Manipur Violence: మణిపూర్‌లో కాల్పుల మోత, అర్ధరాత్రి పలు చోట్ల విధ్వంసం - బీజేపీ ఆఫీస్‌పై దాడికి యత్నం
Manipur Violence: మణిపూర్‌లో అర్దరాత్రి మరోసారి హింసాత్మక ఘటనలు చెలరేగాయి.
Manipur Violence:
పలు చోట్ల ఉద్రిక్తతలు..
మణిపూర్‌లో మరోసారి ఆందోళనకారులు రెచ్చిపోయారు. బిష్ణుపూర్ జిల్లాలో పెద్ద ఎత్తున కాల్పులు జరిగాయి. ఆటోమెటిక్ వెపన్స్‌తో కాల్పులు జరిపారు. జూన్ 16 న అర్ధరాత్రి మొదలైన ఈ కాల్పులు..తెల్లవారుజాము వరకూ కొనసాగినట్టు పోలీసులు వెల్లడించారు. పెద్ద ఎత్తున నిరసనకారులు గుమిగూడి విధ్వంసం సృష్టించారు. పలు చోట్ల వాహనాలను ధ్వంసం చేశారు. ఇంఫాల్‌లో అర్ధరాత్రి వరకూ పోలీసులు, ఆర్మీ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ క్రమంలోనే ఆందోళనకారులు ఇళ్లకు నిప్పంటించేందుకు ప్రయత్నించారు. ఒకేసారి వెయ్యి మంది ఒక్క చోట చేరారు. ఈ లోగా రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (RAF) సిబ్బంది అప్రమత్తమై టియర్ గ్యాస్‌తో దాడి చేసింది. రబ్బర్ బులెట్స్ ప్రయోగించింది. ఈ దాడిలో ఇద్దరు పౌరులు గాయపడ్డారు. మణిపూర్ యూనివర్సిటీ వద్ద కూడా భారీ ఎత్తున అల్లర్లు జరిగాయి. రాత్రి 10.40 నిముషాలకు 200-300 మంది గుమిగూడి స్థాని ఎమ్మెల్యే ఇంటిని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. ఆర్ఏఎఫ్ బలగాలు నిరసనకారులపై దాడి చేయడం వల్ల అంతా చెల్లాచెదురయ్యారు. సింజెమాయ్‌లోని బీజేపీ ఆఫీస్‌పైనా దాడికి యత్నించారు. ఒకేసారి పలుచోట్ల ఉద్రిక్తతలు చెలరేగడం పోలీసులకు,భద్రతా బలగాలకు సవాలుగా మారింది. చాలా వరకూ దాడులను అడ్డుకున్నారు. అయినా...ఏదో ఓ చోట విధ్వంసం కొనసాగుతూనే ఉంది. స్వయంగా కేంద్రహోం మంత్రి అమిత్‌షా వచ్చి పరిస్థితులు చక్కదిద్దాలని చూసినా...ఇంకా అదుపులోకి రావడం లేదు. ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడుతూ ఆరా తీస్తున్నారు. బీజేపీ నేతల ఇళ్లపైనా దాడులు జరుగుతుండటం రాజకీయంగానూ వేడి పెంచుతోంది.
#WATCH | BJP's office in Manipur's Thongju was vandalised by a mob last night pic.twitter.com/JyGQnKMDsh
— ANI (@ANI) June 17, 2023
మణిపూర్‌లో పరిస్థితులు ఇంకా అదుపులోకి రాలేదు. ఏకంగా కేంద్రమంత్రి ఇంటిపైనే దాడి చేసే స్థాయికి ఆందోళనలు తీవ్రమయ్యాయి. ఒకేసారి వెయ్యి మంది నిరసనకారులు కేంద్రమంత్రి ఆర్కే రంజన్ సింగ్ ఇంటిపై దాడి చేసి నిప్పంటించారు. ఇంఫాల్‌లోని ఆయన ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. ఈ దాడి జరిగిన సమయంలో మంత్రి ఇంట్లో లేరు. ఇంఫాల్‌లో ఇప్పటికే కర్ఫ్యూ విధించినా... ఆందోళనకారులు లెక్క చేయకుండా పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చారు. నేరుగా మంత్రి ఇంటికి వెళ్లి దాడి చేశారు. ఆ సమయంలో అక్కడ 9 మంది భద్రతా సిబ్బంది, ఐదుగురు సెక్యూరిటీ గార్డ్లు, 8 మంది స్పెషల్ గార్డ్లు ఉన్నారు. ఒకేసారి వెయ్యి మంది దాడి చేయడం వల్ల భద్రతా సిబ్బంది ఏమీ చేయలేకపోయింది. దాడుల్లో భాగంగా పెట్రోల్ బాంబులు విసిరినట్టు సెక్యూరిటీ గార్డ్లు వెల్లడించారు.
"అంత మంది వచ్చే సరికి మాకేం చేయాలే అర్థం కాలేదు. వాళ్లను ఏ మాత్రం అడ్డుకోలేకపోయాం. అన్ని వైపుల నుంచి పెట్రోల్ బాంబులు విసిరారు. ఎంట్రెన్స్ గేట్ వద్ద పెద్ద ఎత్తున గుమిగూడారు. ఏమీ చేయలేక అలానే ఉండిపోయాం. దాదాపు 12 వందల మంది దాడి చేసి ఉంటారు.
- భద్రతా సిబ్బంది
Also Read: మసీదుని కూల్చేందుకు వచ్చిన అధికారులు, పోలీసులపై ముస్లింల రాళ్ల దాడి - ఒకరు మృతి