Kerala Woman Dies: ప్రాణాలు తీసిన బిర్యానీ, కేరళలో ఓ యువతి మృతి - ఫుడ్ పాయిజన్ అయిందా?
Kerala Woman Dies: కేరళలో ఓ యువతి బిర్యానీ తిని ప్రాణాలు కోల్పోయింది.
Kerala Woman Dies Eating Biryani:
ఫుడ్ పాయిజన్..?
కేరళలో ఓ 20 ఏళ్ల యువతి బిర్యానీ తిని ప్రాణాలు కోల్పోయింది. కేరళలో ఫేమస్ వంటకం అయిన "కుజిమంతి" బిర్యానీని ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసుకున్న యువతి...అది తిన్న వెంటనే అనారోగ్యానికి గురైంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం...అంజు శ్రీపార్వతి అనే యువతి కసరగాడ్‌లో ఉంటోంది. గతేడాది డిసెంబర్ 31న ఆన్‌లైన్‌లో ఓ హోటల్ నుంచి బిర్యానీ తెప్పించుకుంది. అది తిన్నాక అనారోగ్యానికి గురైంది. అప్పటి నుంచి చికిత్స పొందుతున్న యువతి..చివరకు మృతి చెందింది. "తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాం. ఈ ఉదయం బాధితురాలు చనిపోయింది" అని పోలీసులు వెల్లడించారు. ఫోరెన్సిక్ రిపోర్ట్ ఆధారంగా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. స్థానికంగా ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మొదట వైద్యం అందించారు. అక్కడి నుంచి మంగళూరులోని మరో ఆసుపత్రికి తరలించారు. అక్కడే బాధితురాలు చనిపోయింది.
విచారణ..
ఈ ఘటనపై కేరళ ఆరోగ్యమంత్రి వీణా జార్జ్ స్పందించారు. విచారణకు ఆదేశించారు. "ఫుడ్ సేఫ్‌టీ కమిషనర్‌కు ఆదేశాలిచ్చాం. ఈ ఘటనపై నివేదిక ఇవ్వాలని చెప్పాం. డీఎమ్‌ఓ కూడా విచారణ జరుపుతున్నారు" అని ఆమె వెల్లడించారు. ఫుడ్ పాయిజన్ అని తేలితే అలాంటి హోటల్స్ లైసెన్స్‌లు రద్దు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. గత వారం కొట్టాయం మెడికల్ కాలేజ్‌కు చెందిన ఓ నర్స్ కొజికోడ్‌లో ఓ హోటల్‌లో ఫుడ్ తిని మృతి చెందింది. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఘటనలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. చాలా హోటల్స్‌లో ప్రమాణాలు పాటించడం లేదని గతంలోనే పలు నివేదికలు వెల్లడించాయి. వాడిన నూనె మళ్లీ వాడటం, మాంసాన్ని ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంచడం లాంటి అజాగ్రత్తలతో ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి.
తరచూ ఘటనలు..
గతేడాది డిసెంబర్‌లో మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలో పెళ్లి భోజనం తిని 100 మంది అస్వస్థతకు గురయ్యారు. పెళ్లి పూర్తికాగానే భోజనం చేసి అతిథులంతా వెళ్లిపోయారు. కాసేపటి తరవాత అందరికీ వాంతులు అయ్యాయి. తీవ్ర కడుపు నొప్పితో విలవిలలాడిపోయారు. సాయంత్రానికి అందరూ మంచం పట్టారు. దగ్గర్లోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేరారు. "ఓ ఆలయంలో జరిగిన పెళ్లికి అందరూ హాజరయ్యారు. అక్కడ వివాహ విందు చేసిన తరవాత అందరికీ వాంతులయ్యాయి. ప్రస్తుతానికి వారి ఆరోగ్యం నిలకడగానే ఉంది. ఎవరికీ ఎలాంటి ప్రమాదం లేదు" అని వైద్యులు తెలిపారు. ఇటీవలే బిహార్‌లోనూ ఓ దారుణం జరిగింది. బల్లి పడినట్లు అనుమానిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని బలవంతంగా తినిపించడంతో 200 మంది విద్యార్థులు ఆస్పత్రిపాలయ్యారు. భాగల్పుర్‌లోని ఓ పాఠశాలలో ఈ ఘటన జరిగింది. మధ్యాహ్న భోజనం చేసిన విద్యార్థులు ట్యూషన్ క్లాసులకు వెళ్లగా అక్కడ ఒకరికి వాంతులయ్యాయి. కొద్దిసేపటికే మిగిలిన విద్యార్థులు కూడా అనారోగ్యానికి గురయ్యారు. దీంతో పాఠశాల సమీపంలోని ఓ వైద్య కేంద్రానికి విద్యార్థులను తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు.
Also Read: Oreo Biscuits: యూఏఈలో ఓరియో బిస్కెట్‌లపై వివాదం, క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం