Karimnagar Crime : సినీఫక్కీలో కూతురినే కిడ్నాప్ చేసిన తల్లిదండ్రులు
Karimnagar Crime : ఇష్టం లేని వివాహం చేసుకున్న కూతురిని ఇంటికి తీసుకొచ్చేందుకు తల్లిదండ్రులు కిడ్నాప్ ప్లాన్ చేశారు. పదుల సంఖ్యలో వాహనాల్లో వచ్చిన తల్లిదండ్రులు, బంధువులు యువతిని కిడ్నాప్ చేశారు. కానీ చివరికి సీన్ రివర్స్ అయింది.
Karimnagar Crime : కన్న కూతురు వ్యవహారంలో తల్లిదండ్రులే విలన్స్ గా మారారు. తమ మాట వినడం లేదని కూతురిని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారు. అయితే వారి ప్లాన్ బెడిసికొట్టడంతో ఇప్పుడు కటకటాల పాలయ్యారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సంచలనం సృష్టించిన ఈ ఘటన రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో జరిగింది. ఓ వివాహితను తల్లిదండ్రులే కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించిన ఘటన జన్నారం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న జన్నారం పోలీసులు ఛేజ్ చేసి మరీ యువతిని రక్షించారు. నిందితులపై కేసు నమోదు చేశారు.
అసలేం జరిగింది?
జన్నారం పోలీస్ స్టేషన్ పరిధిలోని జన్నారం మండలం మొర్రిగూడకు చెందిన తోట నాగేష్, సిద్ధిపేట జిల్లా గజ్వేల్ మండలం జాలిగామకు చెందిన లక్ష్మిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే ఈ వివాహాన్ని యువతి తల్లిదండ్రులు అంగీకరించలేదు. యువతిని తమతో వచ్చేయాలని తోట నాగేష్ ఇంటికి వచ్చారు తల్లిదండ్రులు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఇరువురి కుటుంబం సభ్యులను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు. లక్ష్మీ తల్లిదండ్రులతో వెళ్లడం కంటే నాగేష్ తో ఉండడానికి ఇష్టం చూపింది. అమ్మాయి ఇష్టపడి పెళ్లి చేసుకుందని తీసుకువెళ్లడానికి ప్రయత్నించినా, ఇబ్బందులు పెట్టినా చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పడంతో తల్లిదండ్రులు వెళ్లిపోయారు. కానీ వారి ఆలోచనలు మాత్రం వేరే రకంగా ఉన్నాయి. ఎప్పటికైనా తమ అమ్మాయిని తిరిగి ఇంటికి తెచ్చుకోవాలనే ఆలోచన వారి మనసులో నెలకొని ఉంది.
సినీఫక్కీలో కిడ్నాప్
సరైన సమయం కోసం వేచి చూస్తున్న అమ్మాయి తల్లిదండ్రులు, బంధువులు అదునుచూసి కిడ్నాప్ కి ప్లాన్ వేశారు. శుక్రవారం ఉదయం నాలుగు గంటల సమయంలో యువతి తల్లిదండ్రులు, బంధువులు వాహనాల్లో వచ్చి తోట నాగేష్ ఇంటిపై దాడికి దిగారు. అమ్మాయిని కిడ్నాప్ చేసి వాహనాల్లో ఎక్కించుకుని తీసుకువెళ్లారు. సినీ ఫక్కీలో జరిగిన ఈ కిడ్నాప్ కేసు స్థానికంగా కలకలం సృష్టించింది. పదుల సంఖ్యలో వాహనాలు రావడంతో భయాందోళనకు గురై గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్ఐ సతీష్ లక్ష్మీని కిడ్నాప్ చేసిన వాహనాలను వెంబడించారు. వారిని దండేపల్లి మండలం ముత్యంపేట వద్ద పట్టుకున్నారు. మూడు వాహనాలు, వాహనాలలో ఉన్న వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ తరలించారు. తోట నగేష్ ఫిర్యాదుతో 23 మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సతీష్ తెలిపారు.
Also Read : Srikakulam news : సోదరి ఇంటికే కన్నం వేసిన సోదరుడు, కొత్తూరు చోరీ కేసులో ట్విస్ట్!
Also Read : Chikoti Praveen: క్యాసినో నిర్వహించా - ఆసక్తి ఉన్న వాళ్లను తీసుకెళ్లాను, తప్పేంటన్న చికోటి ప్రవీణ్