Mumbai: విడాకులు తీసుకున్న మహిళలే టార్గెట్, 20 పెళ్లిళ్లు చేసుకున్న నిత్య పెళ్లికొడుకు అరెస్ట్
Maharashtra :విడాకులు తీసుకున్న, భర్త చనిపోయిన మహిళలను లక్ష్యంగా చేసుకుని పెళ్లి పేరుతో నమ్మించి మోసానికి పాల్పడుతున్న ఓ నిత్య పెళ్లికొడుకును పోలీసులు అరెస్ట్ చేశారు.
Mumbai: కొంతమందికి ప్రయాణం అంటే ఇష్టం. మరికొందరికి తినడం తాగడం అంటే ఇష్టం. ఇంకొందరికి స్నేహం చేయడమంటే ఇష్టం.. కానీ ఓ వ్యక్తి మాత్రం వరుస పెళ్లిళ్లు చేసుకోవడంలో మక్కువ చూపాడు. ఎంతలా అంటే అదే వ్యసనంలా మార్చుకున్నాడు. ఎందుకంటే అతను ఒకరిద్దరు కాదు 20 మందికి పైగా అమ్మాయిలు, మహిళలను వివాహం చేసుకున్నాడు. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ఓ వింత ఘటన వెలుగు చూసింది. 20 మందికి పైగా మహిళలను పెళ్లి చేసుకుని మోసం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి విలువైన వస్తువులు కాజేశాడని బాధిత మహిళలు, పోలీసులు ఆరోపిస్తున్నారు.
బ్రహ్మచారినని చెప్పుకుని
43 ఏళ్ల తర్వాత కూడా తనుకు తాను బ్రహ్మాచారి అని, మరికొందరితో విడాకులు తీసుకున్నానని చెప్పుకునే వాడు. విడాకుల తీసుకున్న మహిళలనే టార్గెట్ గా చేసుకుని తన పెళ్లిళ్ల వ్యవహారం నడిపేవాడు. తన మాటలతో వలలో వేసుకుని ఆ మహిళల నుంచి విలువైన వస్తువులను కాజేసేవాడు. అలా వస్తువులను తీసుకుని అక్కడి నుంచి పరారయ్యేవాడు. నలసోపారాకు చెందిన ఓ మహిళ ఫిర్యాదు మేరకు ఎంబీవీవీ పోలీసులు విచారణ జరిపి థానే జిల్లాలోని కళ్యాణ్‌కు చెందిన నిందితుడు ఫిరోజ్ నియాజ్ షేక్‌ను జులై 23న అరెస్టు చేసినట్లు అధికారి తెలిపారు. నిందితుడు మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్‌లో ఆమెతో స్నేహం చేసి పెళ్లి చేసుకున్నాడని సీనియర్ ఇన్‌స్పెక్టర్ విజయ్‌సింగ్ భాగల్ తెలిపారు.
మ్యాట్రిమోనీ సైట్ తో మాయ
మ్యాట్రిమోనీ వెబ్‌సైట్ ద్వారా ఫిరోజ్ నియాజ్ షేక్ (43) అనే వ్యక్తి డివోర్స్ తీసుకున్న మహిళలే లక్ష్యంగా మోసాలకు పాల్పడ్డాడు. మాయమాటలతో వారిని నమ్మించి పెళ్లికి ఒప్పించేవాడు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ ఇలా దేశవ్యాప్తంగా 20 మందికి పైగా మహిళలను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి అనంతరం వారి వద్ద లక్షల రూపాయల నగదు, నగలు, విలువైన వస్తువులతో ఉడాయించే వాడు. అతడి చేతిలో మోసపోయిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది.
విలువైన వస్తువులతో పరార్
పెళ్లయిన కొద్దిరోజుల పాటు సజావుగా సాగిన తర్వాత ఫిరోజ్ మహిళ నుంచి నగదు, ల్యాప్‌టాప్, ఇతర విలువైన వస్తువులు తీసుకున్నాడు. 2023 అక్టోబర్, నవంబర్‌లో మహిళ నుంచి రూ.6.5 లక్షలు తీసుకున్నారు. మోసపోయినట్లు సమాచారం అందుకున్న మహిళ నిందితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు విచారణ జరిపి నిందితుడిని అదుపులోకి తీసుకుని అతడి నుంచి ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్, డెబిట్, క్రెడిట్ కార్డులు, చెక్ బుక్, కొన్ని నగలు స్వాధీనం చేసుకున్నారు.
2015నుంచి ఇదే పని
ఫిరోజ్ నియాజ్ షేక్‌ను విచారించగా పోలీసులకు పలు షాకింగ్ విషయాలు తెలిశాయి. షేక్ మ్యాట్రిమోనియల్ సైట్లలో విడాకులు తీసుకున్న వారిని, వితంతువులను టార్గెట్ చేసి పెళ్లి చేసుకుని వారి నుంచి విలువైన వస్తువులను స్వాహా చేసినట్టు విచారణలో తేలింది. 2015 నుంచి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, గుజరాత్ సహా దేశంలోని వివిధ ప్రాంతాల్లో 20 మందికి పైగా మహిళలను ఫిరోజ్ మోసం చేశాడు. ఇండియన్ పీనల్ కోడ్‌లోని సంబంధిత నిబంధనల ప్రకారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.