Hyderabad robbery: హైదరాబాద్‌లో వాస్తునిపుణుడి ఇంట్లో భారీ చోరీ-రూ.4కోట్లు, అరకిలో బంగారం లూటీ
హైదరాబాద్‌లో దొంగలు రెచ్చిపోయారు. మధురానగర్‌లోని వాస్తు నిపుణుడి ఇంటిని కొల్లగొట్టారు. 4 కోట్ల రూపాయల నగుదు, అరకిలో బంగారం దోచుకుని ఉడాయించారు. ఊరు వెళ్లి వచ్చేసరికి ఇళ్లంతా దోచేశారు.
అతనో వాస్తునిపుణుడు... ఇళ్లు కొనాలని ప్రయత్నిస్తున్నాడు. అందుకు కావాల్సిన డబ్బును సమకూర్చుకున్నాడు. బ్యాంకు లాకర్లలో దాచిన డబ్బు, నగలు అన్నీ... ఇంటికి తెచ్చుకున్నాడు. డబ్బుంతా పరుపుల కింద దాచుకున్నాడు. ఇదంతా గమనించారో ఏమో.... ఇళ్లంతా లూటీ చేసేశారు దొంగలు. పని మీదు ఊరు వెళ్లి వచ్చే సరికి సర్వం దోచేశారు. దాచుకున్న సంపాదనంతా దొంగల పాలు కావడంతో లబోదిబోమంటున్నారు వాస్తు నిపుణుడు. పోలీసులను ఆశ్రయించాడు.
హైదరాబాద్‌లోని మధురానగర్‌లో ఈ భారీ దోపిడీ జరిగింది. వాస్తుశాస్త్ర నిపుణుడు వీఎల్‌ఎన్ చౌదరి.. సారథి స్డూడియో వెనుక ఉన్న ఓ ఇంట్లోని పెంట్ హౌస్‌లో గత 25 ఏళ్లుగా అద్దెకు ఉంటున్నాడు. అయితే... ఇటీవల ఇంటి యజమాని అతడిని ఖాళీ చేయమని చెప్పాడు. దీంతో... సొంత ఇల్లు కొనాలని నిర్ణయించుకున్నాడు చౌదరి. ఇంటి కోసం వెతుకున్నాడు. అలాగే ఇన్నేళ్లు దాచుకున్న సంపాదన అంతా పోగు చేశారు. బ్యాంకులో ఉన్న 3 కోట్ల 93 లక్షల నగదు, 450 గ్రాముల బంగారం కడ్డీలను... తెచ్చుకుని అద్దె ఇంట్లోనే దాచుకున్నాడు. వాటిని... ఇంట్లోని పరుపు కింద మూడు సూటుకేసుల్లో దాచి పెట్టాడు. ఇదంతా గమనించారో ఏమో... అవకాశం కూడా కాపు కాశారు దొంగలు. అవకాశం రావడంతో... వాస్తు నిపుణుడి ఇంట్లోని సొమ్మంతా కాజేశారు.
ఈనెల 12న ఉదయం ఓ పని మీద ఊరు వెళ్లాడు వీఎల్‌ఎన్ చౌదరి. రాత్రి 11గంటల 45నిమిషాల సమయంలో ఇంటికి తిరిగివచ్చాడు. పెంట్‌హౌస్ తలుపులు తెరిచి ఉండటం చూసి షాకయ్యారు. ఇంటి మెట్లు, గోడలు కూడా దెబ్బతిని ఉండటాన్ని గమనించాడు. ఇంట్లోకి వెళ్లి చూడగా.. పరుపు కింద ఉన్న డబ్బు, బంగారం కనిపించలేదు. దీంతో కంగారు పడి... మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దొంగల కోసం గాలిస్తున్నారు.
రూ.3 కోట్ల 93 లక్షల నగదు, 450 గ్రాముల బంగారం దోచుకెళ్లారని వాస్తు నిపుణుడు వీఎల్‌ఎన్ చౌదరి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో పేర్కొన్నాడు. వాటితో పాటు ఇంట్లోని 3 లాప్‌టాప్‌లు, 3 సెల్‌ఫోన్లు, విలువైన డాక్యుమెంట్లు కూడా ఎత్తుకెళ్లినట్టు చెప్తున్నారు. బాధితుడి ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు మధురానగర్ పోలీసులు. బాగా తెలిసిన వారే ఈ దొంగతనానికి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. వాస్తు నిపుణుడు వీఎల్‌ఎన్ చౌదరి ఇంట్లో అంత డబ్బు ఉందని గ్రహించే ఈ దోపిడీకి పాల్పడి ఉండొచ్చన్నది పోలీసుల అభిప్రాయం. అతని ఊరు వెళ్లిన విషయం కూడా వారికి తెలిసి ఉంటుందని.. ఇంట్లో ఎవరూ లేని సమయం కూడా సాంతం కాజేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. చౌదరిని దగ్గరగా ఉండేవాళ్లు... అతన్ని గురించిన విషయాలన్నీ తెలిసవారో ఈ దోపిడీకి ప్లాన్ చేసి ఉండొచ్చని భావిస్తున్నారు. ఆ కోణంలోనే విచారణ చేపట్టారు.