Crime News: అల్లుడితో వివాహేతర సంబంధం, కూతురిపై రోకలిబండతో దాడి చేసిన తల్లి! తిరుపతిలో దారుణం
Tirupati Crime News | అల్లుడితో వివాహేతర సంబంధం పెట్టుకున్న అత్త తన కూతురిపై హత్యాయత్నం చేసింది. వీరి పెళ్లిని అడ్డుకున్నందుకు కూతురిపై రోకలిబండతో దాడి చేసిన ఘటన తిరుపతి జిల్లాలో జరిగింది.

Tirupati News | తిరుపతి: వివాహేతర సంబంధాలు బయటి వ్యక్తులనే కాదు, కుటుంబసభ్యులను చంపేలా చేస్తున్నాయి. కడుపున పుట్టిన వారైనా సరే హత్య చేయడానికి వెనుకాడటం లేదు. తిరుపతి జిల్లాలో అమానుషఘటన చోటుచేసుకుంది. ఓ తల్లి తన కూతురి భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకుని, అతడితో పెళ్లికి సిద్ధమైంది. పెళ్లిని అడ్డుకునేందుకు కూతురు ప్రయత్నించగా.. ఆమెపై తీవ్రంగా దాడి చేసింది. తిరుపతి జిల్లాలోని కేవీబీపురం మండలంలో ఈ దారుణం జరిగింది.
బాలికతో యువకుడి ప్రేమ వివాహం..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేవీబీపురం మండలంలోని ఓ గ్రామానికి చెందిన 18 ఏళ్ల యువకుడు, మైనర్ బాలిక (15)ను కొన్ని నెలల కిందట వివాహం చేసుకున్నాడు. భర్త చనిపోవడంతో కొన్ని రోజుల కిందట నుంచే తల్లి బాలిక వద్దే ఉంటోంది. ఈ క్రమంలో అత్త.. తన అల్లుడిని లొంగదీసుకుంది. కుమార్తె జీవితం ఏమైపోతుందన్న సోయి కూడా లేకుండా యువకుడైన అల్లుడితో వివాహేతర సంబందం పెట్టుకుంది.
తన తల్లి, భర్త మధ్య బంధం గురించి తెలిసి బాలిక వారిని తప్పు అని వారించినా పట్టించుకోలేదు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి తన భర్త, తల్లి వివాహం చేసుకోవాలని చూశారు. ఇంట్లో తాను పక్కన ఉండగానే తన తల్లి మెడలో భర్త తాళి కట్టేందుకు ప్రయత్నించాడు. ఇదంతా గమనిస్తున్న బాలిక కోపంతో ఈ పెళ్లిని అడ్డుకునే ప్రయత్నం చేసింది. తనకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించింది. దాంతో ఆవేశంతో రెచ్చిపోయిన తల్లితో పాటు భర్త కూడా బాలికపై దాడికి పాల్పడ్డారు. తల్లి అయితే రోకలి బండతో కొట్టడంతో బాలిక గట్టిగా కేకలు వేసింది. ఆమె అరుపులు విన్న స్థానికులు వచ్చి బాలికను రక్షించారు.
సభ్య సమాజం తలదించుకునే విధంగా వివాహేతర సంబంధం పెట్టుకోవడమే కాకుండా పెళ్లి చేసుకునేందుకు యత్నించిన అత్త, అల్లుడ్ని స్థానికులు చితకబాది పోలీసులకు అప్పగించారు. మైనర్ బాలికను పెళ్లి చేసుకున్నందుకు పోక్సో కేసు నమోదు చేశారు. బాలికను హత్య చేయాలని చూడటంతో వారిద్దరి మీద హత్యాయత్నం కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.






















