Visakha Crime : విశాఖలో వరుస హత్యలు, కత్తులు దూస్తున్న ప్రత్యర్థులు!
Visakha Crime : విశాఖలో వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. ఇటీవల ఓ రౌడీ షీటర్ ను ప్రత్యర్థులు హత్య చేశారు. ఈ ఘటన మరవక ముందే అల్లిపురంలో పెయింటర్ పై ప్రత్యర్థులు కత్తులతో దాడి చేసి హత్య చేశారు.
Visakha Crime : విశాఖ నగరంలో హత్యలు ఆగడంలేదు. ఆదివారం ఉదయం అల్లిపురం మెయిన్ రోడ్డులో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మృతి చెందిన వ్యక్తి గొంతిన శ్రీను(40)గా పోలీసులు గుర్తించారు. ఈ మధ్యకాలంలో విశాఖ నగరంలో వరుస హత్యలు జరుగుతున్నాయి. దీంతో నగరంలో ప్రజలు బయటికి రావాలంటేనే భయపడిపోతున్నారు. ఎందుకంటే తరుచుగా హత్యలు జరగడంతో ప్రజలు ఎటువైపు నుంచి ఎవరు దాడులు చేస్తారో అని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇటీవల పెందుర్తి ప్రాంతంలో సైకో కిల్లర్ బారిన పడి సుమారు అయిదురు ప్రాణాలు విడిచిన విషయం నగరవాసులు తెలిసిన విషయమే. అది జరిగిన కొద్ది రోజుల్లోనే ఉషోదయ జంక్షన్ వద్ద అనుపమ బార్ అండ్ రెస్టారెంట్ ఎదుట రౌడీషీటర్ అనిల్ ను ప్రత్యర్థులు పట్టపగలు అందరు చూస్తుండగా హత్య చేయడాన్ని ప్రజలు ఇంకా మర్చిపోకముందే ఇవాళ అల్లిపురంలో పెయింటర్ శ్రీనును అందరు చూస్తుండగానే ప్రత్యర్థులు కత్తులతో దాడి చేసి హత్య చేశారు. దీంతో ప్రశాంతమైన నగరంలో ఇటువంటి దాడులు జరగడం అటు పోలీసులను ఇటు ప్రజలను కలవరపెడుతున్నాయి. వరుస హత్య ఘటనలు పట్ల పోలీసులు చర్యలు తీసుకోని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
విశాఖలో వరుస హత్యలు
విశాఖ నగరంలో జరుగుతున్న వరుస హత్యలు, నేరాలు ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. నిన్న గాక మొన్న వరుసగా అయిదు హత్యలు చేసిన సైకో కిల్లర్ ను అరెస్ట్ చేశారని ఊపిరి పీల్చుకునేలోపే ఎంవీపీ కాలనీలో జరిగిన అనిల్ కుమార్ అనే రౌడీ షీటర్ హత్య తీవ్ర సంచలనం సృష్టించింది. కాకినాడలో 2017 లో జరిగిన ఓ హత్య కేసులో నిందితుడుగా ఉన్న అనిల్ కుమార్ తనకు ముప్పు ఉంటుందన్న భయం తో వైజాగ్ కు వచ్చేశాడు. ఇక్కడే కార్ డ్రైవర్ గా బతుకుతున్న అనిల్ గత ఐదేళ్లుగా ఎలాంటి నేరాలకు పాల్పడలేదు. ప్రేమించి పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలతో జీవిస్తున్న తనను ఎంవీపీ కాలనీలో దారుణంగా హత్య చేసారు.
కొంపముంచుతున్న సెటిల్‌మెంట్స్
ఇటీవల లోకల్ గా జరుగుతున్న చిన్న చిన్న సెటిల్ మెంట్‌లలో తలదూర్చడం.. ఈ క్రమంలో ఆదర్శ్ నగర్ లో ప్రవేట్ బస్సు నడుపుకునే శ్యామ్ ప్రకాష్ తో ఏర్పడిన ఆధిపత్య గొడవల్లో భాగంగా శ్యామ్ ప్రసాద్ మరో ఇద్దరితో కలిసి అనిల్ కుమార్‌ను హత్య చేసినట్టు పోలీసులు తెలిపారు. అంతకుముందు సైకో కిల్లర్ పెందుర్తి ఏరియాలో సృష్టించిన హత్యల కలకలం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే ఒక్క సైకో కిల్లర్ ఇష్యు పక్కనబెడితే అంతకు ముందు .. ఆ తరువాత జరిగిన హత్యల్లో పాత నేరస్తులూ.. లేదా రౌడీ షీటర్ల ప్రమేయం ఎక్కువగా ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు.
కౌన్సెలింగ్ ఇస్తున్నా మార్పు అంతంతే
రౌడీ షీటర్లను క్రమం తప్పకుండా పిలిపించి పోలీసులు కౌన్సెలింగ్ ఇస్తున్నా వారు మారడం లేదని వరుసగా జరుగుతున్న సంఘటనలు నిరూపిస్తున్నాయి. విశాఖలో దాదాపు 600 మందివరకూ రౌడీ షీటర్లు ఉన్నట్టు పోలీస్ రికార్డులు చెబుతున్నాయి. ఇలాంటి వారి కదలికలు, వ్యవహార శైలిపై ఎప్పటికప్పుడు పోలీస్ నిఘా ఉంటుంది . ఉన్నతాధికారులు ఎప్పటికప్పడు నివేదికలు వెళుతూనే ఉంటాయి. అయితే విశాఖలో జరుగుతున్న వరుస సంఘటనలు నిజంగా గ్రౌండ్ లెవెల్ లో రౌడీ షీటర్ల కదలికలు పైస్థాయి అధికారుల వరకూ వెళుతున్నాయా లేదా అన్న ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. మరికొందరు నేరగాళ్లు పొలిటీషియన్స్ అనుచరులుగా చెప్పుకుంటూ తిరుగుతున్నారనీ.. ఆ పేరుతొ చోటా మోటా సెటిల్ మెంట్‌లకు దిగుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. వీళ్లు చేసే పనులు సిటీ ఇమేజ్ ను గత కొంతకాలంగా దెబ్బతీస్తూ.. ప్రశాంతమైన నగరంగా ఉన్న వైజాగ్ ను ఇప్పడు క్రైమ్ సిటీగా మార్చేస్తున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.
Also Read : Hyderabad Murder: భగ్గుమన్న పాత కక్షలు - కత్తుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన యువకుడు
Also Read : Hyderabad: పక్క రూంలో అరిచిన పిల్లి, తక్షణం దాని ఓనర్ హత్య - విచారణలో షాకింగ్ ట్విస్ట్!