Mahabubabad: ఆలయంలో పెను విషాదం, కరెంట్ షాక్‌తో అక్కడికక్కడే ముగ్గురు వ్యక్తులు మృతి
Electric Shock in a Temple:మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలో విషాదం జరిగింది. దైవ కార్యం కోసం వెళ్లిన ముగ్గురు వ్యక్తులు విద్యుదాఘంతో మరణించడం గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది.
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం అందనాలపాడులో విషాదం జరిగింది. దైవ కార్యం కోసం వెళ్లిన ముగ్గురు వ్యక్తులు విద్యుదాఘంతో మరణించడం గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. సోమవారం అర్ధరాత్రి వర్షం కురవడంతో గుడి దగ్గర విద్యుత్ తీగల్లో కరెంట్ ప్రవహించింది. ఈ విషయం తెలియక కొందరు మైక్ సెట్ చేస్తుండగా అకస్మాత్తుగా కరెంట్ షాక్ వచ్చిందని సమాచారం. దాంతో స్థానిక ఆలయంలో మైక్ సెట్ చేస్తుండగా కరెంట్ షాక్ కొట్టడంతో ముగ్గురు మృతి చెందారు. మృతులను సుబ్బారావు, మస్తాన్‌రావు, వెంకయ్య లుగా గుర్తించారు.
దైవ కార్యానికి వెళ్తే ఇంత విషాదమా..
డోర్నకల్ మండలం అందనాలపాడులోని స్థానిక ఆలయంలో ఓ వ్యక్తి మైక్ సెట్ చేయడానికి ట్రై చేశారు. నిన్న రాత్రి వర్షం కారణంగా విద్యుదాఘాతం జరిగింది. దాంతో కరెంట్ తీగల్ని పట్టుకుని మైక్ సెట్ చేస్తున్న వ్యక్తితో పాటు అతడ్ని అంటుకుని ఉన్న మరో ఇద్దరు వ్యక్తులు సైతం విద్యుదాఘాతానికి గురయ్యారు. కరెంట్ షాక్ కొట్టడంతో మస్తాన్‌రావు, సుబ్బారావు, వెంకయ్య ముగ్గురు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దేవుడి సన్నిధిలో అక్కడే ప్రాణాలు కోల్పోవడంతో వారి కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. దైవ కార్యం కోసం వెళ్లిన తమ ఇంటి యజమానులు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారంటూ విలపించడం చూసి గ్రామస్తులను సైతం కంటతడి పెట్టించింది.