AP Crime News : వరుడితో షాపింగ్ కు వచ్చిన యువకుడితో ప్రేమలో పడిన పెళ్లి కూతురు, చివరకు ప్రాణం పోగొట్టుకుంది!
AP Crime News : పెళ్లి కొడుకుతో పాటు షాపింగ్ కు వచ్చిన వ్యక్తితో ప్రేమలో పడింది పెళ్లికూతురు. పెద్దల భయంతో నిర్ణయించిన పెళ్లి చేసుకున్నా సంసారానికి నిరాకరించింది. చివరకు ప్రేమించిన యువకుడితో వెళ్లిపోయి ప్రాణం పోగొట్టుకుంది.
AP Crime News : పెళ్లి అంటే నిండు నూరేళ్ల జీవితం. అగ్ని సాక్షిగా ఒక్కటైన బంధం ఏడు అడుగులతో మొదలై జీవితాంతం ఒకరి అడుగు జాడల్లో మరొకరు నడుస్తారనే నమ్మకం. అందుకే వివాహ వేడుకను బంధు, మిత్రుల మధ్య ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు పెద్దలు. దాంపత్య జీవితంలోకి అడుగు పెట్టిన వధూవరులు ఎన్నో ఆశలతో తమ జీవితాలను ప్రారంభిస్తారు. ఒకరిపై ఒకరు నమ్మకంతో సాగే దాంపత్య జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా సర్దుకుపోతే వారి జీవితాలు సాఫీగా సాగిపోతుంది. తాజాగా వివాహ వేడుకలకు షాపింగ్ చేసేందుకు వరుడితో పాటుగా వచ్చిన యువకుడి ప్రేమలో పడింది. ఒకరినొకరు ఇష్ట పడ్డారు. ఇంతలో ముందే నిశ్చయించిన యువకుడితో యువతి వివాహం జరిగి పోయింది. వివాహం జరిగినా భర్తతో సంసారం చేయకుండా దూరం పెట్టింది. ప్రియుడి జ్ఞాపకాలను మరిచి పోలేక అతడితో కలిసి ఉండాలని ఇంట్లోంచి వెళ్లిపోయింది. ఇంతలో ఎవరూ ఊహించని ఘటనతో యువతి తిరిగి రాని లోకాలకు వెళ్లిన సంఘటన అన్నమయ్య జిల్లాలో చోటు చేసుకుంది.
అసలేం జరిగింది?
అన్నమయ్య జిల్లా నిమ్మనపల్లె మండలం రెడ్డివారిపల్లెకు చెందిన నరసింహులు, కృష్ణమ్మ దంపతులు కుమారుడు అరవింద్, కుమార్తె హర్షిత ఉన్నారు. హర్షిత తిరుపతిలోని ఓ బంగారు దుకాణంలో పని చేస్తుంది. బీఈడీ పూర్తి చేసిన హర్షిత తగిన ఉద్యోగం కోసం వేచిచూస్తుంది. అయితే హర్షితకు తల్లిదండ్రులు వివాహం చేయాలని నిర్ణయించుకున్నారు. మేలపట్లకు చెందిన వెంకటరమణారెడ్డి కుటుంబం నుంచి వివాహ సంబంధానికి పిలుపు వచ్చింది. వెంకటరమణారెడ్డికి దత్తత కుమారుడు జాషువా, సొంత కుమారుడు రాజేష్ రెడ్డిలు ఉన్నారు. దత్తపుత్రుడు జాషువాకు హర్షితను ఇచ్చి వివాహం చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే వెంకటరమణారెడ్డి సొంత పుత్రుడు రాజేష్ రెడ్డి ప్రైవేటు కళాశాల్లో స్కిల్ డెవలప్మెంట్ ట్రైనర్ గా పని చేస్తూ ఉండగా, జాషువా పౌల్ట్రీ రంగంలో పనిచేస్తూ మందులు సరఫరా చేస్తూ జీవనం సాగించేవాడు. జాషువాతో హర్షిత వివాహం జరిపించాలని పెద్దలు నిర్ణయించడంతో పెళ్లి పనులకు రాజేష్ రెడ్డిని వెంట పెట్టుకుని జాషువా తిరిగేవాడు. చివరికి షాపింగ్ కూడా రాజేష్ రెడ్డినే జాషువా తోడు పెట్టుకుని వెళ్లాడు. ఆ సమయంలోనే రాజేష్ రెడ్డితో, హర్షితకు పరిచయం ఏర్పడింది. వీరిద్దరి పరిచయం కాస్తా ప్రేమగా మారింది.
డబ్బు తీసుకుని పరారీ
జాషువాకు తెలియకుండా హర్షిత, రాజేష్ రెడ్డి షికార్లకు కొట్టేవారు. ఇంతలో వివాహ సమయం రావడంతో పెద్దలకు భయపడిన హర్షిత, వారి మాటలకు ఎదురు చెప్పకుండా జాషువానే పెళ్లి చేసుకుంది. రాజేష్ రెడ్డితో ప్రేమలో ఉన్న హర్షిత జాషువాతో సంసారం చేయకుండా దూరం పెట్టింది. అంతే కాకుండా జాషువాను చిన్న చిన్న విషయాలకు ఛీ కొడుతూ వచ్చేది. దీంతో జాషువా, హర్షిత మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఇవి గమనించిన తల్లి భార్యభర్తలకు నచ్చజెప్పేది. హర్షిత, రాజేష్ రెడ్డితో సన్నిహితంగా ఉండడాన్ని గమనించిన రాజేష్ రెడ్డి తల్లి హర్షితను మందలించింది. అవేవి పట్టించుకోని హర్షిత జాషువా ముందే రాజేష్ రెడ్డితో సన్నిహితంగా ఉండేది. ఇదే విషయంపై జాషువా కూడా హర్షితను మందలించాడు. భర్త మాటలను ఏమాత్రం పట్టించుకోని హర్షిత రాజేష్ రెడ్డితో సంబంధం కొనసాగిస్తూ వచ్చేది. జాషువాపై ద్వేషం పెంచుకున్న ఆమె జాషువా దగ్గర ఉండలేక తిరిగి తిరుపతికి చేరుకుని బంగారం దుకాణంలో పని చేయడం ప్రారంభించింది. ఈ నెల 13వ తారీఖున రాజేష్ రెడ్డి పుంగనూరులోని తన ఇంటిలో లక్షల రూపాయలు తీసుకుని ఇంట్లోంచి వచ్చేశాడు. రాజేష్ ఫోన్ స్వీచ్చ్ ఆఫ్ రావడంతో ఈనెల 14వ తారీఖున వెంకటరమణారెడ్డి పుంగనూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఒంగోలులో రోడ్డు ప్రమాదం
దీంతో దర్యాప్తు సాగించిన పోలీసులు మదనపల్లెలోని దేవత నగర్ లో రాజేష్ రెడ్డి కారును గుర్తించారు. కారులోని ముందు భాగంలో ఉన్న సీట్లు కాలిపోయి ఉండడం, పెట్రోల్ వాసన రావడంతో రాజేష్ రెడ్డి సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు రాజేష్ రెడ్డి విజయవాడలో ఉన్నట్లు గుర్తించారు. దీంతో రాజేష్ రెడ్డి తండ్రి వెంకటరమణారెడ్డి పోలీసులతో కలిసి ఇన్నోవా వాహనంలో విజయవాడకు బయలుదేరాడు. తరువాత రాజేష్ రెడ్డి, హర్షితలను వాహనంలో విజయవాడ నుంచి తీసుకుని వస్తున్న సమయంలో ఒంగోలు సమీపంలో కారు డివైడర్ ను ఢీ కొనడంతో ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో హర్షిత ఘటన స్థలంలోనే మృతి చెందగా రాజేష్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ జ్ఞానప్రకాష్ లు తీవ్రంగా గాయపడ్డారు.