Crime News: ప్రేమ పేరుతో కానిస్టేబుల్ మోసం, అనుమానాస్పద స్థితిలో యువతి మృతి
Jogulamba gadwal Crime News | ప్రేమ పేరుతో కానిస్టేబుల్ మోసం చేశాడని న్యాయం కోసం పోరాటం చేస్తున్న యువతి అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. గట్టు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Love Affair ends as tragedy | గట్టు: ప్రేమించి మోసపోయానని, తనకు న్యాయం జరగదని భావించి ఓ యువతి అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. కోచింగ్ సెంటర్లో పరిచయం ప్రేమగా మారింది. ఈ క్రమంలో వారు మరింత దగ్గరయ్యారు. అతడికి కానిస్టేబుల్ జాబ్ రావడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. పెళ్లి పేరు ఎత్తితే ప్రియుడు తనను దూరం పెడుతున్నాడని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. అయితే ఇది ముమ్మాటికీ హత్యేనని, తన కూతుర్ని ప్రియుడి కుటుంబసభ్యులే హత్య చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అసలేం జరిగిందంటే..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన యువతి ప్రియాంక, గద్వాల జిల్లా గట్టు మండలం చిన్నోనిపల్లె గ్రామానికి చెందిన రఘునాథ్ గౌడ్ కొన్నేళ్ళ కిందట హైదరాబాద్‌లోని ఓ కోచింగ్ సెంటర్‌లో క్లాసులకు వెళ్తున్న సమయంలో పరిచయమైంది. ఆ పరిచయం ప్రేమగా మారింది. ఆమెను పెళ్లిచేసుకుంటానని రఘునాత్ ఆమెను నమ్మించాడు. ఈ క్రమంలో పోలీస్ కానిస్టేబుల్ జాబ్ కొట్టాడు. గద్వాల జిల్లా మల్దకల్ లో కానిస్టేబుల్ గా చేరాక ప్రియాంకను దూరం పెడుతూ వస్తున్నాడు. పెళ్లి చేసుకుందామని అడిగితే అతడు మరింత దూరం పెట్టడాన్ని జీర్ణించుకోలేకపోయింది. దాంతో కొన్ని రోజుల కిందట రఘునాథ్ గౌడ్ ఇంటి ముందు నిరసనకు దిగింది. జులై 17న తనకు న్యాయం చేయాలంటూ గట్టు పీఎస్ లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి కానిస్టేబుల్ రఘునాథ్ ను రిమాండ్ కు తరలించారు. కానిస్టేబుట్ రఘునాథ్ గౌడ్‌ను గద్వాల ఎస్పీ ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు.
ప్రియుడి ఇంట్లోనే ఉంటూ న్యాయ పోరాటం..
ఆత్మహత్యాయత్నం తరువాత ప్రియాంక చిన్నోనిపల్లిలో తన ప్రియుడు రఘునాథ్ గౌడ్ ఇంట్లోనే ఉంటుంది. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. రఘునాథ్ ఫ్యామిలీ నుంచి అవమానాలు ఎదురైనా ధైర్యంగా తట్టుకుని నిలబడింది. గ్రామస్తులు ఎవరైనా ప్రియాంకకు ఆహారం పెడితే వారిని దూషించేవారు. దసరాకు ఇంటికి రావాలని ప్రియాంకకు ఫోన్ చేయగా.. జైలు నుంచి రఘునాథ్ వచ్చాడని కలిసి వస్తానని చెప్పిందన్నారు తండ్రి. రఘునాథ్ ను కలిసి వచ్చిన తరువాత అతడి కుటుంబసభ్యులు శుక్రవారం రాత్రి పవర్ సప్లై ఆఫ్ చేసి ఆమెతో బలవంతంగా పురుగుల మందు తాగించారని ప్రియాంక తండ్రి ఆరోపించారు.
శనివారం ఉదయం గద్వాలలో ఆసుపత్రికి తన కుమార్తెను తరలించారు. ఆమె ఆత్మహత్య చేసుకోలేదు. పురుగుల మందు తాపి హత్య చేశారని ప్రియాంక తండ్రి ఆరోపించారు. ప్రియాంక మృతితో పోలీస్ శాఖ చర్యలు చేపట్టింది. రఘునాథ్ ను విధుల నుంచి డిస్మిస్ చేస్తూ ఎస్పీ శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రియాంక తండ్రి ఫిర్యాదు మేరకు రఘునాథ్ తో పాు 22 మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీకేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసుల అదుపులో ఉన్న రఘునాథ్ గౌడ్ ను ప్రశ్నిస్తున్నారు.






















