Srikakulam news : సోదరి ఇంటికే కన్నం వేసిన సోదరుడు, కొత్తూరు చోరీ కేసులో ట్విస్ట్!
Srikakulam news : శ్రీకాకుళం జిల్లాలో సోదరి ఇంటికే కన్నం వేశాడో సోదరుడు. స్వయానా బావమరిదే దొంగతనం చేయడంతో కుటుంబ సభ్యులు షాకయ్యారు. పైగా అతడు ఉపాధ్యాయవృతి చేస్తుడడంతో కేసు సంచలనం అయింది.
Srikakulam news : సోదరి ఇంటికే కన్నం వేశాడో సోదరుడు. సొంత బంధువే దొంగతనం చేయడంతో కుటుంబ సభ్యులు షాకవుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఈ చోరీని పోలీసులు ఛేదించారు. కొత్తూరు అఫీషియల్ కాలనీలో చోరీకి గురైన సొత్తును ఎట్టకేలకు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సొమ్మును పోగొట్టుకున్న అప్పన్న టీచర్ గా పనిచేస్తున్నారు. దొంగతనానికి పాల్పడిన ఏడుకొండలు కూడా ఉపాధ్యాయుడిగానే విధులు నిర్వహిస్తున్నారు. వీరిద్దరూ సొంత బంధువులే.
ఉపాధ్యాయుడే దొంగ
కొత్తూరు చోరీ కేసు వివరాలను జిల్లా ఎస్పీ జీఆర్ రాధిక శుక్రవారం మీడియాకు వివరించారు. నిందితుడు నుంచి బంగారం, నగదును స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. గతేడాది అక్టోబర్ లో అప్పన్న ఇంట్లో చోరీ జరిగింది. రూ.21.50 లక్షల నగదు, 5 తులాల బంగారాన్ని దుండగులు చోరీ చేశారు. ఈ ఘటనపై ఏప్రిల్ నెలలో ఎస్పీకి స్పందనలో అప్పన్న ఫిర్యాదు చేశారు. దీంతో కొత్తూరు పోలీసులను దర్యాప్తు వేగవంతం చేయాలని ఎస్పీ ఆదేశించారు. ఈ కేసును విచారించిన పోలీసులు అప్పన్న స్నేహితుడు, సొంత బావమరిదే చోరీకి పాల్పడ్డాడని గుర్తుచేశారు. నిందితుడు కూడా ఉపాధ్యాయుడే కావడం ఈ కేసులో సంచలనం అయింది.
కుమారుని వివాహం కోసం తెచ్చిన నగదు చోరీ
ఎస్పీ రాధిక తెలిపిన వివరాల ప్రకారం... కొత్తూరు అఫీషియల్ కాలనీలో ఉంటున్న జన్ని అప్పన్న తన కుమారుని వివాహ కోసం పెద్ద మొత్తంలో నగదును ఇంట్లో పెట్టారు. భామిని మండలం పెద్దదిమిడి గ్రామానికి చెందిన పక్కి ఏడుకొండలు, అప్పన్న స్నేహితులు, బంధువులు కూడా. ఏడుకొండలు ఆన్లైన్ ట్రేడింగ్ కు బానిస కావడంతో అప్పులపాలయ్యాడు. అప్పన్న ఇంట్లో నగదు ఉంటుందని తెలుసుకున్న ఏడుకొండలు ఇంటి తాళం దాచేస్థలాన్ని గమనించి ఇంట్లో ఎవరూ లేని సమయంలో చోరీచేశాడు. 3, 4 లక్షల రూపాయలు ఉంటాయని భావించిన నిందితుడు బీరువా తెరిచేసరికి ఊహించనంత భారీ మొత్తంలో నగదు కంటపడింది. దీంతో మొత్తం రూ.21.50 లక్షల నగదు, 5 తులాల బంగారంతో ఉడాయించాడు.
ఆన్లైన్ ట్రేడింగ్ వ్యసనంతో
ఇంటికి చేరుకున్న అప్పన్న, తన భార్య ఇంట్లో దొంగతనం జరిగిందని గమనించి లబోదిబోమన్నారు. వేసిన తాళాలు వేసినట్టే ఉన్నాయి కానీ బీరువాలో సొమ్ము ఖాళీ కావడంతో తెలిసిన వారే ఈ చోరీకి పాల్పడ్డారని భావించారు. కొద్దిరోజుల పాటు గమనించిన ఫలితం లేకపోయింది. ఆలస్యంగా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు రంగప్రవేశం చేయగా ఏడుకొండలే ఈ సొమ్మును దొంగిలించాడని నిర్ధారించారు. నిందితుడికి ఆన్లైన్ ట్రేడింగ్, గేమ్స్, బిట్ కాయిన్, షేర్ మా ర్కెట్ వ్యసనాలుండటంతో భారీగా అప్పులపాలయ్యాడని ఎస్పీ తెలిపారు. చోరీకి పాల్పడిన సొమ్మును ఇంట్లోనే దాచాడని ఎస్పీ స్పష్టం చేశారు. చోరీకి గురైన సొమ్మును స్వాధీనం చేసుకున్నామని, నిందితుని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరుస్తామన్నారు.
Also Read : Chikoti Praveen: క్యాసినో నిర్వహించా - ఆసక్తి ఉన్న వాళ్లను తీసుకెళ్లాను, తప్పేంటన్న చికోటి ప్రవీణ్