Konaseema Crime: దెయ్యం పట్టిందనే సాకుతో భర్త దాష్టీకం, చిత్రహింసలతో వివాహిత మృతి- నిందితుడి అరెస్ట్
Konaseema Crime: భర్త చిత్రహింసలు పెట్టడంతో వివాహిత తీవ్ర అనారోగ్యానికి గురైంది. తల్లిదండ్రులు ఆమెను ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతిచెందింది. కోనసీమ జిల్లాలో ఘటన జరిగింది.
Konaseema Crime:
ఏడడుగులు నడిచి చివరిదాకా తోడు ఉంటానని పెళ్లినాటి ప్రమాణాలను కాలరాశాడో భర్త. అల్లారుముద్దుగా పెంచుకున్న కుమార్తెను కట్నకానుకలు ఇచ్చి ఘనంగా వివాహం జరిపించారు ఆమె తల్లిదండ్రులు. కానీ ఆ నమ్మకాన్ని వమ్ముచేసి చివరకు కడతేర్చాడో భర్త. తన భార్యను ఏదోలా వదిలించుకోవాలనుకున్న కారణంతో శారీరక రోగాన్ని దెయ్యం పట్టిందన్న నెపంవేసి ఇష్టానుసారంగా చావుదెబ్బలు కొట్టి అవయవాలు సైతం దెబ్బతినేలా చేశాడు. నమ్మి కాపురం చేసి ఇద్దరు పిల్లలుకన్న ఆ అభాగ్యురాలు చివరకు ఆ పిల్లల మధ్యే జీవచ్చవంగా పడి ఉండగా కన్నవారు వెళ్లి ఆసుపత్రిలో చేర్పిస్తే చివరకు చికిత్స పొందుతూ మృతిచెందింది. ఇంతటితో ఆగక అత్తమామల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టి పిల్లలకు ఏదో పడేస్తాలే అని వారి నోర్లు నొక్కే ప్రయత్నం చేశాడు. పోలీసులు సీన్‌లోకి ఎంటర్ అవ్వడంతో కథ అడ్డం తిరిగి అడ్డంగా బుక్కయ్యాడు. నిందితున్ని ఊచలు లెక్కించే పనిలోపడ్డారు పోలీసులు.
రాజోలు నియోజకవర్గంలో హాట్ టాపిక్ అయిన ఈ ఘటన రాజోలు మండలం శివకోటి గ్రామంలో ఆలస్యంగా వెలుగు చూసింది. అల్లవరం మండలం కొమరగిరిపట్నం అంబేడ్కర్ నగర్‌కు చెందిన వాణి మనీషా(25)ను నాలుగేళ్ల క్రితం రాజోలు మండలం శివకోటి గ్రామానికి చెందిన బళ్ల విజయ్‌కుమార్‌కు ఇచ్చి పెద్దలు కుదిర్చిన వివాహం చేశారు. వీరికి సంతానం ఇద్దరు కొడుకులు ఉన్నారు. గత కొంతకాలంగా మద్యానికి బానిసై చెడు తిరుగుళ్లకు అలవాటు పడిన విజయ్‌కుమార్ భార్య వాణి మనీషాతో తరచూ గొడవలు పడుతున్నాడు. అయినా అన్నీ సహించిన మనీషా ఈ విషయం ఎప్పుడూ తల్లితండ్రులకు చెప్పలేదు. తల్లి ఉపాధి నిమిత్తం గల్ఫ్ లో ఉంటుండగా తండ్రితో అప్పుడప్పుడు తన భర్త తనపై పాల్పడుతున్న దాష్టికాన్ని చెప్పేది. అయితే భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతాయని అనుకున్నామని వివాహిత తల్లితండ్రలు ఏడుకొండలు, నాగమణిలు వాపోయారు.
దెయ్యం పట్టిందని నెపం వేసి..
వాణి మనీషాకు చిన్నతనంలో ఫిట్స్ వచ్చేవి. అయితే ఇటీవల భర్త చేస్తున్న దాష్టికాలకు మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురైన మృతురాలు కొంత అనారోగ్యం పాలైంది. ఈ క్రమంలోనే ఫిట్స్ వచ్చాయి. ఇదే సాకుగా చేసుకుని ఏదోలా భార్యను వదలించుకోవాలన్న స్కెచ్ వేశాడు భర్త విజయ్‌కుమార్. తన భార్యకు దెయ్యం పట్టిందని అందరినీ నమ్మించాడు. తరచూ తన భార్యకు దెయ్యం పడుతుందని అది కొడితే పోతుందని భార్యను ఇష్టానుసారం కొట్టేవాడని మృతురాలి బంధువులు ఆరోపించారు.
తీవ్రంగా గాయపడడంతో కోమాలోకి..
తన భార్యకు దెయ్యం పట్టిందని నెపం వేసి నాలుగు రోజుల కిందట వాణీ మనీషాను చావబాదాడు భర్త విజయ్‌కుమార్. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన మనీషా ఫిట్స్ వచ్చి పడిపోయిందని అత్తింటివారికి ఫోన్‌చేశాడు. మొత్తం మీద అమలాపురంలోకి కిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. శరీరంపై పైకి కనిపించని గాయాలతో కోలుకోలేని స్థితిలోకి వెళ్లిన మనీషా చివరకు మంగళవారం చికిత్స పొందతూ మృతిచెందింది. నిజంగానే ఫిట్స్ రావడం వల్లనే పడిపోయిన కారణంతోనే చనిపోయిందని భావించిన కుటుంబికులు గల్ఫ్ లో ఉంటోన్న తల్లి కూతురు చివరి చూపుకోసం ఇండియా రప్పించే ఏర్పాట్లు చేశారు.
పెద్దల పంచాయితీతో వెలుగులోకి..
ఆసుపత్రి నుంచి మృతదేహాన్ని అత్తింటి ఊరైన శివకోడుకు తరలించిన గల్ఫ్ దేశంలో ఉంటోన్న తల్లికోసం ఎదురు చూస్తున్న క్రమంలో ఇద్దరు బిడ్డలకు ఏదైనా ఆసరా చూపేలా కొంత భూమి రాయాలని మృతురాలు బందువులు పట్టుబట్టారు. దీంతో స్థానిక పెద్దల సమక్షంలో పంచాయితీ జరిగింది. అయితే తానే వారు అడిగింది చేయడం జరగదని భర్త విజయ్‌కుమార్ పట్టుపట్టడంతో కొంత వాగ్వాదం చోటుచేసుకుంది.. దీంతో ఈ విషయం రోజుల పోలీసులకు చేరింది. భర్త విజయ్‌కుమార్ భార్యపట్లా కొన్నిరోజులుగా వ్యవహరిస్తున్న తీరు, మృతురాలు మెడ వెనుక భాగంలో గాయాలు మచ్చలుగా బయట పడడంతో మృతదేహాన్ని పరిశీలించిన రాజోలు ఎస్సైకు అనుమానం వచ్చింది. దీంతో మృతురాలి తల్లితండ్రుల నుంచి ఫిర్యాదును స్వీకరించి ఇంఛార్జ్ సీఐ ప్రశాంత్‌కుమార్‌కు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన సీఐ ప్రశాంత్‌కుమార్ మృతదేహాన్ని పరిశీలించి భర్త విజయ్‌కుమార్‌ను విచారించిన ఆయన మనీషాను తీవ్రంగా కొట్టడం వల్లనే మృతిచెందిందని నిర్ధారించారు. నిందితునిపై హత్య కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించారు. నిందితున్ని అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడిరచారు.