత్తులు దూస్తున్న ప్రత్యర్థులు!
Also Read : Nellore Murders: హోటల్ ఓనర్ దంపతుల దారుణ హత్య, ఇంట్లోనే గొంతుకోసి మరీ - బంగారం అంతా అక్కడే కానీ