Dog Attack: ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారిపై దాడి చేసిన కుక్క, పరిస్థితి విషమం
Dog Attack: మీరట్‌లో ఓ ఇంటి బయట ఆడుకుంటున్న 9 ఏళ్ల చిన్నారిపై కుక్క దాడి చేసింది.
Dog Attack in Meerut:
మీరట్‌లో ఘటన..
చిన్నారులపై కుక్కల దాడులు ఆగడం లేదు. హైదరాబాద్‌లో కుక్కల దాడితో నాలుగేళ్ల చిన్నారి మృతి చెందడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అప్పటి నుంచి వరసగా ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. యూపీలోని మీరట్‌లో ఓ 9 ఏళ్ల బాలుడిపై కుక్కలు దాడి చేశాయి. ఈ ఘటనలో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. ముఖం, కడుపు, తొడల భాగంలో గాయాలయ్యాయి. ప్రాణాపాయం తప్పినప్పటికీ గాయాలు మానేందుకు చాలా సమయం పట్టేలా ఉందని వైద్యులు వెల్లడించారు. మీరట్‌లోని నర్హేదా గ్రామంలో ఈ దాడి జరిగింది. మధ్యాహ్నం పూట ఇంటి బయట ఆడుకుంటున్న బాలుడిపై పిట్‌బుల్ డాగ్ అటాక్ చేసింది. ఒక్కసారిగా అరవడం వల్ల చుట్టు పక్కల వాళ్లంతా అలెర్ట్ అయి బయటకు వచ్చారు. కుక్కను తరిమి..బాలుడిని కాపాడారు. వెంటనే స్థానిక ఆసుపత్రికి బాలుడిని తరలించారు. అయితే...పరిస్థితి విషమించడం వల్ల ఢిల్లీలోని హాస్పిటల్‌కి తరలించాలని సూచించారు వైద్యులు. ఆ మేరకు ఢిల్లీ ఆసుపత్రికి తరలించి చికిత్స చేశారు. ఇటీవలే డిశ్చార్జ్ కూడా అయ్యాడు. బాధితుడి తండ్రి ఈ ఘటనపై స్పందించారు. అధికారులకు ఇప్పటికే దీనిపై ఫిర్యాదు చేశామని చెప్పారు. దాడి చేసిన కుక్కని గ్రామస్థులంతా కలిసి వెంబడించారు. పట్టుకుని ఓ గదిలో బంధించారు.
"మా అబ్బాయి రోడ్డుపై ఆడుకుంటున్నాడు. ఆ సమయంలోనే కుక్క వచ్చి ఉన్నట్టుండి దాడి చేసింది. అది పిట్‌బుల్ డాగ్. తీవ్ర గాయాలయ్యాయి. ఢిల్లీలోని హాస్పిటల్‌కి తీసుకెళ్లి చికిత్స అందించాం. ఆ తరవాత పరిస్థితి నార్మల్‌కి వచ్చింది. ఇప్పుడు ఇంటికి తీసుకొచ్చాం. అయినా...ఇంకా విషమంగానే ఉంది. అధికారులకు ఈ ఘటనపై ఫిర్యాదు చేశాం"
- బాధితుడి తండ్రి
పిట్‌బుల్‌పై బ్యాన్..
ఈ మధ్య కాలంలో కుక్కలు దాడులు చేసి తీవ్రంగా గాయపరుస్తున్న ఘటనలు చాలానే జరుగుతున్నాయి. యూపీలోనే వరుసగా రెండు మూడు సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. అప్పుడే..."పిట్‌బుల్" (Pitbull) జాతి కుక్కల్ని నిషేధించాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. కొన్ని రోజులు ఈ హడావుడి చేసినా...తరవాత ఈ అంశం సద్దుమణిగింది. అయితే...యూపీలోని ఘజియాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మాత్రం దీన్ని సీరియస్‌గా తీసుకుంది. పిట్‌బుల్, రాట్‌వీలర్, డాగో అర్జెంటీనో జాతులకు చెందిన కుక్కల్ని పెంచుకోవడాన్ని నిషేధించింది. ఇక మిగతా శునకాలు పెంచుకోవాలంటే తప్పనిసరిగా ప్రభుత్వం నుంచి లైసెన్స్ తీసుకోవాలని తేల్చిచెప్పింది. నవంబర్ 1వ తేదీ నుంచి లైసెన్స్‌లు జారీ చేయనున్నట్టు తెలిపింది. మరో రూల్ ఏంటంటే...ఒకటి కన్నా ఎక్కువ కుక్కల్నీ పెంచుకోకూడదు. కాంప్లెక్స్‌లలో నివసించే వాళ్లు తమ కుక్కల్ని సర్వీస్ లిఫ్ట్‌లో తీసుకురావాలని, అలా బయటకు తీసుకొచ్చిన సమయంలో వాటి మూతికి తప్పనిసరిగా ముట్టెలు(నోరు తెరవకుండా కట్టేయటం) పెట్టాలని ఆదేశించింది. Pit Bull, Rottweiler,Dogo Argentino కుక్కలున్న వాళ్లకు మాత్రం లైసెన్స్ ఇవ్వరు. ఇకపైన ఎవరు కొనుగోలు చేసినా...దాడులు జరిగినా యజమానులదే పూర్తి బాధ్యత. ఇప్పటికే ఈ కుక్కలున్న వాళ్లు రెండు నెలల్లోగా వాటికి "సంతాన నియంత్రణ" ఆపరేషన్ చేయించాలని తేల్చి చెప్పారు.
Also Read: Watch Video: క్యాన్సర్‌తో పోరాటం చేసి గెలిచిన శునకం, మళ్లీ డ్యూటీలోకి కూడా దిగింది