Jagtial Crime: ఫ్లిప్‌కార్ట్‌లో పార్ట్ టైం జాబ్ అని, యువకుడి బ్యాంక్ ఖాతా ఖాళీ చేసేశారు!
పేరున్న పెద్ద పెద్ద కంపెనీల పేరుతో నకిలీ వెబ్ సైట్లను తయారు చేయడం మొదలు పెడుతున్నారు. పక్కా స్కెచ్‌తో ఓ యువకుడిని ఫ్లిప్‌కార్ట్ కంపెనీలో ఉద్యోగం పేరుతో మోసం చేశారు
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆన్‌లైన్ మోసానికి గురయ్యాడు ఓ నిరుద్యోగి. ఇప్పటివరకు గుర్తుతెలియని పేర్లతో రకరకాల స్కీములు చెబుతూ మోసం చేస్తూ వచ్చిన కేటుగాళ్లు ఇక ప్రజల్లో కొంత అవగాహన పెరిగే సరికి తమకు మోసం చేయడం కష్టమవుతుందని గ్రహించారు. దీంతో అప్పటికే మార్కెట్లో మంచి పేరున్న పెద్ద పెద్ద కంపెనీల పేరుతో నకిలీ వెబ్ సైట్లను తయారు చేయడం మొదలు పెడుతున్నారు. ఇలాగే పక్కా స్కెచ్‌తో ఓ యువకుడిని ఫ్లిప్‌కార్ట్ (Flipkart) కంపెనీలో ఉద్యోగం పేరుతో మోసం చేశారు. ఆ వివరాలిలా ఉన్నాయి..
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నమిలికొండ గ్రామానికి చెందిన దయ్యాల నిఖిల్ అనే యువకుడికి సైబర్ నేరగాళ్లు తన మొబైల్ కి ఫ్లిప్‌కార్ట్ నుంచి చేస్తున్నట్లుగా పార్ట్ టైం జాబ్ అంటూ మెసేజ్ పంపించారు. దీంతో ఆ యువకుడు సైబర్ నేరగాళ్లు పంపించిన లింకును ఓపెన్ చేశాడు వారు ఇచ్చిన టాస్కులను కంప్లీట్ చేస్తూ ఉండగా వెయ్యి రూపాయలు కమిషన్ వచ్చిందంటూ ఆ యువకుడికి బ్యాలెన్స్ చూపించగా మరిన్ని టాస్కులు కంప్లీట్ చేయగా మరో వెయ్యి రూపాయలు బ్యాలెన్స్ వచ్చింది. ఆ యువకుడు రోజువారీగా వారు చెప్పినట్టుగా టాస్క్ లను కంప్లీట్ చేస్తూ ఉండగా రెండు లక్షల 54 వేల రూపాయలు మీకు కమిషన్ వచ్చిందంటూ నేరగాళ్లు వాట్సాప్‌లో మెసేజ్ పెట్టారు.
ఇక్కడే మొదలైంది అసలైన గేమ్...
మరి ఆ మొత్తాన్ని ఎలా డ్రా చేసుకోవాలో అని సంప్రదించగా మీరు కొంత టాక్స్ నగదు చెల్లించాల్సి ఉంటుందని మొదటగా 20 వేల రూపాయలు చెల్లించాలని నేరగాళ్లు ఇచ్చే నంబర్కు పంపించాలని తెలిపే సరికి తన అకౌంట్ నుండి ఆ నెంబర్కు ట్రాన్స్‌ఫర్ చేశాడు. ఇలా పలు దఫాలుగా వారం రోజుల్లో 1,90,000 నేరగాళ్లు బాధితుడి దగ్గర నుంచి ఆన్‌లైన్ లో ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నారు. తనకు ఇంకా డబ్బులు రావడం లేదని వాట్సాప్ లో మెసేజ్ చేయగా మరో 61 వేల రూపాయలు ట్రాన్స్‌ఫర్ చేస్తే మీరు చెల్లించిన మొత్తం మీరు సంపాదించిన మొత్తం మీకు వస్తాయని అనేసరికి అనుమానం వచ్చిన యువకుడు కొడిమ్యాల పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
ఆ డబ్బు ఇంటి నిర్మాణం కోసం దాచి పెట్టుకున్నాం.. బాధితుడి తండ్రి
తమకు డబ్బులు సరిపోక ఇంటి నిర్మాణం కొరకు 5 లక్షల రూపాయలు లోన్ తీసుకోగా అందులో నుండే తమ కుమారుడు సైబర్ నేరస్తుల చేతిలో పడి డబ్బులు పోగొట్టుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు బాధితుడు తండ్రి. ప్రభుత్వం ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకొని మా డబ్బులు ఇప్పించాల్సిందిగా వేడుకుంటున్నారు. అయితే ట్రాన్సాక్షన్ జరిగిన బ్యాంకు అకౌంట్ల ఆధారంగా నేరస్తులను గుర్తించే పనిలో బిజీగా ఉన్నారు పోలీసులు.
మీకు ఉద్యోగం వచ్చింది అని ఎవరైనా మీకు మెస్సేజ్ పంపినా, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు అని చెప్పినా వాటిని నమ్మకుండా నిజానిజాలు తెలుసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. ప్రముఖ సంస్థల పేరుతో మోసాలు చేసే అవకాశం ఉంది. కనుక కంపెనీ పేరు చెబితే వివరాలు పూర్తిగా కనుక్కుని అది నిజంగా ఉద్యోగమో లేదా కన్సల్టెన్సీనా, వివరాలు కనుక్కుంటే మోసాల బారిన పడే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ముఖ్యంగా మీ బ్యాంక్ వివరాలు, ఓటీపీ అడిగారంటే మాత్రం సైబర్ నేరాలు అని గమనించాలని ప్రజలను అప్రమత్తం చేశారు.