Karimnagar: అన్ని జిల్లాలను జల్లెడ పడుతున్న టాస్క్‌ఫోర్స్ దాడులు, పోలీసుల అదుపులో ఇద్దరు కరీంనగర్ యువకులు !
Secunderabad Agnipath Case: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన అల్లర్లకు సంబంధించిన కేసులో కరీంనగర్ జిల్లాకు చెందిన ఇద్దరు యువకులను హైదరాబాద్ చెందిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Secunderabad Agnipath Case: అగ్నిపథ్ ఆర్మీ రిక్రూట్ మెంట్ పథకాన్ని వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన అల్లర్లకు సంబంధించిన కేసులో కరీంనగర్ జిల్లాకు చెందిన ఇద్దరు యువకులను హైదరాబాద్ చెందిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. పక్కా ప్లానింగ్‌తో ఇతర జిల్లాలోని యువకులతో కలిసి వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసిన ఆ యువకులు... ప్రతి నిమిషం వారికి అప్డేట్ చేస్తూ ఈ ఘటనలో తమ వంతు పాత్ర వహించినట్లు పోలీసులు గుర్తించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో చెలరేగిన ఆందోళనలకు సంబంధించి కామారెడ్డికి చెందిన మధుసూదన్‌ను ప్రధాన సూత్రధారిగా పోలీసులు గుర్తించారు. 56 మందిని పోలీసులు నిందితులుగా చేర్చగా, వీరిలో 46 మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మరో 10 మందిని త్వరలో అదుపులోకి తీసుకుంటామన్నారు.
రాష్ట్రంలోని అన్ని జిల్లాలతో పాటు కరీంనగర్ జిల్లాపై సైతం టాస్క్ ఫోర్స్ పోలీసులు నిఘా మరింత పెంచారు. దర్యాప్తు పూర్తిగా కేంద్ర పరిధిలోని సంస్థల ఆధ్వర్యంలో జరుగుతుండడంతో స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చిన హైదరాబాద్ బృందం సీసీ కెమెరా ఫుటేజీలను,సెల్ ఫోన్ కాల్ డేటా సాక్ష్యాలుగా సమీకరించి ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కేసును విచారిస్తున్న ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి అనుమానితుల సెల్ ఫోన్లను, కాల్ డేటాతో పాటు ఇతర సమాచారాన్ని సేకరిస్తున్నారు. అయితే అప్పటికే సదరు నిందితులు వారి ఫోన్లలో ఉన్న మెసేజ్లను ఇతర డేటాను డిలీట్ చేసినట్లు ప్రాథమిక సమాచారం. అయితే పోలీసుల సైబర్ బృందం ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ద్వారా వారిద్దరూ డిలీట్ చేసిన మెసేజ్లను, పోస్ట్ లను ఎవరు ఎవరికి పంపించారు అనే విషయాన్ని తేల్చిన తర్వాతే వారిని అదుపులోకి తీసుకొని హైదరాబాద్ కి తరలించి మరింత లోతుగా విచారిస్తున్నారు.
డిఫెన్స్ అకాడమీలపై స్పెషల్ ఫోకస్
ఇక కరీంనగర్ లోని స్పెషల్ బ్రాంచ్ పోలీసులు, స్థానికంగా ఉన్న డిఫెన్స్ అకాడమీలో ఎవరెవరు ఇప్పటివరకు ఆర్మీ శిక్షణ పొందారో వారి వివరాలను సేకరిస్తున్నారు. అకాడమీ నిర్వాహకుల వ్యవహారశైలితో పాటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో సంఘటనలో ఏమైనా ఇన్వాల్వ్ అయి ఉన్నారా అనే విషయాన్ని కూడా సేకరించి ఒక రిపోర్ట్ తయారు చేసినట్లు తెలిసింది. ఈ కేసులో ఎలాంటి తప్పిదాలకు పాల్పడకుండా... పూర్తిస్థాయిలో విచారణ చేస్తున్న పోలీసులు అల్లర్లకు కారకులైన అందరు నిందితుడిని అరెస్ట్ చేసే దిశగా యువకుల్ని అదుపులోకి తీసుకుంటున్నారు.
ఈ సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించగా ఇందులో పాల్గొన్న వారిలో కొద్దిమంది మాత్రమే ఆర్మీ అభ్యర్థులు ఉండడం... వారికి తెరవెనుక సహకారం ఇచ్చినవారు పూర్తిగా బయటకు రాకపోవడంతో ఎక్కువగా అంతర్గత విచారణకే పోలీసు ఉన్నతాధికారులు మొగ్గు చూపుతున్నారు. కుట్ర కోణంలో దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులకు నిందితులు పూర్తి వివరాలు చెబుతుండడంతో విచారణ వేగవంతం అయ్యే అవకాశం ఉంది .అయితే ఇందులో డిఫెన్స్ అకాడెమీలో పాత్ర ఎంతవరకూ ఉంది అనే దానిపై ఎవరూ కూడా మీడియా ముందు నోరు విప్పడం లేదు.