Hyderabad Crime News: కవల పిల్లలను చంపి, బిల్డింగ్ మీద నుంచి దూకిన తల్లి - హైదరాబాద్‌లో విషాదం
Balanagar Crime News | కుటుంబంలో గొడవలు జరగడంతో మనస్తాపానికి లోనైన ఓ మహిళ తన ఇద్దరు కవల పిల్లలను చంపి, అనంతరం బిల్డింగ్ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.

Hyderabad Crime News | హైదరాబాద్: బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది.కుటుంబ కలహాల కారణంగా ఓ తల్లి తన ఇద్దరు కవల పిల్లలను హత్య చేసి, అనంతరం బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. చనిపోయిన మహిళను చల్లారి సాయిలక్ష్మీ (27)గా గుర్తించారు.
కుటుంబంలో గొడవలతో దారుణం
సాయిలక్ష్మీ తన భర్త అనిల్ కుమార్‌తో కలిసి బాలానగర్ పద్మారావునగర్ ఫేజ్ 1లో నివాసం ఉంటున్నారు. ఈ దంపతులకు సంతానం రెండు సంవత్సరాల కవల పిల్లలు చేతన్ కార్తికేయ, లాస్యత వల్లి ఉన్నారు. గత కొన్నిరోజులుగా కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. కుటుంబ కలహాలతో సాయిలక్ష్మీ తీవ్ర మనోవేదనకు గురైంది. ఈ క్రమంలో తాను ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది. ముందుగా ఆమె తన కవల పిల్లలను గొంతు పిసికి చంపి, ఆ తర్వాత బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై బాలానగర్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
మన సామాజంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడికి, కుటుంబ కలహాల తీవ్రతకు ఈ సంఘటన ఉదాహరణగా నిలుస్తోంది. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలతో ప్రాణాలు పోతాయి. కుటుంబసభ్యులకు వారి లేని లోటు తీర్చలేనిది. ఇంట్లో ఎవరైనా డిప్రెషన్, మానసిక సమస్యలతో బాధపడుతుంటే వారితో మాట్లాడాలి. ఇబ్బందుల్లో ఉన్నవారిని గుర్తించడానికి, వారితో మాట్లాడేందుకు కుటుంబసభ్యులు చొరవ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆత్మహత్య కేసులు పెరిగిపోతున్నాయని మానసిక నిపుణులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.






















