Medchal Crime : దూలపల్లిలో యువకుడు దారుణ హత్య, ప్రేమ వివాహంపై కత్తిదూసిన అన్న!
Medchal Crime : మేడ్చల్ జిల్లా దూలపల్లిలో ఇటీవల ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ప్రేమ పేరుతో తన చెల్లిని తీసుకెళ్లాడన్న కోపంతో యువతి అన్న ఈ దారుణానికి పాల్పడ్డాడు.
Medchal Crime : మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో దూలపల్లిలోని హనుమాన్ టెంపుల్ వద్ద ఇటీవల గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ హత్యను కేసును పోలీసులు ఛేదించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... అయితే ప్రేమ పేరుతో తన చెల్లిని తీసుకెళ్లిపోయాడని కోపం పెంచుకున్న ఓ అన్న తన స్నేహితులతో కలసి యువకుడిని దారుణంగా హత్య చేశాడు. అమీర్ పేట్ ఎల్లారెడ్డి గూడకు చెందిన హరీష్(28) కుటుంబం ఆరు నెలల క్రితం సూరారం కాలనీకి మకాం మార్చారు. ఓల్డ్ సిటీ కూల్సుంపురకు చెందిన మెత్తర్ అనే యువతిని పది రోజుల క్రితం ప్రేమ పేరుతో ఇంట్లోంచి తీసుకువచ్చిన హరీశ్ దూలపల్లిలో మకాం పెట్టాడు.
ఐదుగురు అరెస్ట్
ఈ విషయం తెలుసుకున్న యువతి అన్న దీందయాల్ తన స్నేహితులతో కలిసి వచ్చి దూలపల్లిలో రెక్కి నిర్వహించాడు. బుధవారం హరీష్ ఉండే దూలపల్లి ప్రాంతంలో కాపు కాశాడు. ముందు యువతిని తన ఇంటికి పంపించేశారు. ఆ తరువాత యువతి అన్న అతని స్నేహితులతో కలిసి హరీష్ పై కత్తులతో దాడి చేశారు. ఛాతి, ముఖంపై దాడి చేసి చంపి పరారయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పేట్ బషీరాబాద్ పోలీసులు దర్యాప్తు చేసి హత్యలో పాల్గొన్న 5 మందిని అదుపులోకి తీసుకున్నారు.
అసలేం జరిగింది?
మేడ్చల్ జిల్లా దూలపల్లిలో యువకుడి దారుణ హత్యకు కులాంతర వివాహమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. హరీశ్ అనే యువకుడు కొన్ని నెలల క్రితం దూలపల్లిలో ఇల్లు కట్టుకొని తన తల్లితో నివాసం ఉంటున్నాడు. గతంలో అతను అమీర్ పేట్ ప్రాంతంలోని ఎల్లారెడ్డి గూడలో ఉండేవాడు. ఆ సమయంలో వేరే కులానికి చెందిన యువతిని లవ్ చేశాడు. ఈ విషయంలో యువతి తల్లిదండ్రులు హరీశ్‌ను హెచ్చరించారు. అయితే నివాసం మార్చినప్పటికీ యువతితో ప్రేమను కొనసాగించడమే కాకుండా కొంత కాలం తర్వాత యువతిని వివాహం చేసుకున్నాడు హరీశ్. రెండు రోజుల క్రితం యువతి అన్న తన స్నేహితులతో కలిసి వచ్చి హరీశ్ పై దాడి చేశాడు. ముందు గుర్తు తెలియని మృతదేహంగా కేసు నమోదు చేసిన పోలీసులు తాజాగా దూలపల్లికి చెందిన హరీశ్‌గా గుర్తించారు. కులాంతర వివాహం చేసుకున్నందుకే తన కుమారుడిని యువతి కుటుంబసభ్యులు హత్య చేశారని హరీశ్ తల్లి, అక్క ఆరోపిస్తున్నారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా యువతి కుటుంబసభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. హత్య జరిగిన తర్వాత యువతిని వారి వెంట తీసుకెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
బెంగళూరులో దారుణం
ఓ యువతిని ప్రేమోన్మాది దారుణంగా హత్య చేసిన ఘటన బెంగళూరు నగరం మురగేష్ పాళ్యలోని ఎన్‌ఏఎల్ రోడ్డులో చోటుచేసుకుంది. లీలా పవిత్ర (28) హత్యకు గురైన యువతి. నిందితుడు దినకర్ ఆమెను ఛాతీ, కడుపు, మెడపై దాదాపు 16కు పైగా కత్తిపోట్లతో దారుణంగా హత్య చేశాడు. లీలా పవిత్ర ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడకు చెందిన యువతి. ఆమె ఒమేగా మెడిసిన్ కంపెనీలో పనిచేస్తోంది. నిన్న (ఫిబ్రవరి 28) నిందితుడు ఈ హత్యకు పాల్పడ్డాడు. హత్యకు గురైన యువతి, నిందితుడు దినకర్ ఇద్దరూ ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారే అని అక్కడి పోలీసులు చెప్పారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. వీరిద్దరూ గత ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారని సమాచారం. అయితే వీరిద్దరి ప్రేమను అమ్మాయి ఇంట్లో తల్లిదండ్రులు వ్యతిరేకిస్తున్నారు. వేర్వేరు కులాల వారు కావడంతో ఇద్దరి ఇళ్లలోని తల్లిదండ్రులు వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో ఇంట్లో ఇష్టం లేని పెళ్లి చేసుకోలేనని ఆమె అతనికి చెప్పింది. గత రెండు నెలలుగా దినకర్ ను ఆమె దూరం పెడుతూ వచ్చింది. తర్వాత లీలా పవిత్రకు ఇంట్లో మరొకరితో వివాహం కుదిర్చారు. ఇది తెలిసిన నిందితుడు దినకర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కోపం పెంచుకొని ఆమెను చంపేశాడు. కంపెనీలో పని ముగించుకుని యువతి బయటకు రావడం కోసం నిందితుడు దినకర్ ఎదురు చూశాడు. యువతి బయటకు వస్తుండగా నిందితుడు ఆమెను కత్తితో 16కు పైగా పోట్లు పొడిచి దారుణంగా హత్య చేశాడు. తీవ్రంగా గాయాల పాలైన లీలాను అక్కడి వారు ఆస్పత్రికి తరలించగా ఆమె మధ్యలోనే చనిపోయిందని తెలిపారు. ఇంట్లో వద్దన్న తర్వాత పెళ్లికి యువతి ఒప్పుకోకపోవడంతోనే హత్య జరిగినట్లు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జీవన్ భీమానగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.