Nellore Crime: చెన్నైలో చోరీలు ఆంధ్రాలో అమ్మకాలు... సగం ధరకే బ్రాండెడ్ సెల్ ఫోన్లు
లెటెస్ట్ ఫీచర్స్ ఉన్న బ్రాండెడ్ మొబైల్ సగం ధరకే. మీ ఊర్లో మీ ఇంటి వద్దే అమ్ముతారు. నిజంగా ఇది నిజమే. ఇదేదో ఓ కంపెనీ యాడ్ కాదు. ఓ దొంగ ముఠా బిజినెస్.చెన్నైలో మొబైల్స్ కొట్టేసి ఏపీలో అమ్మేస్తున్నారు.
నెల్లూరు జిల్లాలో ఇటీవల ఓ ముఠా గ్రామాల్లో తిరుగుతూ ఛీప్ గా సెల్ ఫోన్లు విక్రయిస్తోంది. 10 వేల రూపాయల విలువ చేసే కొత్త ఫోన్ కేవలం రూ.5 వేలకే ఇచ్చేస్తున్నారు. బిల్లు అడిగితే మాత్రం ఏవో కారణాలు చెప్తున్నారు. కొద్ది రోజులుగా ఈ ముఠా గుట్టు చప్పుడు కాకుండా గూడూరు ప్రాంతంలోని గ్రామాల్లో ఈ బిజినెస్ చేస్తోంది. దొంగ ఫోన్లు అని తెలిసినా కూడా కొంతమంది తక్కువ రేటుకి వచ్చేస్తున్నాయని కొంటున్నారు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన నలుగురు వ్యక్తులు దొంగిలించిన సెల్ ఫోన్లను నెల్లూరు జిల్లాలో అమ్ముతున్నారు. వీరిలో ఇద్దరు దొంగలను పోలీసులు పట్టుకున్నారు.
Also Read: షోరూంలో షాకింగ్ ఘటన... డ్రెస్సింగ్ రూంలో దుస్తులు మార్చుకుంటున్న యువతి... వీడియో తీసిన యువకులు
చెన్నైలో దొంగతనాలు ఏపీలో అమ్మకాలు
కొన్ని రోజులుగా జిల్లాలో సెల్ ఫోన్ విక్రయ ముఠాపై ఫిర్యాదులు రావడంతో పోలీసులు నిఘా పెట్టారు. గూడురులో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరూ పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడుకి చెందిన మేకల కృష్ణ, మేకల పవన్ గా గుర్తించారు. వారి వద్ద నుంచి 228 స్మార్ట్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయంపై పోలీసులు ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. రద్దీగా ఉండే ప్రాంతాల్లో సెల్ ఫోన్లు కొట్టేయడం వీరి పని. ఏపీలో కొట్టేసి, ఏపీలోనే అమ్మేస్తే అనుమానం వస్తుందని, చెన్నైలో సెల్ ఫోన్లు కొట్టేయడం పనిగా పెట్టుకున్నారు. చెన్నైలోని రద్దీ ప్రాంతాల్లో ఫోన్లు దొంగిలించి ఏపీలో అమ్ముతున్నారు. కొట్టేసిన ఫోన్లను ఫార్మెట్ చేసి, కొత్త ఫోన్లలా పల్లెటూళ్లలో సగం రేటుకే అమ్మేస్తున్నారు.
Also Read: ప్రయాణికుల లగేజీలతో ప్రైవేట్ బస్సు డ్రైవర్ పరారీ... దిక్కు తోచని స్థితిలో వలస కూలీలు
మరో ఇద్దరి కోసం గాలింపు
పల్లెటూళ్లలో కూడా స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరిగిపోయింది. అందులోనూ సగం రేటుకే ఫోన్లు వస్తున్నారని చాలామంది కొనుక్కుంటున్నారు. డిమాండ్ ఎక్కువగా ఉండటంతో ఈ ముఠా తమ బిజినెస్ ని విస్తరిస్తుంది. మొత్తం నలుగురు సభ్యుల ముఠా దొంగ సెల్ ఫోన్లను విక్రయిస్తోంది. గూడూరు పోలీసులు చాకచక్యంగా వీరిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులు మేకల కృష్ణపై కృష్ణా జిల్లా నూజివీడు పోలీస్ స్టేషన్లో ఇప్పటికే 15 కేసులు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. పరారీలో ఉన్న మరో ఇద్దర్ని కూడా అరెస్ట్ చేస్తామని చెప్పారు. వీరి వద్దనుంచి స్వాధీనం చేసుకున్న 228 స్మార్ట్ ఫోన్ల ఖరీదు రూ.23,63,700గా నిర్థారించారు. తక్కువ రేట్లకు ఫోన్లు అమ్ముతామని ఎవరైనా గ్రామాల్లోకి వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని నెల్లూరు జిల్లా ఎస్పీ విజయరావు తెలిపారు.
Also Read: చనిపోయాడని సాయంత్రం అంత్యక్రియలు చేశారు.. రాత్రికి తిరిగి వచ్చాడు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి