Hyderabad: పక్క రూంలో అరిచిన పిల్లి, తక్షణం దాని ఓనర్ హత్య - విచారణలో షాకింగ్ ట్విస్ట్!
పిల్లి పదే పదే అరుస్తుండటంతో పక్క గదిలోనే ఉన్న హరీశ్వర్ రెడ్డితోపాటు సదరు బాలుడు వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. పిల్లిని బయట వదిలేయాలని తెగేసి చెప్పారు.
కొన్ని సార్లు నేరాలు మరీ చిన్న కారణాలకే జరుగుతుంటాయి. డబ్బుల దగ్గరో, అభిప్రాయ బేధాలు తలెత్తడం వల్లో ప్రాణాలు తీసుకున్న ఘటనలు గతంలో ఎన్నో వెలుగులోకి వచ్చాయి. తాజాగా అంతకన్నా సిల్లీ కారణంతో జరిగిన హత్య విస్మయం కలిగిస్తోంది. ఇంట్లో పెంచుకుంటున్న పిల్లి అరుస్తుందని, అది అరవడం వల్ల తనకు నిద్రా భంగం కలిగిందనే కారణంతో ఆ పిల్లిని పెంచుకుంటున్న యజమానిని అంతం చేశాడు. ఈ ఘటన హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
హైదరాబాద్ లోని బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10లోని మిథిలా నగర్‌లో డాక్టర్ మీనన్ నివాసం ఉంటున్నారు. ఆయన ఇంట్లో రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం నల్లాపూర్‌కు చెందిన ఓ బాలుడు(17)తోపాటు హరీశ్వర్ రెడ్డి అలియాస్ చింటూ అనే 20 ఏళ్ల వ్యక్తి అద్దెకు ఉంటున్నారు. అసోంకు చెందిన ఎజాజ్ హుస్సేన్ అనే 20 ఏళ్ల యువకుడు, బ్రాన్ స్టిల్లింగ్ అనే 20 వ్యక్తి కూడా ఇదే భవనంలోని మరో గదిలో అద్దెకు ఉంటున్నారు. వీరు సెక్యూరిటీ గార్డులుగా పని చేస్తున్నారు. ఈ నెల 20న రాత్రి ఎజాజ్, బ్రాన్ ఇద్దరూ డ్యూటీ అయిపోయాక దారిలో పిల్లి కనిపించగా, దాన్ని తీసుకొని గదికి తెచ్చుకున్నారు. దీంతో అది గదిలో అరవడం మొదలుపెట్టింది.
ఇంటికి వెళ్లిన తర్వాత పిల్లి పదే పదే అరుస్తుండటంతో పక్క గదిలోనే ఉన్న హరీశ్వర్ రెడ్డితోపాటు సదరు బాలుడు వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. పిల్లిని బయట వదిలేయాలని తెగేసి చెప్పారు. అయినా వారు వినలేదు. ఆ తర్వాత కూడా పిల్లి అరుస్తూ ఉంది. ఫలితంగా హరీశ్వర్ రెడ్డికి నిద్రాభంగం అవుతుండడంతో మద్యం మత్తులో ఉన్న బాలుడు కోపంగా ఎజాజ్ హుస్సేన్ ఉన్న గదికి వెళ్లాడు. అక్కడే ఉన్న బాటిల్లోని పెట్రోల్‌ను ఆయనపై పోసి నిప్పంటించాడు. స్థానికులు వెంటనే స్పందించి తీవ్ర గాయాలపాలైన ఎజాజ్‌ను వెంటనే ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ కొద్ది సేపు అతను చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందాడు.
తప్పుడు ఫిర్యాదు
అయితే ఎజాజ్ హుస్సేన్ ఇంట్లో వంట చేస్తుండగా, ప్రమాదవ శాత్తు మంటలు అంటుకొని చనిపోయాడంటూ మొదట ఆ బాలుడితోపాటు హరీశ్వర్ రెడ్డి పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేశారు. అనంతరం మృతుడి స్నేహితుడు బ్రాన్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసును మళ్లీ విచారణ చేసిన పోలీసులు బాలుడితోపాటు హరీశ్వర్ రెడ్డిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.