Kerala: రెండో పెళ్లి ఎంత పని చేసింది! ముగ్గురు పిల్లలను చంపేసి దంపతులు ఆత్మహత్య
Kerala: కేరళలోని ఓ ఇంట్లో ముగ్గురు చిన్నారులు సహా దంపతులు విగతజీవులుగా కనిపించారు. చిన్నారులను చంపేసి తర్వాత దంపతులు ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు.
Kerala: కేరళ రాష్ట్రంలో దారుణం వెలుగుచూసింది. కన్నూరు జిల్లాలోని చెరుపుళ పడిచలిల్ ప్రాంతంలోని ఓ ఇంట్లో ఐదుగురు కుటుంబసభ్యులు విగతజీవులుగా కనిపించడం స్థానికంగా కలకలం సృష్టించింది. చనిపోయిన వారిలో ముగ్గురు చిన్నారులు సహా దంపతులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మొదట ముగ్గురు పిల్లలను చంపేసి ఆ తర్వాత దంపతులు బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. పడిచలిల్ ప్రాంతంలోని ఈ ఇంట్లో ముగ్గురు చిన్నారుల మృతదేహాలు మెట్లపై ఉండగా.. దంపతుల మృతదేహాలు సీలింగ్ ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించినట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు.
Also Read: హైదరాబాద్‌లో నయా ఎన్ కౌంటర్ స్పెషలిస్టు ఐపీఎస్ రామ్- అరెస్టు చేసి లోపలేసిన ఖాకీలు
ఇద్దరికీ ఇటీవలే రెండో పెళ్లి, అంతలోనే దుర్ఘటన
కన్నూరు జిల్లా చెరువతూర్ ప్రాంతానికి చెందిన శ్రీజకు గతంలో వివాహం జరిగింది. ఆమెకు ముగ్గురు సంతానం. సూరజ్(12), సుజని(8), సురభి(6) ఉన్నారు. అయితే శ్రీజకు తన భర్తకు మధ్య కలహాల వల్ల కొంత కాలంగా దూరంగా ఉంటోంది. ఆ తర్వాత షాజీ అనే వ్యక్తి పరిచయం కావడంతో వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అప్పటికి శ్రీజ మొదటి భర్తతో విడాకులు తీసుకోలేదు. కానీ ముగ్గురు పిల్లలు శ్రీజతోనే ఉంటున్నారు. అలాగే షాజీకి కూడా గతంలో ఓ మహిళపై వివాహం జరిగింది. అతనికి ఇద్దరు సంతానం. అతడు కూడా మొదటి భార్యకు విడాకులు ఇవ్వలేదు. వీళ్లిద్దరూ మొదటి జీవిత భాగస్వాముల నుండి విడాకులు తీసుకోకుండానే ఈ నెల 16 వ తేదీన పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత శ్రీజ మొదటి భర్తకు చెందిన ఇంట్లో వీళ్లు కాపురం పెట్టారు. ఈ విషయంపై చెరుపుజ పోలీస్ స్టేషన్ లో పలు కేసులు నమోదు అయినట్లు స్థానికులు చెబుతున్నారు.
Also Read: పెళ్లి ఫిక్స్ అయింది, ప్రేమ గురించి తెలిసిపోయింది! - తట్టుకోలేక ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య
పెళ్లైనప్పటి నుండి ఇద్దరి మధ్య గొడవలు
అయితే వివాహం జరిగినప్పటి నుండి శ్రీజకు, షాజీకి మధ్య రోజూ గొడవలు జరుగుతుండేవని స్థానికులు చెబుతున్నారు. షాజీతో వివాహానికి శ్రీజ కుటుంబసభ్యులు కూడా అడ్డు చెప్పినట్లు స్థానికులు తెలిపారు. శ్రీజను, ఆమె రెండో భర్త షాజీని ఇటీవలే పోలీసు స్టేషన్ కు పిలిపించి మాట్లాడినట్లు డిప్యూటీ ఎస్పీ కేఈ ప్రేమచంద్రన్ తెలిపారు. ఇప్పుడు ముగ్గురు పిల్లలను చంపేసి, వారు ఆత్మహత్యకు పాల్పడటానికి కారణాలు ఏంటనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మంగళవారం అర్ధరాత్రి వేళ చిన్నారులను హత్య చేసి వారు ఆత్మహత్య చేసుకున్నట్లు అధికారులు భావిస్తున్నారు. చిన్నారుల మృతదేహాలతో పాటు శ్రీజ, షాజీ మృతదేహాలను పోలీసులు పోస్టు మార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోస్టు మార్టం రిపోర్టు తర్వాతే వారి మృతిపై పూర్తి స్పష్టంత వస్తుందని పోలీసులు తెలిపారు.
కామారెడ్డిలో ఎస్పీ ఆఫీసు దగ్గర్లో ఘోరం
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయానికి కూతవేటు దూరంలో దారుణ హత్య జరిగింది. రామారెడ్డి మండలం సింగరాయపల్లి గ్రామ సర్పంచ్ మహేశ్వరి భర్త అధికం నర్సాగౌడ్ ను అతి దారుణంగా హత్య చేశారు. నర్సాగౌడ్ ముఖంపై గాయాలు ఉండడంతో ఎవరో కావాలని హత్య చేశారని సింగరాయపల్లి గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామస్థులు, పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. గ్రామంలో బెల్ట్ షాప్ నిర్వహణ కోసం సంవత్సరానికి 2 లక్షల రూపాయలు గ్రామ పంచాయతీకి చెల్లించేవారు. ఇందులో సుమారు రూ.80,000 వేల వరకు లెక్కలు చూపకపోవడంతో నర్సాగౌడ్ కు పలువురి మధ్య విభేదాలు తలెత్తినట్లు తెలిసింది. దీని విషయంలోనే కక్ష పెంచుకొని నర్సాగౌడ్ ను హత్య చేసినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.