Karimnagar News : వడ్డీ వ్యాపారుల వేధింపులతో యువకుడు ఆత్మహత్య- కలచివేస్తున్న సూసైడ్ నోట్
Karimnagar News : కరీంనగర్ జిల్లాలో వడ్డీ వ్యాపారస్తుల ఆగడాలు ఆగడంలేదు. అధిక వడ్డీల కోసం వేధిస్తుండడంతో అప్పులు తీసుకున్న వారు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
Karimnagar News : కరీంనగర్ జిల్లాలో ఫైనాన్షియర్ల వేధింపులు ఆగడం లేదు. ఇటీవల పదుల సంఖ్యలో అరెస్టులు జరిగినా ఏ మాత్రం అడ్డుఅదుపూ లేకుండా రెచ్చిపోతున్నారు అక్రమ వడ్డీ వ్యాపారులు. వివరాల్లోకి వెళితే మానకొండూరు మండలం అన్నారం గ్రామానికి చెందిన మార్క ప్రశాంత్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అతను రాసిన సూసైడ్ నోట్ కూడా లభించింది. అన్నారం గ్రామానికి చెందిన ముద్రకోలా రామాంజనేయులు అధిక వడ్డీలకు డబ్బులు ఇచ్చి 10%, 15% వడ్డీ వసూలు చేస్తున్నాడని ప్రశాంత్ సూసైడ్ లేఖలో రాశాడు. రూ. 20 లక్షలు వరకూ చెల్లించాలని బెదిరింపులకు గురిచేశాడని, డబ్బు కూడా ఎవ్వరికి తెలియకుండా తనకు మాత్రమే నేరుగా ఇవ్వాలని బెదిరించాడని సూసైడ్ నోట్లో మార్కప్రశాంత్ పేర్కొన్నాడు. అదేవిధంగా ఇప్పటికే పది లక్షల రూపాయలు చెల్లించినట్లు ప్రశాంత్ పేర్కొన్నాడు.
సారీ అనన్య
ప్రశాంత్ భార్య అనన్య ఐదు నెలల గర్భవతి. ఆమెను ఉద్దేశించి తనకు చావాలని లేకున్నా అప్పుల కారణంగా తప్పడం లేదని చెబుతూ చివరి సారిగా సారీ అంటూ పేర్కొన్నాడు. ఈ లేఖ చూసిన పలువురు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశాంత్ తండ్రి మార్క ఆంజనేయులు తన కొడుకు మృతికి కారణమైన ముద్ర కోల రామాంజనేయులపై చట్టపరమైన చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ్ముడు సారీ రా అమ్మా, నాన్న, అమ్మమ్మను బాగా చూసుకో అని లేఖలో ప్రశాంత్ పేర్కొన్నాడు. తాను ఎవరికి ఎంత బాకీ ఉన్నానో వివరాలు చెబుతూనే వడ్డీకి ఇచ్చిన రామాంజనేయులుకు పైసా ఇవ్వవద్దని లేఖలో తెలిపాడు. ప్రశాంత్ మృతితో అతని కుటుంబ సభ్యులు రోధించిన తీరు గ్రామస్థులను కలచివేసింది.
యువ వైద్యుడు సూసైడ్
హైదరాబాద్ అఫ్జల్గంజ్ పీఎస్ పరిధిలోని ఓ లాడ్జిలో యువ వైద్యుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురానికి చెందిన అనిల్(31) ఖమ్మం మమత మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తిచేశాడు. ఈ నెల 22న హైదరాబాద్ లోని పెరల్ సిటీ లాడ్జిలో గది అద్దెకు తీసుకున్నాడు. గురువారం గది శుభ్రం చేసేందుకు లాడ్జి సిబ్బంది వెళ్లగా బెడ్ పై అనిల్ కదలకుండా పడిఉండటాన్ని గుర్తించారు. అనుమానం వచ్చిన సిబ్బంది లాడ్జ్ మేనేజర్ కు సమాచారం అందించారు. మేనేజర్ వచ్చి పరిశీలించి అనిల్ చనిపోయినట్టు నిర్ధారించుకుని పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న అఫ్జల్గంజ్ పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన చోటుచేసుకున్న గదిలో పలు రకాల ఇంజెక్షన్లు, టాబ్లెట్లను పోలీసులు గుర్తించారు. యువ వైద్యుడు ఆత్మహత్య చేసుకోడానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.