Crime News: తెలుగు రాష్ట్రాల్లో దారుణాలు - తల్లిదండ్రుల మధ్య నిద్రిస్తున్న పాపను ఎత్తుకెళ్లి అత్యాచారం, హైదరాబాద్‌లో మరో అఘాయిత్యం
Andhrapradesh News: ఏలూరు జిల్లా నూజివీడు మండలంలో తల్లిదండ్రుల మధ్య నిద్రిస్తున్న బాలికను ఎత్తుకెళ్లిన దుండగుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. అటు, హైదరాబాద్‌లో ఓ మహిళపై తోటి ఉద్యోగి అఘాయిత్యానికి ఒడిగట్టాడు.
Minor Abused In Nuzividu: తెలుగు రాష్ట్రాల్లో దారుణాలు చోటు చేసుకున్నాయి. ఏపీలోని ఏలూరు (Eluru District) జిల్లాలో తల్లిదండ్రుల మధ్య రాత్రి నిద్రిస్తోన్న బాలికను ఎత్తుకెళ్లిన నిందితుడు అత్యాచారానికి పాల్పడ్డారు. అటు, రాజధాని హైదరాబాద్‌లోనూ (Hyderabad) ఏపీకి చెందిన ఓ మహిళను ఇంట్లో బంధించిన తోటి ఉద్యోగి అత్యాచారం చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని ఏలూరు జిల్లా నూజివీడు (Nuzividu) మండలంలో తల్లిదండ్రుల మధ్య నిద్రిస్తోన్న ఓ ఐదేళ్ల చిన్నారిని గుర్తు తెలియని వ్యక్తి ఆదివారం అర్ధరాత్రి ఎత్తుకెళ్లాడు. సమీపంలోని పామాయిల్ తోటలోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి ఒడిగట్టాడు. అనంతరం అక్కడే చిన్నారిని వదిలేసి పరారయ్యాడు. ఉదయం పాప కోసం వెతికిన కుటుంబ సభ్యులు తోటలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న చిన్నారిని గుర్తించి భయాందోళనకు గురయ్యారు. వెంటనే ఆమెను నూజివీడు ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. లైంగిక దాడి జరిగినట్లు వైద్యులు నిర్ధారించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో విజయవాడ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఘటనపై మంత్రి పార్థసారథి ఆగ్రహం
బాలికపై అత్యాచార ఘటనను రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి తీవ్రంగా ఖండించారు. నిందితుడిని వెంటనే అరెస్ట్ చేయాలని పోలీసులను ఆదేశించారు. బాలికకు వైద్య సహాయం అందించాలని అధికారులకు నిర్దేశించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని స్పష్టం చేశారు.
హైదరాబాద్‌లోనూ దారుణం
తెలంగాణలోని హైదరాబాద్‌లోనూ (Hyderabad) దారుణం జరిగింది. ఓ మహిళను రూమ్‌లో బంధించిన తోటి ఉద్యోగి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఏపీ అనంతపురం జిల్లాకు చెందిన ఓ మహిళ ఉద్యోగ రీత్యా నగరానికి వచ్చింది. అయితే సదరు మహిళకు ఉండటానికి రూమ్ లేకపోవడంతో ఇల్లు వెతకడంలో సాయం చేస్తానని సంతోష్ చైతన్య అనే తోటి ఉద్యోగి నమ్మించాడు. నగరంలో తనతో పాటు తల్లి, చెల్లి ఇంట్లో ఉంటారని నమ్మబలికాడు. ఇల్లు దొరికే వరకూ తన ఇంట్లో ఉండాలని చెప్పాడు. అతని మాటలు నమ్మిన మహిళ ఇంటికి వెళ్లేసరికి ఇంట్లో ఎవరూ లేకపోవడాన్ని గమనించింది.
ఇదే విషయమై సంతోష్ చైతన్యను ప్రశ్నించగా మహిళను బంధించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె గొడవ చేయగా పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. కొన్ని రోజుల తర్వాత ఆమెను బయట వదిలిపెట్టాడు. అనంతరం బాధిత మహిళ ఎన్నిసార్లు కాల్ చేసినా సంతోష్ ఫోన్ స్విచ్చాఫ్ వచ్చింది. మోసపోయినట్లు గ్రహించిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించి సదరు వ్యక్తిపై ఫిర్యాదు చేసింది. పోలీసులు దీనిపై విచారిస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read: Crime News: బంగారం చోరీ కేసు, దళిత మహిళపై పోలీసులు థర్డ్ డిగ్రీ - విచారణకు ఉన్నతాధికారుల ఆదేశం